శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి - కాలజ్ఞానం - 7 (Sri Potuluri Virabrahmendra Swami Kalagnanam)

 

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి - కాలజ్ఞానం - 7

(Sri Potuluri Virabrahmendra Swami Kalagnanam)

 

దుర్మార్గులే రాజులుగా మారతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకరమైన కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారు.

లోకమంతా అవినీతిమయంగా ఉంది. నేరగాళ్ళు, మోసగాళ్ళు ప్రజా పాలకులుగా మారుతున్నారు. మనదేశంలోనే కాదు, అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రజలను పాలించేవారు అవినీతిపరులు, దుర్మార్గులు ఉండటం చూస్తూనే ఉన్నాం.

ధనవంతులు మాత్రమే పాలకులుగా మారుతున్నారు. వారికి ధన సంపాదనే ధ్యేయం. ఈ ప్రయత్నంలో సామాన్య ప్రజల కష్టాల గురించి ఎవరికీ పట్టడం లేదు. ఒక పేదవాడు నేతగా మారటం దుస్సాధ్యంగా మారింది.

మత కలహాలు పెరిగి ఒకర్నొకరు చంపుకుంటారు...

దేశ విభజన సమయంలో కూడా హిందువులు, ముస్లింలు ఒకర్నొకరు చంపుకున్నారు. ఇటీవల కూడా గుజరాత్ లో నరమేధం జరిగింది. ఇక్కడ ముందుగా ముస్లింలు మత కల్లోలాలను ప్రారంభించారు. వారు రైల్లో ప్రయాణిస్తున్న కొందరు హిందువులను సజీవదహనం చేయడంతో, హిందువులు ముస్లింలను వందల సంఖ్యలో హతమార్చారు. ఇలాంటి విషాదకర సంఘటనలు పెచ్చుమీరుతున్నాయి. క్రమంగా అన్ని మతాల్లోనూ ఉన్మాదుల సంఖ్య పెరిగిపోతోంది.

అడవి మృగాలు అడవులలో నుంచి గ్రామాలు, పట్టణాల లోకి ప్రవేశిస్తాయి.. మానవులను చంపుతాయి...

పెరుగుతున్న జనాభాకు అవసరాలు కూడా పెరుగుతున్నాయి. దానివల్ల వారు పొలాల కోసం, కలప కోసం లక్షల ఎకరాల్లో అడవులను నరికి, వాటిలో పంటలు పండిస్తున్నారు. ఫలితంగా అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. దీనివల్ల అక్కడ ఉండాల్సిన పులులు, ఏనుగులు, జింకలు, ఎలుగుబంట్లు మొదలైనవి ప్రజలు నివసించే గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. మనుషులను హతమారుస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి.

నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు..

బ్రహ్మంగారు పుట్టి, జ్యోతిష్యం చెప్పిన సమయానికి మారుమూల పల్లెలే కాదు, పట్నాల్లోకి కూడా ఎలక్ట్రిక్ దీపాలు రాలేదు. అసలు వాటి గురించి ఎవ్వరూ ఊహించలేదు కూడా. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చింది. కరంట్ ఉత్పత్తిలోని సూత్రం ఇదే. నీటినుంచే విద్యుత్తు వస్తోంది.ఈ శక్తి నీళ్ళ నుంచి ఆవిర్భవిస్తోందనేది మనందరికీ తెలుసు. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ళ కిందటే బ్రహ్మంగారు చెప్పగలగడమే విచిత్రం.

సందర్భం వచ్చింది కనుక ఇక్కడ ఒక అద్భుతాన్ని గుర్తుచేసుకుందాం. షిర్డీ సాయిబాబా కూడా ఒకసారి నీటితోనే దీపాలు వెలిగించారు. వివరంగా చెప్పాలంటే..

సాయిబాబాకు రోజూ వ్యాపారులు నూనె ఉచితంగా ఇచ్చేవారు. అయితే ఒకరోజు ''ఈ ఫకీరుకు ఉచితంగా నూనె ఎందుకివ్వాలి?'' అనుకుని వ్యాపారులు తమవద్ద నూనె లేదన్నారు. దాంతో సాయిబాబా తిరిగివచ్చి నూనె డబ్బాలో నీటిని పోసి దానితోనే దీపాలను వెలిగించినట్లు బాబా చరిత్రలో ఉంది.

విదేశీయులు వచ్చి భారత దేశాన్ని పరిపాలిస్తారు..

మరీ ప్రాచీనకాలంలో చూస్తే హూణులు తదితరులు, ఆ తర్వాత ముస్లింలు, తర్వాత డచ్ వారు, పోర్చుగీసువారు, తర్వాత బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించారు. వందల సంవత్సరాలు పాలించారు. భారతీయుల్లో సహజంగా ఉన్న అనైక్యత వల్లే విదేశీయులు మనదేశాన్ని పరిపాలించగలిగారు. ఈ పరిణామాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి ఎన్నడో ఊహించారు.

మాచర్ల లోని రాజులందరూ ఒక స్త్రీ కారణంగా తన్నులాడుకుని మరణిస్తారు..

పల్నాటి యుద్ధం గురించి చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలే కదా! నాయకురాలు నాగమ్మ వల్ల పల్నాడు స్మశానంగా మారిపోయింది. చిన్న చిన్న పట్టింపులు, పౌరుషాల వల్ల యుద్ధం జరిగి వేలాదిమంది హతమారిపోయారు.

పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. దీనివల్ల కొన్ని గ్రామాల్లో ప్రజలు మరణిస్తారు.. దీని గురించి ఖచ్చితమైన వివరణ ఇవ్వలేము. ఇది విమానాల్లో నుంచి వదిలే బాంబులు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. వియత్నాం యుద్ధంలో జరిగింది ఇదే. అక్కడ ఎక్కువగా గ్రామాలపైనే అమెరికా సేవలు దాడులు జరిపాయి. అక్కడ వామపక్ష గెరిల్లాలు గ్రామాలనుంచే తమ సాహసోపేతమైన పోరాటం చేశారు. అమెరికా సేనలను భయకంపితులను చేశాయి.

ఒకరి భార్యను మరొకరు వశపరచుకుంటారు. స్త్రీ, పురుషులు కామంచేత పీడితులవుతారు.

ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు స్త్రీ, పురుషుల్లో కామ వాంఛ పెరిగింది. నైతిక విలువలు క్రమంగా తగ్గుతున్నాయి.

వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాలను దోచుకుంటారు..

ఇప్పుడు ప్రతిరోజూ ఏదో ఒక దేవాలయంలో దొంగలు పడటం మామూలయింది. ఒక్క వెంకటేశ్వర దేవాలయం అని ఏమిటి.. అన్ని దేవాలయాల్లో దొంగతనాలు సాధారణం అయ్యాయి.

మహమ్మదీయులు వందల సంఖ్యలో హిందువుల దేవాలయాలను సర్వనాశనం చేశారు. గుజరాత్ లోని అత్యంత సుసంపన్నమైన సోమనాథ ఆలయం మీద ముస్లిం చక్రవర్తుల వరుసగా అనేకసార్లు దండయాత్రలు చేసి అక్కడి సంపదను మొత్తం దోచుకుని వెళ్లారు.

5 వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది..

ఈ కాల పరిణామం సరస్వతీ నది విషయంలో అక్షరాలా జరిగింది. వేదకాలం నాటి సరస్వతీనది ప్రస్తుతం అంతర్ధానమై పోయినా, శాటిలైట్ ద్వారా ఆ నది గతంలో ప్రవహించిందని శాస్త్రవేత్తలు ధ్రువీకరించిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

గంగ విషయంలో జరుగుతుందో లేదోననే సందేహమే అక్కర్లేదు. ఇప్పటికే గంగానది ఉధృతి తగ్గింది. ఎండిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

చెన్నకేశవస్వామి మహిమలు నాశనమైపోతాయి.. కృష్ణానది మధ్య ఒక బంగారు తేరు పుడుతుంది. దాన్ని చూసినవారికి ఆ కాంతివల్ల కనులు కనబడవు.

ఇది ఇప్పటివరకూ జరగలేదు కానీ, ఇకముందు జరిగే అవకాశం ఉంది.

ప్రపంచంలో ఇకముందు పావుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది.

దీనికి సాక్ష్యాలు, నిదర్శనాలు అక్కరలేదు కదా! కళ్ళముందు కనిపిస్తున్న సత్యమే. ఇప్పుడు నడుస్తున్నది కలియుగం. అంటే, న్యాయం, ధర్మం ఒంటి కాలిమీద నడుస్తున్నాయి. మంచివారి సంఖ్య గణనీయంగా తగ్గింది. మోసం, ద్వేషం రాజ్యమేలుతున్నాయి.