భగవత్ సృష్టి మాల్యాద్రి
భగవత్ సృష్టి మాల్యాద్రి
శ్రీ నరసింహ క్షేత్రాలు – 7
ప్రతి రోజూ ఉదయం, సాయంకాలం పండగ రోజుల్లో ఇంకా ఎక్కువ సమయం దర్శనమిచ్చే దేవతా మూర్తులను మనం ప్రతి దేవాలయంలో చూస్తాము. కానీ వారానికొక్క రోజు మాత్రమే భక్తులమీద వరాల జల్లు కురిపించే దైవం గురించి మీకు? ఆయనే ప్రకాశం జిల్లా, వలేటివారి పాలెం మండలంలో మాలకొండ పై వెలసిన శ్రీ జ్వాలా నరసింహస్వామి. అంతేకాదు, అలిగిన చెలి అలక తీర్చి దేవేరితో సహా కొండపై కొలువున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. మరి ఈ స్వామి గురించి విశేషాలు తెలుసుకుందామా?
భగవంతుడి సృష్టిలోని ప్రతి అణువూ భగవంతుడికి ఎంతో ప్రీతిపాత్రమయినది. ఆ భక్త వత్సలుడు భక్తుల కోరిక మీద అనేక ప్రదేశాలలో అర్చా మూర్తిగా వెలిసి ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు. అయితే ఇక్కడ స్వామి ఆవిర్భావానికి ఆ శ్రీమహాలక్ష్మి కారణం. అదెలాగంటే.... ఒక రోజు వైకుంఠంలో లక్ష్మీ నారాయణులు ముచ్చటించుకుంటున్న సమయంలో తన దేవేరిని శ్రీమన్నారాయణుడు మనసులో ఏదన్నా కోరిక వుంటే చెప్పమని అడుగుతాడు. దానికి ఆ జగజ్జనని సాక్షాత్తూ లోకారాధ్యుడినే పతిగా పొందిన తనకి వేరే కోరికలేముంటాయనీ, కానీ కలియుగంలో భూలోకవాసులకు భగవన్నామ స్మరణ ముక్తి మార్గమంటారు. ఆ భగవన్నామ స్మరణలో పునీతులవుతూ కొందరు పుణ్యక్షేత్రాలు దర్శించి, అక్కడ తీర్ధాలలో స్నానం చేసి, ఆ దేవతలను దర్శించి తరిస్తున్నారు. అయితే భూ లోకంలో వున్న అతి తక్కువ క్షేత్రాలు దర్శించి మోక్షం పొందటానికి తమ బిడ్డలు వ్యయ ప్రయాసలకోర్వలేకుండా వున్నారని, అందుకని స్వామి దర్శనం తేలిగ్గా పొందటానికి ఒక దివ్య క్షేత్రం సృష్టించమని కోరుతుంది.
లోకపావని కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు భూలోకంలో తమ నివాసానికి ఒక అందమైన పర్వతం సృష్టించమని వన దేవతకి చెబుతాడు. ఆవిడ ఇక్కడ ఈ అందమైన పర్వతాన్ని సృష్టించింది. ఈ కొండపై నీటి వనరులు, అనేక రకాల పుష్ప, ఫల, ఔషధ జాతి వృక్షాలు, వాటిని ఆశ్రయించిన అనేక పక్షుల కలకలారావాలతో, అడవి జంతువులతో భూతల స్వర్గమా అన్నట్లున్నది. వన దేవత పుష్ప మాల ఆకృతిలో సృష్టించిందిగనుక ఈ కొండని మాలాద్రి అని కొందరంటారు.
ఈ కొండకి పడమర దిక్కున అహోబిలం, వాయవ్య దిక్కులో శ్రీశైలం, దక్షిణ దిక్కులో వృషాచల క్షేత్రం, తూర్పు దిక్కులో శింగరాయకొండ .. ఇవ్వన్ని మాల ఆకారంలో అమరి వుండటంతో ఈ కొండని మాలాద్రి అని ఇంకొందరంటారు. ఆ శేషతల్పశాయి తమ భక్తురాలయిన వనమాలను తమ విహారార్ధం భూలోకంలో ఒక కొండని సృష్టించమంటే, ఆ భక్తురాలు ఆ జగజ్జననీ జనకుల పాద స్పర్శకోసం తానే కొండగా మారిందనీ, అందుకే మాలాద్రి అంటారనీ ఇంకొక కధ. ఏది ఏమైనా, షుమారు పది చదరపు మైళ్ళ విస్తీర్ణతతో కొన్ని గుహలు, రాళ్ళు ఏ ఆధారము లేకుండా వ్యాపించి వుండటం చూస్తే ఇది దైవ నిర్మితమనిపిస్తుంది ఒక్కొక్క రాతి క్రింద షుమారు రెండు మూడు వందలమంది విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా వున్న గొడుగు బండలు, గుహలు ఇక్కడ చాలా చూడవచ్చు. అంతటి అందమైన ప్రదేశంలో లక్ష్మీ సమేతంగా శ్రీమన్నారాయణుడు నరసింహ రూపంలో విహరించసాగాడు.
చతుర్ముఖ బ్రహ్మ రోజూ ఈ కొండకి వచ్చి స్వామిని సేవించేవాడు. అగస్త్య మహాముని తన దివ్య దృష్టితో ఈ కొండపై విహరిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహమూర్తిని చూసి, ఈ పుణ్య క్షేత్రం తన తపస్సుకు అనువైనదని, ఇక్కడకొచ్చి, స్వామికోసం కఠోర తపస్సు చేశాడు. ఆయనకి ఒకరోజు సాయంసంధ్యా సమయంలో ఎర్రని రంగు, ఎర్ర పీతాంబరాలు, ఎర్రని ఆభరణాలతో, స్వామి సాక్షాత్కరించాడు. అగస్త్య మహామునికి ఎర్రని కాంతితో జ్వాలా రూపంలో సాక్షాత్కరించాడుగనుకు ఆయనకి జ్వాలా నరసింహస్వామి అనే పేరు వచ్చింది.
సాక్షాత్కరించిన స్వామిని అగస్త్య మహర్షి భూలోకవాసుల పాపాలు పటాపంచలు చేసి, వాళ్ళని ఉధ్ధరించటానికి అక్కడే జ్వాలా నరసింహరూపంలో శాశ్వతంగా నిలిచిపోవాలని కోరాడు. అగస్త్యుడు స్వామిని ఇంకొక కోరిక కూడా కోరాడు...తనబోటి మునులు, యక్షులు, కిన్నెరలు, దేవతలు వగైరావారికి స్వామి దర్శనం లభించటంకోసం వారంలో ఒక్క రోజు, శనివారం మాత్రం మానవులకి కేటాయించి మిగతా ఆరు రోజులు ఋషి పూజలు అంగీకరించమని, అలా చేస్తే అటు దేవతలు, మునిగణాలకు ఆయన దర్శనంభాగం లభిస్తుందనీ, ఇటు మానవులుకూడా స్వామిని సేవించి తరిస్తారనీ వేడుకున్నాడు.
భక్తుని కోరికను మన్నించిన శ్రీ నరసింహస్వామి అక్కడ జ్వాలా నరసింహస్వామిగా వెలిశాడు. అప్పటినుంచీ యుగ యుగాలుగా కోట్లాది భక్తులు దుర్గమముగా వున్న ఆ కొండ ఎక్కి ప్రతి శనివారము శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవించి తరిస్తున్నారు. మిగతా ఆరు రోజులూ ఇక్కడ స్వామిని సేవించటానికి దేవ, మునిగణాలు వస్తాయని అంటారు. తర్వాత కాలంలో దీనిని నమ్మని కొందరు స్వామి దర్శనాన్ని ప్రజలకు ప్రతి రోజూ కల్పించాలని అనేకసార్లు ప్రయత్నించారుగానీ, వారి ప్రయత్నాలు ప్రతిసారీ విఫలమయ్యాయి.
ఈ మాల్యాద్రి మీద అనేక తీర్ధాలున్నాయి. పూర్వం మార్కండేయ మహర్షి బ్రహ్మదేవుని వలన ఈ గిరి ప్రాశస్త్యాన్ని గురించి విని రోజూ ఇక్కడికి వచ్చి స్వామిని సేవించసాగాడు. ఈ స్వామిని సేవించి తరించినవారి కధలు ఎన్నో వున్నాయి. ఒకసారి భానుమానుడనే రాజు మాల్యాద్రి వైభవంగురించి విని తానుకూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవించి తరించాలనే ఆశతో మాల్యాద్రికి వచ్చాడు. అయితే అక్కడ పూజారి లేడు. అర్చకుడు లేని పూజ నిష్ప్రయోజనమని బాధపడి భానుమానుడు ఆ రోజంతా నిరాహారంగా అక్కడే వుండిపోయాడు. మరునాడు స్వామినర్చించటానికి బ్రహ్మదేవుడు రాగా, స్వామి ఆయనతో భానుమానుడు నా దర్శనార్ధము వచ్చి నా సేవకోసం నిరాహారుడుగా వేచియున్నాడు. అర్చకుడు లేని కారణంగా ఆ రాజు నన్ను సేవించటం కుదరలేదు. కనుక నువ్వు వెంటనే ఒక అర్చకుడిని సృష్టించి, శనివారంనాడు మాత్రం మానవ పూజకై కేటాయించి, మిగతా వారాలలో దేవ, ఋషి పూజలు జరిగేటట్లు ఏర్పాటు చెయ్యమని ఆనతిచ్చాడు.
బ్రహ్మదేవుడు తన సంకల్పంచే నృసింహాచార్యుడనే సకల శాస్త్రవేత్త, భక్తి తత్పరుడైన బ్రాహ్మడుని సృష్టించి ఆయన ప్రతి శనివారం మానవులకోసం పూజాదికాలు నిర్వర్తించునట్లు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రోజునుంచీ, ఈ రోజువరకూ ప్రతి శనివారం మాల్యాద్రి పై శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ప్రజలు సేవించి తరిస్తున్నారు.
శ్రీ మహలక్ష్మీ ఆలయం
దేవతలకు కూడా అలకలూ, ఈర్ష్యాసూయలూ వుంటాయా? ఏమో!? వున్నాయని చెప్పే కధలు మాత్రం అక్కడక్కడా వున్నాయి. అలాంటిదే ఈ కధ. ఇక్కడ పూర్వం స్వామితో వున్న లక్ష్మీదేవి ఒకసారి స్వామి మీద అలిగి కొండపైకి వెళ్ళిందట. వెళ్ళేదోవలో పెద్ద బండరాయి అడ్డుగా వున్నది. దేవి ఆగ్రహానికి ఆ బండ పగిలి, పెద్ద చీలికలా ఏర్పడి, అమ్మవారు కొండమీదకి వెళ్ళటానికి త్రోవ ఇచ్చిందిట. ఇప్పటికీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని దర్శించాలంటే ఆ త్రోవలో కొండపైకి దాదాపు 200 మెట్లు ఎక్కి వెళ్ళాల్సిందే. బండ చీలికలా ఏర్పడితే వచ్చిన త్రోవగనుక కొంత ఇరుకుగా వుంటుంది. ఆ త్రోవను చూస్తే స్ధూలకాయులు వెళ్ళలేరనిపిస్తుందిగానీ, వారుకూడా ఏ ఇబ్బందీ లేకుండా తేలికగా వెళ్ళగలగటమే ఇక్కడి అద్భుతమంటారు.
శివాలయం
శివకేశవులకు బేధం వుండదని పెద్దలు చెప్పే మాటను గుర్తుచేస్తూ ఇక్కడ ఒక గుహలో శివాలయం వున్నది. దానికి కొంచెం దిగువకి వెళ్తే పార్వతీ దేవి ఆలయం.
వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి పక్కనే వెంకటేశ్వరస్వామికి ఉపాలయం వున్నది.
గోవర్ధనగిరి
ఇది పేరుకు తగ్గట్లే కృష్ణుడు చిటికెన వేలుతో ఎత్తిన గోవర్ధనగిరిలాగే వుంటుంది. దీనికింద విశ్రమించేవారు, పొంగళ్ళు వండేవారు, కనులపండుగైన దృశ్యం.
పొంగళ్ళు
ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులు పొంగళ్ళు వండి స్వామికి నైవేద్యం పెడతారు. దీనికోసం వారికి ప్రత్యేక స్ధలాలు కూడా కేటాయించారు.
ఉత్సవాలు
వైశాఖ శుధ్ధ చతుర్దశినాడు వచ్చే సృసింహ జయంతికూడా ఈ దేవస్ధానంలో ఆ రోజు శనివారం కాకపోతే తర్వాత వచ్చే శనివారంనాడే చేస్తారు. ఇక్కడ చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో పిండి ప్రమిదలలో దీపం వెలిగిస్తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. కార్తీక మాసం, శ్రావణ మాసాలలో భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది.
సందర్శకులు
ఈ స్వామిని సేవించిన అనేక ప్రఖ్యాత రాజులలో విజయనగర ప్రభువు అచ్యుత దేవరాయలు, రెడ్డి రాజులు వగైరా రాజులు కూడా వున్నారు.
దర్శన సమయాలు
ప్రతి శనివారం ఉదయం 6 గం. ల నుంచీ, సాయంత్రం 5 గంలదాకా మాత్రమే. సమయం, వారం తప్పక గుర్తుంచుకోండి. సాయంకాలం 5 గం. లయితే స్వామికి అలంకరించిన పూలతో సహా తీసి, ఆలయ ప్రాంతాలు పరిశుభ్రం చేసి ఆలయం మూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ కొండదిగువకు వచ్చేస్తారు.
వసతి
కొండ కింద అన్ని వసతులతో 12 గదులు, సాధారణ వసతితో 30 గదులు, డార్మెటరీ సౌకర్యాలు వున్నాయి. టి.టి.డీ. వారి కళ్యాణ మండపం లో వివాహాలు జరుగుతాయి. భక్తులు ఇక్కడ కేశ ఖండన కూడా చేయించుకుంటారు. దానికి తగిన సదుపాయాలున్నాయి.
తీర్ధాలు
ఇక్కడ ఇదివరకు అనేక తీర్ధాలు వుండేవి. ప్రస్తుతం వర్షాభావం వల్ల వీటిలో నీరు లేదు. అయితే
కొండపైన నీటి వసతి వున్నది. దూర ప్రాంతాలనుంచి వచ్చే భక్తులు ఇక్కడ వున్న చిన్న దొనెలో స్నానాలు చేస్తారు. వారి సౌకర్యార్ధం దాదాపు 18వేల లీటర్ల సామర్ధ్యం వున్న ఈ దొనెలోని నీటిని ప్రతి శనివారం మార్చి వేరే నీటితో నింపుతారు.
ఘాట్ రోడ్డు
కొండ ఎక్కటానికి మెట్ల దోవలు వున్నాయి. మెట్లు ఎక్కలేనివారికోసం ఘాట్ రోడ్డు నిర్మింపబడింది. ఈ మార్గంలో కారులు, ఆటోలు వెళ్తాయి. ఈ రోడ్డు చిన్న చిన్న మెలికలతో వుంటుంది. కొండపైన వాహనం ఆగిన చోటనుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళటానికి వయోవృధ్ధులు, చిన్న పిల్లలున్నవారికోసం ఆలయం వారు నిర్వహించే ఉచిత రవాణా సౌకర్యం కూడా వున్నది.
భోజన వసతి
ప్రతి శనివారం వచ్చిన భక్తులందరికీ దేవస్ధానం వారు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఆసక్తి వున్నవారు శాశ్వత అన్నదానానికి, శాశ్వత పూజలకు రుసుము చెల్లించవచ్చు. వీటికి ఎటువంటి నిర్బంధమూ లేదు.
దర్శనం
స్వామికి దగ్గరగా వెళ్ళి గోత్ర నామాలతో అర్చన చేయించుకోవటానికి మనిషికి రూ. 100 టికెట్ తీసుకోవాలి. ఉచిత దర్శనం గర్భగుడి ముందునుంచీ వుంటుంది.
మార్గము
ఒంగోలు నుండి 80 కి.మీ. లు, కందుకూరునుండి 32 కి.మీ.లు, శింగరాయకొండనుంచీ 40 కి.మీ. ల దూరంలో వున్నది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని చేరుకోవటానికి ఒంగోలు, కందుకూరునుంచి పామూరు వెళ్ళే బస్సులన్నీ కొండ దిగువదాకా వెళ్తాయి. అక్కడనుండి కొండపైకి ఆటోలు లభిస్తాయి. కందుకూరు, శింగరాయకొండలనుంచి ఆటోలలో కూడా వెళ్ళి రావచ్చు. సమయం తక్కువ వున్నవాళ్ళు వెళ్ళి రావటానికి వాహనం మాట్లాడుకుంటే ఇబ్బంది లేకుండా వుంటుంది.
సంవత్సారానికి 60 లక్షల రూపాయల పైగా ఆదాయం వున్న ఈ దేవాలయం ముఖ్యాధికారిగా ప్రస్తుతం వున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (శింగరాయకొండకి కూడా ఈయనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) శ్రీ చౌదరిగారు ఆలయాభివృధ్ధికి తీసుకుంటున్న శ్రధ్ధ, మేమున్న దాదాపు 4 గం. లూ ఆయన ఆ ప్రదేశమంతా ఎంతో బాధ్యతగా తిరుగుతూ, అందరికీ అందుబాటులో వుండటం చూస్తే ప్రభుత్వాధికారులంతా ఇంత బాధ్యతాయుతంగా వుంటే ఎంత బాగుండుననిపించింది.
శ్రీ చౌదరిగారికి మేము వచ్చిన కారణం చెప్పి ఆ ప్రదేశ విశేషాలు చెప్పమంటే నాకన్నా వేద పండితులు బాగా చెబుతారని అక్కడి పండితులు శ్రీ రవి కుమార్ శర్మగారి దగ్గరకు తీసుకెళ్ళారు. వారు చెప్పిన విశేషాలలో మరొకటి ఆ ప్రదేశమంతా అడవి. పాములూ, విష పురుగులూ, వగైరాలు విచ్చలవిడిగా తిరుగుతూ వుంటాయి. అవి పక్కనుంచీ వెళ్తున్నా ఇప్పటివరకూ వాటివల్ల సిబ్బందికిగానీ, వచ్చేవారికిగానీ ఏ హానీ కలుగలేదు.
- పి.యస్.యమ్. లక్ష్మి