శ్రీ సత్యసాయి ప్రేమమయుడు (Sri Satya Saibaba)

 

శ్రీ సత్యసాయి ప్రేమమయుడు

(Sri Satya Saibaba)

 

శ్రీ సత్యసాయి లక్షణాలు, లక్ష్యాలు, ఫలితాలు మనం అర్థం చేసుకోవాలి. భగవాన్ మనకి అందించిన ఆదర్శాన్ని చక్కగా గ్రహించాలి. ఆ ధర్మం అందివ్వడం అనుకున్నప్పుడు ఇంకో విషయం జ్ఞాపకం వస్తున్నది. 1994 జన్మదిన సందర్భంగా భగవాన్ దివ్వోపన్యాసంలో ఇలా అన్నారు.

‘నారాయణుడు నరావతారం దాల్చినను తన నిబంధనలు ఆచరించక తప్పదు. విశ్వమునకు తాను సూత్రధారి అయినను తాను ఒక పాత్రధారుడే అనేది సత్యం, తన పాత్రోచితమైన కర్మలు, ప్రవక్తలు ఆచరించకపోయినా, మతి తప్పినా, శ్రుతి తప్పినా, ఈ మార్గము కళ తప్పును. దివ్యత్వము అయినా, మానవాకారము ధరించిన మానవాకార ఆదర్శసూత్రములు అందించవలెను’

ఆ విధంగా “ఏ అవతారంలోనైనా పాత్రోచితంగా నడుచుకుంటాడు. కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు? At the right time. భగవంతుడు జగన్నాటకంలో సమయానుకూలంగా ప్రవర్తిస్తాడు.

“నా జీవితమే నా సందేశం” కదా సాయికి. ఇంకో విషయం కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. భగవాన్, కరుణామూర్తి. తమ అనంత ప్రేమతత్వంతో ఎంతో మంది భక్తులు. ఎక్కడెక్కడ ఉన్నా వారి జబ్బులు, సమస్యలు తీసుకుంటుండటం మనకి తెలిసిందే కదా! పరమాత్మ మానవశరీరం ధరిస్తారా అని కొందరు సందేహంగా ప్రశ్నిస్తారు. దానికి సమాధానంగా స్వామి సమాధానం మనకి కనువిప్పు కలిగిస్తుంది.

“మనిషికి ఆనందం మనిషి రూపం ద్వారానే లభిస్తుంది. అతడు ఆత్మప్రభోధాన్ని, ఉత్తేజాన్నీ, ఆత్మ సాక్షాత్కారాన్నీ మానవభాషలోనూ, మానవ సంభాషణల్లోనూ మాత్రమే పొందగలడు.” భగవంతుడు మానవ రూపంలో, భాషలో, సంభాషణలో, మానవునికి ఉత్తేజాన్ని ఇస్తుంటాడు.

భక్తుడు కూడా భగవంతునికి ప్రేమతో, స్వఛ్చతతో దగ్గరవ్వాలి. ‘రా రా, మా ఇంటి దాకా అని పవిత్రంగా, ఆర్తిగా ప్రార్ధిస్తూ, ఆయన పాదాలను ఆశ్రయించాలి. పాదములందున్న పవిత్ర దివ్యశక్తి అనూహ్యము. బ్రహ్మ కడిగిన పాదమని, లక్ష్మివత్తిన పాదమని మన పురాణములు పాదముల ప్రాధాన్యతను నిరూపిస్తాయి.

రాముడు తన తమ్మునికి ఇచ్చిన పవిత్ర పాదుకలను భరతుడు హస్తాలతో తీసుకుని, తన శిరస్సుపై ధరించాడు. రాజ్యాన్ని రామపాదుకలే ఏలుతూ వచ్చాయి. అటువంటి పవిత్రమైన పావనమైన శక్తి సామర్ధ్యాలు ఇమిడియున్న రామపాదుకల్నిభరతుడు ఆనందంతో పొగుడుతూ ‘ఇవి కరుణ సముద్రుడు ధరించిన పాదుకలు కావు. సకల జనులు ప్రాణమును రక్షించు రక్ష. భరతుని స్నేహరత్నమును కాపాడునట్టి సంపుటము. రఘు కులమును రక్షించు రెండు కవాటములు. ఇవి సుకర్మలు చేయునట్టి రెండు హస్తములు. ఇవే లోక నేత్రములు. ఈ రెండు పాదుకలు మన వెంట వచ్చు సీతారాముల చిహ్నములు’, అని గంతులు వేస్తూ భరతుడు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

మరి ఈ సందర్భంగా భగవాన్ చెప్పిన “కష్టసుఖాల్ని కర్మలనకండి. మన ఇష్టమౌనండీ, పట్టువీడక ఆ పాదము గొలచిన గట్టు చేర్చుట తధ్యమండీ” ఎంత నిజమో కదా! ఆ విధానంగానే సమయం, సందర్భాన్ని బట్టి, భగవంతుడు తాను ఎన్నుకొన్న, ఏర్పరచుకొన్న కార్యక్రమ లక్ష్యాలు, లక్షణాలు, సంకల్పాల్ని బట్టి అనేక పేర్లతో వ్యవహరింపబడుతాడు.

భగవంతుని కార్యక్రమాలు మూడు. సృష్టి, స్థితి, లయము. “బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండములనెల్ల విష్ణువెంత పెంచి వృద్ధి చేయు. పరమశివుడు ద్రుంచు పాపిష్టిజీవుల... మూడు క్రియల కూర్చునొకడే” అంటే సృష్టిని గావించే వాడు బ్రహ్మ. రక్షణ కర్తను విష్ణువుగాను, బ్రహ్మ చేత సృష్టింపబడి విష్ణువు చేత కాపాడబడిన ఈ జగత్తును సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టి, దివ్యత్వానికి దారి చూపే వాడు శివుడుగాను అన్నాడు. కాని దైవత్వం ఒక దివ్యశక్తిగా నిర్గుణం, నిరంజనం, సనాతనంగా భావించి వేదము ‘ఈశ్వర స్సర్వ భూతానాం’ అన్నది ఈశ్వరతత్వం మానవుని యందే కాక పశుపక్షి మృగాదులందు కూడా ఉంటున్నది.

ప్రతి మానవుని హృదయంలోనూ ప్రేమ అను అమృతత్వం ఉంటుంది. మానవుని స్వస్వరూపం ఇదే. ఇది భగవంతుని ద్వారా లభించేది. భగవంతుడనే బంగారాన్ని (స్వర్ణము, హిరణ్యము) మానవుడు హృదయంలో పెట్టుకుంటే సత్యం, ధర్మం, శాంతి, అహింస అనే నగలను చేయించుకోవచ్చు.

అపరిమితమైన దివ్యశక్తులు, హృదయంలో కలిగిన వాడు కనుక భగవంతుని హిరణ్యగర్భుడంటారు. ఈ హిరణ్యగర్భతత్వం మితంగా అందరు మానవుల్లోనూ ఉంటుంది. అందుచేత మానవులు రసస్వరూపుడు, హిరణ్యగర్భుడైన పరమాత్మను పూర్తిగా విశ్వసించి జీవితాన్ని ధన్యం చేసుకోవాలి.

అంతేకాని స్వార్ధ స్వప్రయోజనాల కోసం “ధైవధ్యానాలు, బోనాలు చేస్తూ, రంగ, లింగాయంచు దొంగ మ్రొక్కులు మొక్కటం” కాదు. జ్ఞాన సంపన్నుడైన భగవాన్ నుండి ఇంత జ్ఞానబోధను పొందుతున్న మనం చాలా అదృష్టవంతులం అనుకోవాలి!

జన్మ, జన్మల సుకృతంగా దొరికిన ఈ అదృష్టాన్ని అందరం సద్వినియోగపరుద్దాం.” సంకలనం – తూములూరు ప్రభ