గణపతి సచ్చిదానంద ప్రవచనాలు (Sri Ganapati Sachchidananda Pravachanalu)

 

గణపతి సచ్చిదానంద ప్రవచనాలు

(Sri Ganapati Sachchidananda Pravachanalu)

 

సత్యానికి సోపానాలు

 

‘నాది’, ‘నేను’ అన్న భావనలు అహంకారానికి ప్రతీకలు. కోరికలే దుఃఖ హేతువులు. భూమి మీద జన్మించిన ప్రతి మానవుడూ తనకోసం ధనాన్నో, వస్తువులనో సంపాదించుకోవడం కోసం పడరాని పాట్లు పడుతుంటారు. కోరికలను జయిస్తే పరమాత్మకు దగ్గరవుతాము. బౌద్ధమతం చెప్పే సారాంశమిదే. వేదాంత సారాంశమూ ఇదే!

ప్రపంచంలో నావి అనుకునేవేవీ నావి కాదు. అన్నీ పరమాత్మవే. ఇంటికి నేను యజమానిని, విశ్వానికి పరమాత్మ యజమాని. గృహం విశ్వం నుంచి వేరు కాదే! అలాంటప్పుడు గృహం కూడా భగవంతునిదే. నేను అద్దెకు ఉంటున్నాను. అంతే. అద్దెకు ఉండేవాడు ఇంటిని, ఇంటిలోని సౌకార్యాలను వినియోగించుకుంటాడు. అలా చేయడంలో తప్పులేదు. ‘ఇది నాది’ అనుకుంటేనే బాధ. ఆ క్షణం నుంచే దుఃఖము ప్రారంభమవుతుంది.

యజమాని ఇల్లు అద్దెకిచ్చినట్లు పరమాత్మ మనకు సమస్తాన్ని ప్రసాదించాడు. ఇల్లిచ్చాడు, ఒళ్ళిచ్చాడు, కళ్ళిచ్చాడు, కాళ్ళిచ్చాడు, భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, బిడ్డల్ని అనుగ్రహించాడు. ఆహారాన్నిచ్చాడు, పానీయాన్నిచ్చాడు, ఆస్తులిచ్చాడు, ఆత్మీయుల్ని ఇచ్చాడు, ప్రకృతినిచ్చాడు, ప్రాణాన్నిచ్చాడు. ఇవన్నీ మనకే. కాని, అవి మనవి కావు.

బండి రాలేదని ప్లాట్ఫారం మీద కుర్చీలో కూర్చొని నిరీక్షిస్తున్నాం. బండి వచ్చింది. లేచి వెళ్ళి బండినెక్కాం. అంతవరకు కూర్చున్న కుర్చీని త్యజించి వెళ్ళాం. ఎందుకని? అది మనది కాదు. సర్కారు వారిది. వస్తువు ప్రభుత్వానిది. వినియోగం మనది. బండి పోతూ ఉంది. పక్కన కూర్చున్న వారి చేతిలో పత్రిక ఉంది. అడిగి తీసుకున్నాం. చదువుకున్నాం. విషయాలు తెలుసుకున్నాం, స్టేషన్ వచ్చింది. వారి పత్రికను వారికిచ్చి దిగిపోతాం. పేపరు పక్క వారిది. వినియోగం మనది.

ఈ ప్రపంచంలో అంతా వినియోగమే. విని అర్థం చేసుకోవడమే. ఈ సత్యం వంటపడితే బ్రతుకే నైవేద్యమవుతుంది. ఆ తరువాత ఏది లభించినా ప్రసాదంగా భాసిస్తుంది.

బండి రాలేదని కుర్చీలో కూర్చుని నిరీక్షిస్తున్న మనం కాఫీ తాగటానికి లేచి వెడుతూ, “ఏమండీ! నా కుర్చీ చూస్తూ ఉండండి” అని చెప్పి వెళ్తాము. అంటే, మళ్ళీ వచ్చి వినియోగించుకుంటామని అర్థం. అక్కడ “నా కుర్చీ” అని పలికామే గానీ ఆ కుర్చీ మనది కాదని, సర్కారు వారిదని ఇతరులకు తెలియకపోయినా మనకు మాత్రం స్పష్టంగా తెలుసు. “నా కుర్చీ” అనేది సత్యం కాదు.

అన్నీ అంతే, కుర్చీలో కూర్చుని బండి వచ్చిన క్షణాన నాది కాదని కుర్చీని వదిలి లేచి వెళ్ళినట్లు, మృత్యువు ఆసన్నమైన క్షణాన సమస్తాన్ని వదలి ప్రయాణం సాగించాలి. అద్దె ఇంటిని ఆనందంగా వదలినట్లు, కుర్చీని ఫ్లాట్ ఫారంపైనే వదలి బండెక్కినట్లు, బండిలో పేపరు చదివి బండి దిగేముందు అది ఎవరిదో వారికిచ్చినట్లు, ఈ ప్రపంచంలో మనకున్నవన్నీ పరమాత్మవే కనుక అతడు ఏ క్షణాన తిరిగి ఇవ్వమని అడిగినా ఆలోచించకుండా హాయిగా తిరిగి అప్పగించడానికి ఎప్పుడూ సంసిద్దంగా ఉండాలి. ఇలా ఉండేవాడే భక్తుడు. భగవంతునికి ప్రియుడు.

ఈ సత్యాలన్నీ స్పటికంలాగ చక్కగా బోధపడుతూ ఉన్నా కూడా ’నాది’ అనే మమకారాన్ని మనిషి వదలడంలేదు. మమకారం అనేది చర్చించినంత తేలికగా పోదు. అహంకారం ఉన్నంతవరకు మమకారం దూరం కాదు. కనుకనే, ఈ ప్రపంచంలో జీవించి యున్నంత కాలం ఏదో కొంత త్యాగం చేస్తూ పోవాలి. దానం చేస్తూ ఉండాలి. ఇవి చేయడంలో ప్రధానమైన విషయం ‘సేవ’ కాదు అనే సత్యాన్ని అందరూ గ్రహించలేరు. సేవ రెండవ విషయం.

వంటలెన్నో తయారవుతున్నాయి. అయినా ఆకలి మంటలు తీరటం లేదు. అది వంటవాని తప్పు కాదు, వడ్డించే వాని తప్పుకాదు, తినడానికి అలవాటు పడనపుడు ఎన్ని వంటలు చేసి ఏం ప్రయోజనం? మస్తకాలు సిద్ధపడకపోతే పుస్తకాలు చేసేది ఏమీ ఉండదు. బుద్ది శుద్దిపడకపోతే భాధలు రుచించవు, రుచించినా ఫలితాలను ప్రసాదించవు. మార్పును అందరూ వాంఛిస్తారు. మారేందుకు ఎవ్వరూ సిద్ధపడరు. అవును మార్పు చాలా బాధాకరమైనది. అందుచేతనే మారాలనుకున్నా, మనుషులు మారలేకపోతారు.

ఎవరు ఎవరినీ మార్చవలసిన పని లేదు. మహిమలో తాను వెలుగుతూ ఉంటే, మార్పులు రాదలచుకుంటే వస్తాయి. రాకూడదనుకుంటే విశ్రాంతి తీసుకుంటాయి. ఈ అవగాహన ఉంటే చాలు గొప్ప మార్పు వచ్చినట్లే.