శ్రీరాముడు పుట్టింది ఎప్పుడు!
శ్రీరాముడు పుట్టింది ఎప్పుడు!
ఏటా చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామనవమిని జరుపుకోవడం హైందవులకు ఆనవాయితీగా వస్తోంది. రాముడు కేవలం ఒక కాల్పనిక పాత్ర కాదనీ, ఆయన సజీవంగా నడయాడిన మహోన్నతుడనీ భారతీయుల నమ్మకం. అందుకు తగినట్లుగానే, రాముడు త్రేతాయుగంలో జన్మించారనీ, ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన పుట్టి ఉంటారనీ కొందరు అంచనాలు కూడా వేస్తూ వచ్చారు. కానీ ఇటీవలి కాలంలో పుష్కర్ భట్నాగర్, ఆయన స్నేహితురాలు సరోజ్ బాల ఈ విషయం మీద చేసిన పరిశోధన విస్తృతంగా ప్రచారాన్ని పొందింది. భారతీయ రెవెన్యూ సర్వీస్ (IRS)లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న ఈ ఇద్దరూ కూడా పురాణాలనీ, జ్యోతిష్యాన్నీ, ఖగోళ శాస్త్రాన్నీ దృష్టిలో ఉంచుకుని శ్రీరాముని జన్మసమయం క్రీ.పూ 5114వ సంవత్సరం, జనవరి 10 మధ్యాహ్నం 12:05గా తేల్చారు.
శ్రీరాముని జన్మసమయం గురించి పరిశోధన చేసేందుకు పుష్కర్ భట్నాగర్, అమెరికా నుంచి ‘ప్లానెటోరియం’ అనే సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారు. ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో ఏ రోజున గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చునట. శ్రీరాముడు పుట్టిన సమయంలో గ్రహాల స్థితి ఎలా ఉందో వాల్మీకి బాలకాండలో ఎలాగూ వర్ణించారు. రాముడిది కర్కాటక లగ్నమని చెబుతారు వాల్మీకి. ఆయన జన్మసమయంలో సూర్యుడు మేషంలోను, కుజుడు మకరంలో ఉన్నాడనీ.... రాములవారి జన్మకుండలిలోని గ్రహసంచారాన్ని రాసుకొస్తారు. ఈ సమాచారాన్నంతా సాఫ్ట్‌వేర్ సాయంతో క్రోడీకరించిన పుష్కర్ భట్నాగర్‌కు సదరు జన్మ సంవత్సరం తేలింది. ఇక చాంద్రమానం ప్రకారం ఆ రోజు చైత్రశుద్ధ నవమి అని తేలడంతో, ఆయన వాదనకు బలం చేకూరినట్లైంది. ఇంతేకాదు! రామాయణంలో ఉట్టంకించిన గ్రహస్థితులను బట్టి... రాములవారు అరణ్యావాసం చేసిన సమయం (5089 BC), హనుమంతుడు సీతను లంకలో కలుసుకున్న సంవత్సరం (5076 BC) తదితర కాలాలను కూడా నిర్ణయించామంటున్నారు భట్నాగర్. భట్నాగర్ చెబుతున్న విషయాలతో అందరూ ఏకీభవిస్తున్నారనుకోవడానికి లేదు. కానీ రాముని చారిత్రక పురుషునిగా నిరూపించేందుకు ఆయన చేసిన ప్రయత్నాన్ని మాత్రం అభినందించక తప్పదు.
..Nirjara