శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి - కాలజ్ఞానం - 8 (Sri Potuluri Virabrahmendra Swami Kalagnanam)

 

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి - కాలజ్ఞానం - 8

(Sri Potuluri Virabrahmendra Swami Kalagnanam)

 

క్షీణించిపోతున్న ధర్మాన్ని కాపాడి, పాపాత్ములను శిక్షించేందుకు నేను ఐదువేల ఏళ్ళ తర్వాత వీరభోగ వసంతరాయలుగా తిరిగి అవతరిస్తాను. .అప్పుడు నా భక్తులందరూ తిరిగి నన్ను చేరుకుంటారు. ..

దీనికి ఇంకా చాలా సమయం ఉంది. వందల ఏళ్ళు జరగాల్సిఉంది.

విజయనగరం కొన్నాళ్ళు అత్యంత వైభవంగా వెలుగుతుంది. ఆ తర్వాత ప్రాభవం కోల్పోయి నాశనమైపోతుంది.

ఇది ఒక చారిత్రక వాస్తవం. శ్రీకృష్ణదేవరాయల తర్వాత విజయనగర సామ్రాజ్యంలో అంతః కలహాలు ఏర్పడి, అసమర్థులు, భోగలాలసులైన చక్రవర్తుల నేతలుగా మారారు.

మరోవైపు మహమ్మదీయుల దండయాత్రల వల్ల ఆ మహా సామ్రాజ్యం బలహీనమవడం ప్రారంభించింది. మిగిలిన భారతీయ రాజుల మాదిరిగానే కర్నాటక, ఆంధ్ర ప్రాంత రాజుల్లో అనైక్యత వల్ల కూడా విదేశీయులైన మహమ్మదీయులు విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేయగలిగారు.

వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు.

వేంకటేశ్వరునికి మహమ్మదీయ వనిత బీబీ నాంచారి భార్య అనే విషయం అందరికీ తెలిసిందే. బీబీ నాంచారిని మహమ్మదీయులు పూజిస్తారు కాబోలు.

కృష్ణా గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చచ్చేను.

కృష్ణా గోదావరి నదులు సముద్రంలో కలిసే చోటు మన రాష్ట్రంలోనే ఉంది. గతంలో కృష్ణా జిల్లాలో వచ్చిన తుఫానుల వల్ల వేల సంఖ్యలో పశువులు మృతి చెందిన విషయం అందరికీ తెలుసు.

తూరుపు నుంచి పడమర వరకు ఆకాశంబున యోజన ప్రమాణం వెడల్పుగా చెంగావి చీర కట్టినట్టు కనపడుతుంది.

ఇది కూడా అణ్వస్త్రాల వల్ల కలిగే ఫలితమే. అణుబాంబు వల్ల పుట్టే ఎర్రని మంటలు ఆకాశాన్ని కప్పివేసినట్టు కనబడ్డాయి.

ఇలా వీరబ్రహ్మేంద్రస్వామి, అచ్చమ్మకు కాలజ్ఞానం ఉపదేశించారు. ఆయన బోధనల వల్ల క్రమంగా అచ్చమ్మలో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోవడం మొదలై, జ్ఞానజ్యోతి ప్రజ్వరిల్లడం ప్రారంభం అయింది.

అచ్చమ్మ గారి ద్వారా క్రమంగా బ్రహ్మంగారి గురించి అందరికీ తెలిసింది. ఆయనకు ఒక శిష్యగణం తయారైంది. తన శిష్యులకు, భక్తులకు జ్ఞాన బోధ చేస్తూ కాలం గడపడం మొదలుపెట్టారు బ్రహ్మంగారు.

అచ్చమ్మ కుమారుడికి దృష్టిని ప్రసాదించడం

అచ్చమ్మకు ఒక కుమారుడు ఉండేవాడు. అతడి పేరు బ్రహ్మానందరెడ్డి. అతనికి అంధత్వం ఉండేది. ఎంతమంది వైద్యులను సంప్రదించినా అతనికి ఇక చూపు రాదనీ తేల్చి చెప్పారు వారు. అచ్చమ్మ బ్రహ్మంగారికి తన కుమారుడి విషయం చెప్పింది.

అతనికి పూర్వజన్మ ఖర్మం వల్ల చూపు పోయిందని ఆయన చెప్పారు. దృష్టి తెప్పించమని అచ్చమ్మ అడగగా, తగిన సమయంలో ఆ పని చేస్తానని అప్పటివరకూ ఓపిక పట్టమని బ్రహ్మంగారు సూచించారు.

ఒకసారి అన్నాజయ్య అనే దైవభక్తిపరుడు బ్రహ్మంగారి మఠానికి వచ్చారు. ఆయనకు తన కాలజ్ఞానం వినిపించాలని నిర్ణయించుకున్నారు.

ఇది పూర్తయిన తర్వాత బ్రహ్మంగారు అచ్చమ్మను పిలిచారు. ''తల్లీ, నీ కుమారుడు గత జన్మలో ఒక మహిళ దృష్టి కోల్పోవడానికి కారకుడయ్యాడు కాబట్టే, ఈ జన్మలో ఇలాంటి దుస్థితి ఏర్పడింది. అయినప్పటికీ నేను అతనికి తిరిగి దృష్టిని ప్రసాదించగలను'' అన్నాడు.

తర్వాత బ్రహ్మానందరెడ్డిని పిలిచి అతని నేత్రాలను స్పృశించారు. బ్రహ్మానందరెడ్డికి అప్పటినుంచి కళ్ళు మళ్ళీ కనబడటం ప్రారంభమైంది.

అన్నజయ్యకు చెప్పిన కాలజ్ఞానం

ఈ కాలజ్ఞానం లోని కొన్ని సంగతులు గతంలో అచ్చమ్మకు చెప్పినట్టుగానే కనబడుతున్నాయి.

ఎంతోమందీ మార్బలం ఉన్న రాజులు కూడా సర్వ నాశనమైపోతారు. గ్రామాల్లో చోరులు పెరిగిపోతారు.

గతంలో జరిగిన యుద్ధాల్లో ఈ పరిణామం సంభవించింది. శ్రీకృష్ణుని నిర్యాణం జరగబోయే ముందు కూడా జరిగినది ఇదే కదా. అర్జునుడు యాదవ స్త్రీలను తీసుకుని వస్తుంటే దారిలో చోరులు అర్జునుడిమీద, అతని సైన్యం మీద దాడి చేస్తారు. వారిమీద తన మహాస్త్రాలను ప్రయోగించ దలచుకున్నప్పటికీ ఒక్క అస్త్రం కూడా గుర్తురాక నిస్సహాయుడైపోతాడు అర్జునుడు. అదంతా కలియుగ ప్రభావమే అని చెప్తాడు వ్యాసుడు.

పిడుగులు పడి నదులు ఇంకిపోయేను...

ఉల్కల వల్ల ఈ పరిణామం సంభవించవచ్చని కొందరి అభిప్రాయం. ఉల్కలు పడిన సమయంలో పిడుగు వంటి శబ్దాలు వస్తాయి. ఉల్కాపాతం వల్లే ఒకప్పుడు ఈ భూమిమీద తిరుగాడిన మహాకాయులైన డైనోసర్లు తుడిచిపెట్టుకుపోయాయి. చిన్న పిడుగు పడితేనే ఎంతోమంది మనుషులు మరణిస్తున్నారు. అలాంటిది ఉల్క పడితే, ఏ ప్రమాదమయినా సంభవించవచ్చు.

విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్టు, నిల్చున్నవారు నిల్చున్నట్టు హతమారిపోయేరు..

రాత్రింబగళ్ళు గద్దలు గుంపులు కూడి అరుస్తాయి. నీటియండు చేపలు తాము చచ్చేమని తలచి బయటకు వస్తాయి..

పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి, భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమౌతుంది.

శ్రీశైలం శిఖరాన అగ్ని వర్షం పుడుతుంది. నందీశ్వరుడు రంకెలు వేస్తాడు. ఖనఖనమని కాలు దువ్వుతాడు.

సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది.

ఇది పురాణాలలో ఉంది. అశరీరవాణి తరచుగా సత్య నిర్ధారణ చేయడం ఎన్నొ సందర్భాల్లో మనం పురాణాలు, ఇతిహాలాసాల్లో కూడా చదువుకున్నాం. బహుసా అప్పుడు చెప్పిన అశరీరవాణి ఇదే కావచ్చు.

విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు నిండుతుంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్లో జరిగిన విషవాయువు లీకేజ్ వల్ల వేలాదిమంది ప్రజలు మరణించగా, లక్షలాదిమందికి అనేక రుగ్మతలు కలిగాయి. ఆ దుర్ఘటన బాధితులకు ఇప్పటికీ పూర్తీ స్థాయిలో న్యాయం జరగలేదు.