Read more!

ఆచారమే ప్రధానం

 

ఆచారమే ప్రధానం

 

వేదములు అపౌరుషేయములు – అవి మానవమాత్రులచే రచింపబడినవి కావు. వేద పురుషులు ఒక దేశానికి మాత్రమే సంబంధించినవారు కాదు. అందుకే అవతారమూర్తి మానవులను ఉన్నత మానసిక స్థితిలోకి నడిపించి ఆధ్యాత్మిక సూత్రాలను వారు అర్థం చేసుకుని, సత్ప్రవర్తనతో (మంచి ఆచరణతో) పరిస్థితులను బాగు చేసుకునేటట్లు చేయడం వారి లక్ష్యం.

భగవాన్ అందించిన ముఖ్య ఆధ్యాత్మిక సూత్రాలు

“Life is a game, play it జీవితమొక క్రీడ, నీ ఆట నువ్వు ఆడు.

“Life is challenge, meet it జీవితమొక సవాలు, ధ్యైర్యంగా ఎదుర్కో.

“Life is a dream, realise it జీవితమొక స్వప్నమని గ్రహించు.

“Life is love, enjoy it జీవితం ప్రేమమయం, ప్రేమయే జీవితంగా అనుభవించు, ఆనందించు.

“Life is a song, sing it జీవితమొక గేయం, మధురంగా గానం చెయ్యి.

అనే నగ్న సత్యాల్ని అర్థం చేసుకుని, వాటిలో ఇమిడి ఉన్న పవిత్ర భావాల్ని గ్రహించి, ఆచరణలో పెట్టాలి. అప్పుడు జీవిత నాటక రంగంలో మానవుడు తన పాత్రను తను సక్రమంగా, ఉత్తమంగా పోషించుకోగలుగుతాడు.

ఎంత జగన్నాటక సూత్రధారి, ప్రయోక్త అయినా, భగవాన్ కూడా ఆదర్శపాత్రధారిగా వారి నటనను వారు అద్వితీయంగా ప్రదర్శించారు. వారు ఆచరించి చూపాలి కదా. జీవితంలో ఎదురయ్యే ద్వంద్వాలు, సమస్యలు, పరిష్కారాలు భగవాన్ సత్యసాయి బాబా చెప్పినట్లు వివేకంతో, విచక్షణతో మంచిగా ఉంటూ, మంచిని చేస్తూ, ‘జంతూనాం నరజన్మ దుర్లభం’ అన్నట్లు సలక్షణంగా, విలక్షణమైన విధంగా జీవించటానికి ప్రయత్నిస్తే, జీవితమంతా ‘మూడు పువ్వులు, ఆరు కాయలుగా’ వర్ధిల్లుతుంది. ఎల్లెడలా ఆనందం, శాంతి వెల్లివిరుస్తాయి.

ఈ విధంగా ఎవరికి వారే ఆచరిస్తుంటే, వ్యక్తి నుండి సమాజానికి, దేశానికి, ప్రపంచానికి వ్యాపిస్తాయి. “ఆధ్యాత్మిక చింతనలో అహంకారం దూరం అవ్వాలి. అహంకారంతో ఆశలు పెరుగుతుంటాయి. ఆశలు పక్షి, మృగాలకి లేనేలేవు. స్వార్థం, ఆశలు మానవులకే. ప్రేమతో ప్రపంచాన్ని ఒక్కటి చెయ్యాలి. ప్రేమ లేకపోతే ద్వేషం వస్తుంది. ఈ ద్వేషం మానవత్వాన్ని నాశనం చేస్తుంది.

అందరినీ భగవంతుని బిడ్డలుగా, తోబుట్టువులుగా చూడాలి. ప్రేమను అభివృద్ధి చేసుకుని సర్వమానవ సౌభ్రాతృత్వమును పెంపొందించుకోవాలి. నీవు ఇతరులను ప్రేమిస్తే వారు కూడా నిన్ను ప్రేమిస్తారు. అందరినీ నీవు ప్రేమించినవో ద్వేషము నీ దరిదాపులకు రాదు. నేను బోధించేది అదే” అన్నారు బాబా.

ప్రబోధలు, ప్రచారాలు కాదు. ఆచారం ముఖ్యం. ఇదే కలియుగానికి ధర్మం. మంచి మాటలచేత ఆదర్శవంతమైన మార్గములచేత మానవులలోని దుర్గుణాల్ని, దుష్టభావాల్ని హతమార్చి, వారిని సన్మార్గులుగా సరిదిద్దిన అద్వితీయుడు, సత్యరూపుడుగా సత్యసాయి అవలంబించిన పద్ధతులు కూడా అమోఘంగానే ఉంటాయి.

‘నా జీవితమే నా సందేశం’ అని స్వామి తరుచుగా అనేవారు. ఈ వ్యాకం మన నిత్య జీవిత పథాల్ని మహోజ్జ్వల కాంతితో నింపగలదు. నా జీవితమే నా సందేశం అని చెప్పగల వ్యక్తులు ప్రపంచంలో అంతటా ఉన్నారు. కాని వారికి అలా అనగల శక్తిలేదు. వారి మాటలు విజ్ఞాన భరితులుగా ఉన్నా. వారి జీవితం మాత్రం వాటికి అనుగుణంగా ఉండదు. ఆమాటల్ని శ్రద్ధగా పరిశీలిస్తే సామాన్య మానవుడు దీనిని గ్రహించడానికి, ఆచరించడానికి ప్రయత్నిస్తాను అని మాత్రమే అనగలడు.

ఆచరణలో కొంత సఫలం, కొంత విఫలం కావచ్చు. వైఫల్యమే ఎక్కువగా ఉండొచ్చు. అందుకే ఉపనిషత్తులు ‘సత్యం వద, ధర్మం చర’ అని బోధిస్తాయి. అధిక సంఖ్యాకులు సత్యం పలకలేరు, కొద్దిమంది మాత్రమే ధర్మ మార్గాన్ని అనుసరించగలరు. కానీ, స్వామి మాత్రం మీరు సత్యం పలకండి, ధర్మాన్ని ఆచరించండి అని ఎవరినీ కోరలేదు.

సత్యం ధర్మం లోపలి నుంచి సహజంగా బహిర్గతమయ్యే నైజాలు. అదే విధంగా ఏవో శాస్త్రాలు అధ్యయనం చేసి ఏది ధర్మమో గ్రహించి, దానిని ఆచరించడానికి ప్రయత్నం చేయదలచటం కాదు, ధర్మం మనలో అంతర్గతమై ఉంది. దానిని నీటి ఊటవలె బయటకు రానీయడమే ధర్మాన్ని ఆచరించడం అంటారు బాబా. అందుకే స్వామి, “నేను సత్యం పలుకుతాను. నేను పలికేదే సత్యం” అని ధీమాగా అనగల్గుతున్నారు.

ఆ విధంగానే “ధర్మం నా ఆచారం. నేను ఆచరించేదే ధర్మం” అని ఉద్ఘాటిస్తారు. సత్యస్వరూపమే దైవం. నామములు వేరుగా ఉన్నా దైవత్వము ఒక్కటే. ప్రతి మానవుడు దైవ స్వరూపుడే. ‘ఈశావాస్యమిదం సర్వం. వాసుదేవ స్సర్వమిదం’ అన్నదే మానవునకు మధ్య ఉన్న సంబంధ బాంధవ్యములను అభివృద్ధి చేస్తుంది. దైవాన్ని విశ్వసించాలి. సత్యాన్ని పాలించాలి. ధర్మాన్ని ఆచరించాలి. అదే జీవిత సార్ధకత.