Read more!

వజ్రాలయ్య కేతవరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి

 

 

వజ్రాలయ్య కేతవరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి


శ్రీ నరసింహ క్షేత్రాలు - 6

 


                                                            
తెలుగునాట కృష్ణా పరీవాహక ప్రాంతంలో నెలకొన్న ఐదు నరసింహ స్వామి ఆలయాల్లో కేతవరం కూడా ఒకటి.  వీటినే పంచ నరసింహ క్షేత్రాలు అంటారు.  అవి కృష్ణా జిల్లాలోని వేదాద్రి, గుంటూరు జిల్లాలోని మంగళగిరి, కేతవరం, నల్గొండ జిల్లాలోని వాడపల్లి, మట్టపల్లి అని చెప్పుకున్నాము, వీటి గురించి తెలుసుకున్నాము.  ఇప్పుడు  వీటిలో ఆఖరిదైన కేతవరం గురించి తెలుసుకుందాము. సాధారణంగా నరసింహస్వామి ఎక్కడ వెలిసినా స్వయంభూగా, కొండ గుహలలో వెలుస్తాడు.  ఆయన దర్శనం చేసుకోవాలంటే భక్తులు కొంచెం కష్టపడక తప్పదు.  ఇక్కడ కొండపైన వున్న స్వామి దర్శనానికి 600 మెట్లు ఎక్కాలి.  మెట్లు ఎక్కేముందే పూజారిగారు పైన వున్నారో లేదో కింద గుళ్ళల్లో కనుక్కుని బయల్దేరండి.  మేము వెళ్ళినప్పుడు ఆయన కొండమీద లేరని తెలిసి కింద కృష్ణ ఒడ్డున వున్న ఆలయాన్ని దర్శించి వచ్చేశాము.  కొండమీద ఆలయాన్ని దర్శించాలంటే ఉదయం 9 గం. లోపే అక్కడికి చేరుకోవాలి. 
అర్చకులు ఉదయం కొండపై గుడికి వెళ్ళి, స్వామి ఆరాధన పూర్తి చేసుకొస్తారు. 

ఆ సమయంలో మీరూ వెళ్ళి స్వామిని సేవించవచ్చు.  కొండమీద నరసింహస్వామితో పాటు చెంచులక్ష్మి కూడా స్వయంభూగా వెలిసి వున్నారు.  రాతి మీద వెలిసిన స్వామి రూపు రేఖలు అంత స్పష్టంగా కనబడవన్నారు చూసినవారు. అన్ని మెట్లు ఎక్కలేనివారికోసమో, తగు స్ధలం లేకో,  కొండ దిగువన కూడా  ఒక ఆలయం నిర్మించబడి అందులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్టించారు.  ఇక్కడా నిత్య పూజలు జరుగుతాయి. కొండ దిగువున వున్న ఆలయం స్వామివారి ఉత్సవాలకోసం నిర్మించబడిందని కూడా చెబుతారు.  ఈ రెండు ఆలయాలేకాక ఈ ఊర్లోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి మూడో ఆలయం కూడా కృష్ణానది ఒడ్డునే నిర్మింపబడింది.    ఇది మిగతా రెండు ఆలయాలకన్నా సుందరమైనది, విశాలమైనది.  ఇక్కడ ప్రకృతి రమణీయంగా వుంటుంది.  కేతవరంలోని దేవాలయం వరకు తూర్పు దిశగా ప్రవహించిన కృష్ణమ్మ ఇక్కడనుండి ఉత్తర దిశగా సాగుతుంది.  కేతవరం చిన్న ఊరు.  ఇంత చిన్న ఊరులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు మూడు వుండటం, ఆ మూడింటిలోనూ నిత్య పూజాదులు జరగటం విశేషమే.
 
స్ధల పురాణం


క్రీ.శ. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని కేతవర్మ అనే రాజు పరిపాలించాడు.  ఆయన పేరుమీదే ఈ ఊరుకి కేతవరం అనే పేరు వచ్చింది.  వాడుక భాషలో కేతారం అని కూడా అంటారు.  ఇక్కడ స్వామి ఆవిర్భావానికి సంబంధించి ప్రచారంలో వున్న కధ .. కేతవర్మ ఈ ప్రాంతాన్ని పాలించే కాలంలో ఒక గొఱ్ఱెల కాపరి ఈ కొండమీదకి గొఱ్ఱెలను కాచుకోవటానికి వెళ్ళాడుట.  మధ్యలో కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు.  ఆ సమయంలో స్వామి గొఱ్ఱెలకాపరి కలలో కనబడి తాను అక్కడ వెలసి వున్నానని, అప్పటిదాకా దేవతలకే దర్శనమిస్తున్న తాను ఇక ముందు మనుష్యులకు కూడా దర్శనమివ్వదలచానని, రాజుకి తెలిపి ఆలయం నిర్మించమని చెప్పాడు.  గొఱ్ఱెల కాపరి  ఆ విషయాన్ని మహారాజైన కేతవర్మకి తెలియజేశాడు.  కేతవర్మ కొండమీదంతా గాలించి శ్రీ స్వామి, అమ్మవార్ల స్వయంభూ మూర్తులను చూసి, వెంటనే కొండపై స్వామికి దేవాలయం కట్టించారు.

దేవాలయ నిర్మాణం సమయంలో నీటి కోసం కొండ కింద ఇప్పటి ఆలయం ముందు కోనేరు తవ్వారు.    అప్పుడు ఇక్కడ నీరు పడిందిటగానీ, నిర్మాణం పూర్తికాగానే ఈ కోనేరులో నీరు ఎండిపోయిందట.   ఆ కోనేరు తవ్వే సమయంలో రెండు అద్భుతాలు జరిగాయి.  అక్కడ తవ్వేటప్పుడు, పనిచేసే కూలీలలో ఒకరి కాలికి రాయి గుచ్చుకొని రక్తస్రావం జరిగింది.  ఆ గాయాన్ని నీటితో శుభ్రపరిచేటప్పుడు గుచ్చుకున్న రాయిని వజ్రంగా గుర్తించారు.  అక్కడ ఇంకా వజ్రాలు దొరుకుతాయేమోనని ఇంకా త్రవ్వగా స్వామివారి ఉత్సవ విగ్రహాలు బయటపడ్డాయి. ఇప్పటికీ వర్షాకాలంలో అప్పుడప్పుడూ ఇక్కడ వజ్రాలు దొరుకుతాయిట.   ఇది వజ్రాలు దొరికే ప్రదేశంగనుక, స్వామి వజ్రంతో దొరికాడుగనుక, ఈ స్వామిని వజ్రాలయ్య అనికూడా అంటారు. ఇదే విధంగా పంచ నారసింహ క్షేత్రాలలో నెలకొన్న నరసింహస్వాములకు వివిధ నామాలున్నాయి అని ఇదివరకే చెప్పుకున్నాముకదా.         

ఈ క్షేత్ర మహిమ గురించి ఇంకొక కధ ఏమిటంటే ..  పూర్వం అమరావతి ప్రభువైన శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడి పరిపాలనా సమయంలో ఈ ప్రాంతం అంతా చెంచులు ఎక్కువగా వుండేవారు.  వాళ్ళు దొంగతనాలూ, దోపిడీలూ విపరీతంగా చేసి ఆ ప్రాంత ప్రజలని భయభ్రాంతులని చేశారు.  వేంకటాద్రి నాయుడుగారు వారిని అదుపులో పెట్టాలని ఎన్నో విధాల ప్రయత్నించి విఫలుడయ్యాడు.  తప్పనిసరి పరిస్ధితులలో వారిని శుభకార్యానికని ఆహ్వానించి వారందరి చేతులూ నరికించాడు.  ఆ పాపం వలన ఆయన రూపం వికృతంగా మారిపోయిందిట.  తినే పదార్ధాలు పురుగులుగా కనబడి ఏమీ తినలేకపోయేవాడు.  ఆ పాప పరిహారార్ధం ఆయన అనేక దేవాలయాలను కట్టించాడు.  వీటిలో ఎక్కువ కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో వున్నాయి.   ఆ సమయంలోనే కేతవరంలోగల దేవాలయాన్ని పునఃప్రతిష్ట చేయించి,  ఇక్కడ కృష్ణానదిలో స్నానం చేస్తుండగా ఆయన తిరిగి మామూలు రూపం పొందాడుట.  అలాగే మంగళగిరి పానకాలస్వామిని సేవించి భోజనం పురుగులుగా కనబడే దోషం పోగొట్టుకున్నాడుట.

ఉత్సవాలు


 ప్రతి సంవత్సరం చైత్ర శుధ్ధ త్రయోదశినుంచి పౌర్ణమి వరకు స్వామివారు కళ్యాణోత్సవాలు ఈ ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం జరుగుతాయి.  చైత్ర శుధ్ధ చతుర్దశికి స్వామివారి కళ్యాణం కొండకింది దేవాలయంలోనే జరుగుతుంది. చైత్ర శుధ్ధపౌర్ణమి రోజు స్వామివారికి రధోత్సవము అత్యంత వైభవంగా జరుగుతుంది.  పూర్వం స్వామివారికి కంచు రధం వుండేదట. ఒకసారి కోనేరులో దొరికిన ఉత్సవ విగ్రహాలను కంచు రధంలో ఊరేగిస్తుండగా భక్తుల పట్టుదప్పి ఆ రధం విగ్రహాలతో సహా పల్లంలో వున్న కృష్ణానదిలో పడిపోయిందనీ, ఇప్పటికీ ఆ రధం అక్కడ కృష్ణానదిలో వుందని చెప్పుకుంటారు.  ఇక్కడ కృష్ణానది లోతుగా వుంటుందిట. కంచు రధం కృష్ణానదిలో పడిన తర్వాత శ్రీ పింగళ రామిరెడ్డి అనే భక్తుడు స్వామివారికి ఇంకో రధం చేయించారు.  అప్పటినుంచీ స్వామివారి రధయాత్రలో ఈ రధాన్ని ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు ఈ ఆలయం 20 సత్రాలతో అత్యంత వైభవంగా వెలుగొందిందట.  గుడికి కొంచెం దూరంలో నేలమట్టమయిన కోట చిహ్నాలు కనబడతాయి.  

క్రీ.శ. 1992 దాకా ఈ ఆలయానికి పెద్ద ఆదాయంలేదు.  తర్వాత దేవాలయ భూములలో పలకల బండలు పడ్డాయిట.  దానితో ఆలయ ఆదాయం పెరిగి, అభివృధ్ధి జరుగుతోంది.  పులిచింతల ప్రాజెక్టు వస్తే కృష్ణానది ఒడ్డున వున్న ఆలయం మునిగి పోతుందిట. కృష్ణా పరీవాహక ప్రాంతంలో వెలిసిన పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటైన కేతవరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అవకాశం వున్నవారు తప్పక దర్శించవలసిన క్షేత్రము.

మార్గము
గుంటూరునుంచి మాచర్ల వెళ్ళే రహదారిలో బెల్లంకొండ అడ్డ రోడ్డునుంచి దాదాపు 25 కి.మీ. ల దూరంలో వున్నది కేతవరం.  సత్తెనపల్లినుంచి పులిచింతల, చిట్యాల  వెళ్ళే బస్సులు కేతవరం గ్రామంగుండా వెళ్తాయి.

-   పి.యస్.యమ్. లక్ష్మి