శ్రీ త్రివిక్రమస్వామి ఆలయం, తిరుక్కోవెలూరు పార్ట్ 1

 

 

 

శ్రీ త్రివిక్రమస్వామి ఆలయం, తిరుక్కోవెలూరు పార్ట్ 1

 


                                                      
తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలు గురించి చాలా చెప్పుకున్నాముకదా.  ఒక్కసారి అలా పక్క రాష్ట్రాలలోని ఆలయాలను కూడా చూసొద్దాం.  ఆలయాలకి పెట్టింది పేరు తమిళనాడు.  అక్కడ ఆలయాలన్నీ చాలా పెద్దగా వుంటాయి.  కొన్ని ఆలయాలలో మనం నడిచేసరికే అలసి పోతాము.  దాదాపు అన్ని ఆలయాలలోను శిల్పకళ అద్భుతంగా వుంటుంది.  అయితే అక్కడ మనలాంటి వాళ్ళకి ఇబ్బంది ఒకటే.  బోర్డులన్నీ తమిళంలోనే వుంటాయి.  ఎదురుకుండా ఆలయం చూస్తున్నా అది ఏ దేవుడి ఆలయమో ఎవరినన్నా అడగాల్సిందే. లోపల దైవాల పేర్లు కూడా తమిళంలోనే వుంటాయి  కనుక మనకి పరిచయస్తులైతే ఓహో, ఫలానావారుకదా, అని నమస్కారం చెయ్యటం, కాకపోతే ఎందుకైనా మంచిదని ఒక నమస్కారం చేసి రావటం.  ఇది నాలాంటివారికి కొంచెం బాధగానే వుంటుంది.

 

 

అక్కడికీ కొన్ని ఏళ్ళ క్రితం స్వామి మలైలో మా ఇబ్బంది గురించి ఆఫీసులో చెబితే వారు రాసి ఇమ్మన్నారు.  సరేనని నేను, మావారు మా పరిచయాలు చేసుకుంటూ మరీ రాసిచ్చాం.  ఆలయం గురించి, దేవుళ్ళ గురించి వారి మాతృభాష తమిళంలో ముందు, తర్వాత జాతీయ భాష హిందీ,  తర్వాత చాలామందికి తెలిసే భాష ఇంగ్లీషులో బోర్డులు పెడితే వేరే భాషల వారికి కూడా కొన్ని వివరాలన్నా తెలుస్తాయి.  అంతంత దూరాలనుంచీ వచ్చి వీటికి కూడా ప్రతి వాళ్ళనీ అడగాలంటే ఇబ్బందిగా వుందని.  ఏం చేస్తాం చెప్పండి.  వాళ్ళు బోర్డులు పెట్టలేదని అంత అద్భుతమైన ఆలయాలు చూడకుండా మాన్తామా!??  నా అవస్తలు నేను పడి మీకోసం కొన్ని వివరాలు తెలుసుకొచ్చానుకదా.  అవే  మీకూ చెబుతా.  అంతే.

 

 

విష్ణుమూర్తి  వామనావతారంతో శిబి చక్రవర్తి దగ్గర మూడు అడుగుల నేల దానమడిగి, విశ్వరూపందాల్చి, రెండు అడుగులతో భూమి, ఆకాశం కొలిచి, మూడవ అడుగు ఎక్కడ పెట్టాలని శిబి చక్రవర్తిని అడుగుతాడు.  శిబి చక్రవర్తి తన తలని చూపించగా దానిమీద తన పాదం మోపి ఆయనని పాతాళలోకానికి పంపిస్తాడు.  ఆ విశ్వరూపాన్నే త్రివిక్రముడిగా కొలుస్తారు.  ఈ విశ్వరూపానికి ఆలయాలు తక్కువగానే వున్నాయి.

 

 

అయితే వామనుడు కొలిచిన మూడు అడుగులను సూచిస్తూ తమిళనాడులో మూడు ఆలయాలు వున్నాయి.  భూమిని కొలుస్తున్నట్లు సీర్కళిలో, ఆకాశాన్ని కొలుస్తున్నట్లు తిరుక్కోవలూరు, శిబి చక్రవర్తి తలమీద కాలు పెట్టినట్లు కంచిలో ఈ ఆలయాలు వున్నాయి.  ప్రస్తుతం మనం తిరుక్కోవెలూర్ గురించి తెలుసుకుందాము.

 

ఇది వైష్ణవులకు పరమ పవిత్రమయిన పుణ్య క్షేత్రం.  వైష్ణవ భక్తాగ్రేసరులు, ముదలాళ్వార్లు అని చెప్పబడే పొయగై ఆళ్వారు, పూదత్తాళ్వారు, పేయాళ్వారు మొదట భగవంతుని ప్రత్యక్షంగా దర్శించి, పాశురములను పాడిన దివ్య క్షేత్రమిది.  ఆళ్వారులు దివ్య ప్రబంధాన్ని మొట్టమొదట ఇక్కడ పాడటంవల్ల దివ్య ప్రబంధ అవతార స్ధలంగా కూడా ఈ క్షేత్రం ప్రసిధ్ధికెక్కింది.

 

ఇక్కడ స్వామికి కుడి చేతిలో శంఖం వుంటుంది.  భక్తులకు జ్ఞానాన్ని బోధించటానికి, రెండవసారి త్రివిక్రమునిగా స్వామి సాక్షాత్కరించిన స్ధలంగా కూడా ప్రత్యేకమయినది.

 

ఈ క్షేత్రాధిపతియైన శ్రీకృష్ణుని వైభవం తెలిసి వింధ్య పర్వతంనుండి దుర్గాదేవి వచ్చి స్వామికి రక్షగా ఇక్కడ వుండసాగింది.  ప్రతీ రోజూస్వామికి, అమ్మకి ఆరాధన, నివేదన అయిన తర్వాత దుర్గకు ఆరాధన, నివేదన ఇప్పటికీ జరుగుతున్నది.  తిరుమలై ఆళ్వారు తన పాశురాలలో ఈ దుర్గను కూడా స్తుతించారు.  భక్తులపాలిటి కల్పవల్లి అయిన ఈ దుర్గాదేవికి మంగళ వారం, శుక్రవారమునాడు ప్రత్యేక అర్చనలు జరుగుతాయి.

 

ఇన్ని ప్రత్యేకతలున్న తిరుక్కోవెలూర్ పూర్వం చేర, చోళ, పాండ్య దేశాల మధ్య వుండటంవల్ల నడునాడు అనీ, ఆళ్వారులచే పాశురములలో తిరుక్కోవెలూర్ అని పాడబడటంవల్ల తిరుక్కోవెలూరుగానూ వినుతికెక్కింది. ఈ క్షేత్ర వైభవం బ్రహ్మ పురాణం, పద్మ పురాణాలలో శ్లాఘించబడినది.

 

ఆలయ నిర్మాణం

ఆలయం ఐదు ఎకరాల సువిశాల స్ధలంలో వున్నది.  ఇందులో మూల విరాట్ త్రివిక్రముడితోబాటు ఆంజనేయస్వామి, గరుక్మంతుడు, వేణు గోపాలుడు, లక్ష్మీ నరసింహస్వామి, ఆండాళ్ మొదలగు అనేక ఉపాలయాలు, మండపాలు వున్నాయి.
రెండు వేల సంవత్సరాలకి పూర్వమే ఈ ఊరిలో ఆలయ గోపురాలు కట్టబడ్డాయి అని ఆలయ శిలా శాసనాల ద్వారా తెలుస్తున్నది.  ఆలయంలో 3 పెద్ద గోపురాలు, 4 చిన్న గోపురాలు వున్నాయి.   పాండ్య, పల్లవ, విజయనగర రాజులు, తిరుక్కోవలూర్ ని పరిపాలించిన మళయాళ ప్రభువుల సమయంలో ఈ ఆలయం, గోపురాలు కట్టించి, ఆభివృధ్ధి చేసి, ఆదరించారన్నది అక్కడి శిలా శాసనాలవలన తెలుస్తున్నది.  పెద్ద గోపురం 11 అంతస్తులతో, 192 అడుగుల ఎత్తుతో దర్శకులను ఆకర్షిస్తూవుంటుంది. ఈ ఆలయ నిర్వహణ క్రీ.శ. 1471 నుంచి తిరుక్కోవెలూర్ ఎమ్బెరుమానార్ జియర్ స్వాములు నిర్వహిస్తున్నారు.

 

మూల విరాట్

మేము వెళ్ళినప్పుడు ఆలయంలోని గర్భ గుడిలోకూడా మరమ్మత్తులు జరుగుతూండటం వలన మేము దర్శనం చేసుకోలేక పోయాము.  వేరొక మండపంలో ఉత్సవ విగ్రహాలు వుంచి మూల విరాట్ శక్తులను వాటిలో నిక్షిప్తం చేసి పూజలు చేస్తున్నారు.  ఆ దర్శనమే మాకు లభించింది.  అయితే నేను తెలుసుకున్న మూలమూర్తుల వివరాలు కింద ఇస్తున్నాను…తర్వాత వెళ్ళేవారికోసం.

 

వామనావతారంలో వున్న స్వామి ఉపాలయాన్ని స్వామి చిన్న సన్నిధి అంటారు.  స్వామి చేతిలో గొడుగుతో నిలుచున్న భంగిమలో దర్శనమిస్తాడు.  శ్రావణ మాసంలో శ్రవణా నక్షత్రం రోజున ఇక్కడ విశేష ఉత్సవం జరుగుతుంది. తర్వాత శ్రీ త్రివిక్రముని సన్నిధి.  ఇక్కడ స్వామిది పెద్ద రూపం.  కుడి కాలు పెకి ఎత్తి, పక్కనే వున్న పున్నాగ వృక్షముతో అందంగా వుంటాడు.  కుడి చేతిలో శంఖాన్ని ఎత్తి తనవద్దకు వచ్చు భక్తులకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడని చెప్తారు.  ఎడమ చేతిలో చక్రము, ఒక కాలుతో ఆకాశమును మొత్తము, వేరొక కాలుతో పాతాళమును కొలిచి, మూడవ  అడుగు ఎక్కడ పెట్టవలెను అని బలి చక్రవర్తిని అడుగుతున్నట్లు కుడివైపుకల వేరొక చేతి ముద్ర వుంటుంది.   కుడికాలుకి బ్రహ్మ ఆరాధన చేస్తున్నట్లు, లక్ష్మి, ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి, అతని కుమారుడు నముచి ఎడమకాలును పూజ చేస్తున్నట్లు వుంటుంది.  వీరేకాదు, వామనుడికి దానము చెయ్యవద్దు అని బలి చక్రవర్తికి అడ్డు పెట్టిన శుక్రాచార్యులు, సతీ సమేతంగా మృకండ మహర్షి, ముదలాళ్వార్లు, గరుక్మంతుడు మొదలగువారు స్వామికి ఇరువైపులా కనిపిస్తారు.

 

స్వామి నిలుచున్న భంగిమలో ఇంత పెద్ద విగ్రహము ఇంకెక్కడా లేదంటారు.  లోకములు కొలిచిన స్వామిగనుక ఈ స్వామికి ఉలకళన్ద పెరుమాళ్ అని పేరు.  స్వామికి 108 సాలగ్రామాల మాల, నడుముకి దశావతార ఒడ్డాణము వుంటాయి.
ఇంకొక విశేషమేమిటంటే ఈ విగ్రహాలన్నీ చెక్కతో చేసినవి.  అందుకే అభిషేకము ఉత్సవ మూర్తులకు మాత్రమే.

 

స్ధల వృక్షము

ఈ ఆలయ స్ధల వృక్షము పొన్న చెట్టు.  ఆలయ ప్రాకారంలోని   వేణు గోపాల స్వామి ఆలయం దగ్గర వున్నది.
స్వామిని ఊహించుకుంటూ వుండండి.  స్ధల పురాణం వచ్చే వారం తెలుసుకుందురుగాని.

 

.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)