రామ అన్న శబ్దం ఇంత గొప్పదా!

 

 

రామ అన్న శబ్దం ఇంత గొప్పదా!

 

 

 

భగవంతుని ఎన్ని పేర్లతో పిల్చుకుంటే మనలో తపన తీరుతుంది? ఎన్ని లక్షల నామాలతో స్తుతిస్తే మన తనివి తీరుతుంది? అందుకనే విష్ణు మూర్తి వేయి నామాలని విన్న తరువాత కూడా పార్వతీదేవికి ఒక సందేహం కలిగింది...

కేనోపాయేన లఘునా విష్ణోర్నామసహస్రకమ్ |
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో ||

‘ఈ విష్ణుసహ్రనామాలని పండితులు క్లుప్తంగా ఎలా పఠించగలరో సెలవియ్యండి’ అంటూ పరమేశ్వరుని కోరింది పార్వతీదేవి. అందుకు పరమేశ్వరుడు...

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||

వేయి సహస్ర నామాలను పఠించడం వల్ల కలిగే పుణ్యం... ‘రామ’ అన్న శబ్దాన్ని స్మరించడం వల్ల కలుగుతుందని పరమేశ్వరుడు జవాబుని ఇచ్చాడు. విష్ణుసహ్రనామం ఉత్తర పీఠికలో ఈ సంవాదం మనకి కనిపిస్తుంది.

రామా రామా అంటూ సాగే రాముని స్మరణ మాత్రమే (శ్రీరామ రామ రామేతి), సుందరాకారుడైనా ఆ రామునిపై మనసుని లగ్నం చేస్తుంది (రమే రామే మనోరమే), ఓ సుందరీ! ఆ రామ నామమే వేయి నామాలకు సమానంగా నిలుస్తుంది(సహ్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే) అంటూ పండితులు పై శ్లోకానికి అర్థం చెబుతూ ఉంటారు.

‘రామ’ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని పెద్దల నమ్మకం. వారి దృష్టిలో అది సంసారాన్ని తరింపచేసే బీజాక్షరం. హరిని పూజించే అష్టాక్షరి మంత్రం- ‘ఓం నమో నారాయణాయ’లో ‘రా’ అనే శబ్దం ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే శివుని ధ్యానించే పంచాక్షరి మంత్రం- ‘ఒం నమః శివాయ’లో ‘మః’ అన్న చోట శబ్దం హెచ్చుగా ధ్వనిస్తుంది. ఈ రెండు ప్రముఖ శబ్దాలను కలిపితే ‘రామః’ శబ్దం ఉత్పన్నమవుతుంది. అంటే శివకేశవులిద్దరి కలయికగా రాముని కొలుచుకోవచ్చునన్నమాట.

‘రామ’ అన్న శబ్దంలోనే రమించడం అన్న అర్థం వస్తుంది. భగవంతునిలో ఐక్యమవ్వాలని చెప్పే సూఫీ తత్వానికైనా, మధుర భావనతో కృష్ణుని పొందాలనుకునే గోపికలకైనా ఈ సూత్రం వర్తిస్తుంది. పైగా ‘ర’ అన్న శబ్దం అగ్నితత్వం కలిగిన శబ్దమని పారమార్థిక పదకోశం పేర్కొంటోంది. అంటే జన్మజన్మలుగా ఆత్మను అంటిపెట్టుకుని ఉన్న కర్మఫలాలను దగ్ధం చేయడానికైనా, శరీరాన్ని వేధించే రోగాల నుంచి ఉపశమనం పొందడానికైనా.... ‘రామ’ అన్న శబ్దంతో మమేకం అయితే చాలునన్నమాట!

- నిర్జర.