వినాయకుడు గరికను ఎందుకు ఇష్టపడతాడో తెలుసా...

 

వినాయకుడు గరికను ఎందుకు ఇష్టపడతాడో తెలుసా...

 

 

వినాయకుడు తొలి పూజ అందుకునే వాడు.  ఏ పనిలో అయినా ఆటంకాలు లేకుండా సజావుగా జరగడంలో వినాయకుడి కృప తప్పకుండా ఉంటుంది. ఈ కారణంగానే వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని కూడా అంటారు. వినాయకుడి పూజకు ఎన్ని రకాల పువ్వులు వాడినా, ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టినా గరికను పెట్టకపోతే వినాయకుడు అస్సలు తృప్తి పడడు. అయితే వినాయకుడికి ఈ గరిక అంటే ఎందుకంత ఇష్టం? దీని వెనుక కథ ఏంటి? దీని వెనుక ఉన్న పురాణ రహస్యాలు ఏంటి? తెలుసుకుంటే..

తెలుగు వారాలలో ప్రతిరోజూ ఒక దేవుడిని ప్రత్యేకంగా పూజించడం పరిపాటి. సోమవారం శివుడు, మంగళవారం హనుమంతుడికి ప్రాధాన్యత ఇచ్చినట్టే.. బుధవారాన్ని వినాయకుడికి ప్రత్యేకం అని పేర్కొంటారు. బుధవారం నాడు ఉపవాసం ఉండి, భక్తిశ్రద్ధలతో గణపతిని పూజించడం వల్ల భక్తుల కష్టాలు తొలగిపోయి, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం. పూజలో గరిక సమర్పించడం  వల్ల వినాయకుడు తొందరగా తృప్తి చెందుతాడు.  గరిక లేకపోతే వినాయకుడి ఆరాధన అసంపూర్ణం అని చెప్పవచ్చు.

పురాణ కథనం..

 ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం ఒకప్పుడు అనలాసురుడు అనే రాక్షసుడు దేవతలను,  ఋషులను భయపెట్టడం ప్రారంభించాడు. అతను  చేసే  దౌర్జన్యానికి యావత్ సృష్టి నివ్వెరపోయింది. ఈ సమస్యను పరిష్కరించమని దేవతలు వినాయకుడిని ప్రార్థించారు. వినాయకుడు అనలాసురుడిని చంపడానికి అతన్ని మింగేశాడు. కానీ అనలాసురుడి శరీరం వల్ల కలిగే తీవ్రమైన వేడి కారణంగా వినాయకుడు భరించలేని బాధను అనుభవించాడు. ఈ నొప్పిని తగ్గించడానికి ఋషులు గరిక గడ్డిని ఉపయోగించారు. వినాయకుడి   శరీరంపై గరికను ఉంచారట. అలా ఉంచిన వెంటనే మంచ, నొప్పి తగ్గిపోయిందట. దీంతో సంతోషించిన వినాయకుడు తనకు గరిక గడ్డి సమర్పించిన భక్తులకు అన్ని అడ్డంకులు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని వరం ఇచ్చాడట. అప్పటి నుండి వినాయక పూజలో గరికకు  ముఖ్యమైన స్థానం ఏర్పడింది.

గ్రంథాలలో..

వినాయకుడి ఆరాధనలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గరిక గురించి హిందూ మత గ్రంథాలలో కూడా పేర్కొనబడింది. స్కంద  పురాణం,  గణేశ పురాణంలో గరిక వినాయకుడికి  చాలా ఇష్టమని  పేర్కొనడం జరిగింది. గరిక సమర్పించడం వల్ల వినాయకుడు ప్రశాంతంగా ఉంటాడట.

                                                *రూపశ్రీ.