సీతారామకళ్యాణం తెలుగువారికే సొంతమా!

 

 

 

సీతారామకళ్యాణం తెలుగువారికే సొంతమా!

 

 

చైత్రశుద్ధ నవమినాడు, మధ్యాహ్నం పన్నెండుగంటల వేళకి రాములవారు జన్మించారన్నది పురాణగాథ. అందుకే భారతదేశమంతా ఆ రోజు శ్రీరామనవమి పేరుతో ఘనంగా జరుపుకొంటారు. కొన్ని చోట్ల రామకథలను గానం చేస్తారు. కొన్ని ప్రాంతాలలో రాముని విగ్రహాన్ని ఊయలలో వేసి ఆడిస్తారు. ఇంకొన్ని ప్రాంతాలలో సీతారాముల విగ్రహాలను ఊరేగిస్తూ రథయాత్రను నిర్వహిస్తారు. కానీ ఒక్క తెలుగనాట మాత్రమే వాడవాడలా సీతారామకళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు.

 

తెలుగువారు రాముని తమవాడిగా భావిస్తారు. రాముని తల్లి కౌసల్యాదేవిది ఆంధ్రదేశమే అని చాలామంది నమ్మకం. అందుకనే రాముని వనవాసానికి పంపినప్పుడు, తన తల్లి రాజ్యమైన ఆంధ్రదేశంలో కూడా సంచరించాడట. ఆ సమయంలో ఆయన భద్రాచలంలోని పర్ణశాలలో ఉన్నాడనీ, అక్కడే రావణాసురుడు సీతమ్మవారిని అపహరించాడనీ చెబుతారు. ఆ తరువాత వానరసైన్యంతో కలిసి రాముడు లంకకు చేరుకోవడం, అక్కడ రావణాసురుని సంహరించడం తెలిసిందే!

 

రాముని జీవితం భద్రాచలంతో ఇంతగా ముడిపడి ఉంది కాబట్టి... అక్కడి ఆలయంలో వైభవంగా సీతారాముల కళ్యాణం చేసే ఆచారం మొదలై ఉంటుంది. భద్రాచల రాముని ఆలయాన్ని పునర్నిర్మించిన కంచర్ల గోపన్నే ఈ  ఆచారాన్ని మొదలుపెట్టి ఉంటాడని అంటారు. అలా భద్రాద్రిలో మొదలైన ఆచారం ప్రతి పల్లెకూ విస్తరించింది. 

 

జీలకర్ర బెల్లం పెట్టడం, మంగళసూత్రం కట్టడం, తలంబ్రాల పోసుకోవడం... ఇలా ఈనాటి తెలుగింట జరిగే వివాహంలాగానే సీతారాముల కళ్యాణం జరుగుతుంది. రాముని తెలుగింటి పిల్లవాడిగా, ఇక్కడే వనవాసం చేసిన అతిథిగా గుర్తిస్తూ... ఆయన జన్మించిన 12 గంటల సమయంలోనే కళ్యాణ ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. ఆ సీతారామకళ్యాణంతో లోకమంతా సుభిక్షంగా ఉంటుందని భావిస్తారు.

 

- నిర్జర.