శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి - కాలజ్ఞానం - 6 (Sri Potuluri Virabrahmendra Swami Kalagnanam)

 

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి - కాలజ్ఞానం - 6

(Sri Potuluri Virabrahmendra Swami Kalagnanam)

 

వీరబ్రహ్మేంద్రస్వామి తనకు తెలిసిన భవిష్యత్ విషయాలను వివిధ సందర్భాల్లో చెప్పుకుంటూ వెళ్లారు.

అంతే కాకుండా వీరబ్రహ్మేంద్రస్వామి వివిధ ఊళ్లు తిరుగుతూ ఉండేవారు. ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ తినేవారు, విశ్రమించేవారు. కాలజ్ఞాన ఉపదేశం చేసేవారు.

అందువల్ల కాలజ్ఞానం ఒక క్రమ పద్ధతిలో ఉండదు.

వీరబ్రహ్మేంద్రస్వామి తాను రాసిన కాలజ్ఞానంలో ఎక్కువ బనగానపల్లెలో ఒకచోట పాతిపెట్టారు. తర్వాత దానిపైన ఒక చింతచెట్టు మొలిచింది. ఈ చింతచెట్టు వయసు 4,5 వందల సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారించారు.

ఈ చింతచెట్టుకు స్థానికులు పూజలు చేస్తూ ఉంటారు. ఈ చెట్టునుంచి కొన్నిసార్లు ఎర్రని ద్రవం వస్తుందని, స్థానికులు చెప్తారు. ఈ చెట్టుకు కాసే చింతకాయలు తినేందుకు పనికిరాకపోవడం ఆశ్చర్యం.

వీరబ్రహ్మేంద్రస్వామి, అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తూ ఉంటారు.

అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్యం

వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. వావీ వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు.

ఇది అక్షర సత్యం అయింది. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చినవారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి.

రాజులు తమ ధర్మాన్ని మరిచిపోతారు. వారు విలాసాలు, విందుల్లో మునిగితేలుతూ ఉంటారు. ధర్మభ్రష్టులవుతారు.

ఇక్కడ రాజులు అంటే, పాలకులు అని అర్ధం. వారు రాజులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధులు కావచ్చు. అనేక రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, దేశాల ప్రధాన మంత్రులు కూడా అవినీతి కుంభకోణాలలో చిక్కుకోవడం పత్రికల ద్వారా ప్రజలకు వెల్లడి అవుతోంది. పార్టీ ఏదైనా ప్రజా ప్రతినిధులు అత్యధిక శాతం అవినీతికి పాల్పడుతున్నారు.

శాంతమూర్తులకు కూడా విపరీతమైన కోపం వస్తుంది. వివిధ వర్ణాలవారు తమ ఆచారాలను వదిలి ఇతరుల ఆచారాలను అనుసరించి నాశనమవుతారు.

నిజమే కదా.. మానసిక వత్తిడి విపరీతంగా పెరిగిన దరిమిలా శాంతమూర్తులు కూడా ఆవేశానికి, ఆగ్రహానికి లోనవడం మనం చూస్తూనే ఉన్నాం.

పైర్లు సరిగా పండవు. పాడి పశువులు పాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల కరువు భయంకరంగా పెరుగుతుంది..

మొదట తెలంగాణా లోని కొన్ని జిల్లాల్లో మాత్రమే కరువు ఉండేది. ఇప్పుడు రాయలసీమలో కూడా కరువు పెరిగిపోయింది. దీన్ని తట్టుకోలేక రైతులు పొలాలను వదిలేసి కూలీలుగా పట్నాలకు వలస వెళ్లిపోవడం సాధారణంగా మారిపోయింది. నీటికి కరవులేని కోస్తా జిల్లాల్లో కూడా ఇప్పుడు కొత్తగా నీటి సమస్య మొదలైంది. దీనివల్ల పంటలు కూడా పండని పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తు ఇంకా ఘోరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బ్రాహ్మణులు తమ ధర్మాలను, పౌరోహిత్యం వదిలి ఇతర కర్మలను చేపడతారు. దానివల్ల అంతా అల్లకల్లోలంగా మారుతుంది.

పోతులూరి చెప్పిన కాలంలో ఇది విడ్డూరమే. అప్పట్లో ఏ కులంవారు, ఆ కులవ్రుత్తి చేపట్టేవారు. ఇప్పుడు కులవృత్తులు లేవు. ఎవరికీ ఏ పని ఇష్టమైతే, ఆ పనిలో స్థిరపడుతున్నారు.

చోళ మండలం నష్టమైపోతుంది..

తుఫానులు ఎక్కువగా తమిళనాడు తీరాన్ని తాకుతూ ఉంటాయి. ఈ కారణంవల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుకు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. ఏనుగుకు పంది పుడుతుంది. పందికి కోడి పుడుతుంది..

ఇలాంటి వింత సంఘటనలు తరచుగా పేపర్లలో చదువుతూనే ఉన్నాం. కుక్కకు పిల్లి, పంది కడుపున కోతి పుట్టిన ఉదంతాలు ఫొటోలతో సహా వార్తల్లో చూశాం. వివిధ జన్యు కారణాలవల్ల ఇలా జరుగుతోందని శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. వీటిని ఏ విధంగానూ ఆపలేమని కూడా శాస్త్రజ్ఞులు చెప్పారు.

వావీవరసలు తగ్గిపోతాయి. తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని దూషించడం చాలా సాధారణం అవుతుంది..

తండ్రీకొడుకులు ఒకర్నొకరు దూషించుకోవడమే కాదు, హత్యలు చేసుకోవడం ఎక్కువయ్యాయి. ఆస్తి పంచి ఇవ్వలేదనే కోపంతో తండ్రిని, తల్లిని హత్య చేసిన కొడుకుల కధలు ఎన్నో ఉన్నాయి. తాను చెప్పిన మాట వినలేదని కొడుకును, కోడళ్లను తండ్రి తగలబెట్టాడనే కధనం ఆమధ్య వార్తల్లో వచ్చింది. పైగా ఆ తండ్రి ఒక వైద్యుడు కూడా. ఇలాంటి వార్తలు కొల్లలుగా వింటున్నాం. కనుక బ్రహ్మంగారి మాట బ్రహ్మవాక్కే.

శిలలు కండలు కక్కుతాయి. ఆ కండలు తినేందుకు ఆకాశం నుంచి గద్దలు వచ్చి నేలపైన వాలతాయి. వెంటనే చస్తాయి. ఆ చచ్చినవాటిని పట్టుకుని ప్రజలు గంతులు వేస్తారు.

ప్రజలు కొరువులు (సిగరెట్లు, బీడీలు కావచ్చు) నోట కరచుకుని తిరుగుతారు. కొండలు మండుతాయి.

చిన్నాపెద్దా తేడా లేకుండా, ఆడా మగా తారతమ్యం లేకుండా ఎందరో సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. బహుసా ఇది ఇంకా పెరుగుతుంది కావచ్చు. ఇక కొండలు మండటం అంటే, అగ్ని పర్వతాలు అని సూటిగానే తెలుస్తోంది. నిజానికి అగ్ని పర్వతాలు భారతదేశంలో ఎక్కడా లేవు. ఇవి ఆగ్నేయాసియా దేశాల్లో, యూరప్ దేశాల్లో మాత్రమే కనపడతాయి. వాటిని గురించి బ్రహ్మంగారు 500 ఏళ్ళ కిందట చెప్పటం ఆశ్చర్యకరంగా ఉంది.

జనుల కడుపులో మంటలు పుడతాయి. నోట్లో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాలపాలయి జనులు మరణిస్తారు. అలాగే పశువులు, క్రూర మృగాలు కూడా చస్తాయి.

పూర్వంతో పోలిస్తే ఇప్పుడు వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. అయినా సరే, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. క్షయ లాంటి ఎన్నో జబ్బులకు అద్భుతమైన మందులు కనిపెట్టారు. కానీ, కాన్సర్, ఎయిడ్స్ లాంటి వ్యాధులు భయపెడుతున్నాయి. దీనికి పంటల్లో వాడే ఎరువులు, వాతావరణ కాలుష్యం, మన అలవాట్లు, జీవనశైలి లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. మొత్తానికి ఈ పరిణామాన్ని వందల సంవత్సరాల కిందటే చెప్పడం అద్భుతం.

అణు బాంబుల వల్ల అణు ధూళి ఏర్పడుతుంది. దీనివల్ల బ్లడ్ కాన్సర్ , ఇతర రోగాలు వస్తాయి. నోట్లో బొబ్బలు రావడం కూడా అణు ధూళి చూపించే ప్రభావం వల్లే. అణు బాంబు ప్రభావం వల్ల మనుషులే కాకుండా క్రూర మృగాలు, పశువులు కూడా కోట్ల సంఖ్యలో మరణించాయి. మొత్తమ్మీద ఇక్కడ చెప్పినవి అన్నీ అణు బాంబుల వల్ల కలిగే దుష్పరిణామాలే అని అర్ధం చేసుకోవచ్చు.