రాముడు నడయాడిన నేల- పర్ణశాల
రాముడు నడయాడిన నేల- పర్ణశాల
భద్రాచలంలో రాములవారి ఆలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, అక్కడికి దగ్గరలో ఉన్న పర్ణశాలకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. భద్రాచలానికి కొద్ది దూరంలో ఉన్న పర్ణశాలలో రాములవారు సీతాసమేతంగా నివసించారని చెబుతారు. ఈ పర్ణశాల నుంచే రావణుడు సీతమ్మవారిని ఎత్తుకుపోయాడట. ఆ సమయంలో జటాయువు అనే పక్షి సీతమ్మను కాపాడే ప్రయత్నం చేయగా, భద్రాచలానికి సమీపంలో ఉన్న యేటపాక అనే స్థలంలో రావణాసురుడు, జటాయువుని అంతమొందించాడన్నది స్థలపురాణం.
రాముడు పర్ణశాలలో నివసించాడనేందుకు తగిన ఆధారాలున్నాయంటున్నారు కొందరు పరిశోధకులు. డా॥ రామ్ అవతార్, వి.డి. రామస్వామి వంటివారు రామాయణ ఘట్టాలు, స్థానిక ఇతిహాసాల ఆధారంగా ఈ విషయాన్ని ధృవీకరించేందుకు ప్రయత్నించారు. అయోధ్య మొదలుకొని లంక వరకు వనవాస సమయంలో రాముడు సాగించిన యాత్రను వీరు భారతదేశ పటంలో గుర్తించారు. డా॥ రామ్ అవతార్ అయితే ఇలా ఏకంగా 195 ప్రాంతాలను గుర్తించారు. వీటిలో భద్రాచలం కూడా ఒకటి. రాముడు దండకారణ్యంలో యాత్రను సాగిస్తూ, అనేక ఆటంకాలను ఎదుర్కొంటూ..... దండకారణ్యంలో భాగమైన భద్రాచలంలో విడిది చేశారట. ఇక్కడ సీతమ్మవారు చీరను ఆరవేసిన గుర్తులు, ఆమె సేకరించిన కుంకుమరాళ్లు తదితర గుర్తులను ఇప్పటికీ స్థానికులు చూపిస్తూ ఉంటారు.
భద్రాచలం నుంచి రాములవారు సీతమ్మను వెతుక్కుంటూ పంపానదీ తీరంలో శబరినీ, ఆ తరువాత రుష్యమూక పర్వతం మీద సుగ్రీవునీ కలుసుకున్నారట. ఇక అక్కడి నుంచి సాగిన రామాయణ కథ అందరికీ తెలిసిందే! అయితే మన భద్రాచలంలో పర్ణశాల ఉన్నట్లు మహారాష్ట్రలోని నాసిక్ క్షేత్రంలో పంచవటి అనే ప్రదేశం ఉంది. సీతాపహరణం జరిగింది అక్కడే అని స్థానికుల నమ్మకం. ఇంతకీ సీతాపహరణం భద్రాచలంలోనా, నాసిక్‌లోనా అన్న వివాదాన్ని పక్కన పెడితే గోదావరీ తీర ప్రదేశాలైన ఈ రెండు క్షేత్రాలలోనూ రాములవారు గడిపి ఉంటారని నిస్సందేహంగా భావించవచ్చు.
...Nirjara