సిరికి సంకేతం లక్ష్మీతత్త్వం
సిరికి సంకేతం లక్ష్మీతత్త్వం
శుద్ధ సత్త్వ స్వరూపాయా పద్మాసా పరమాత్మనః
సర్వసపత్స్వరూపా సా తదధిష్టాతృ దేవతా
కాంతాతి దాంతా శాంతా చ సుశీలా సర్వమంగళా
లోభమోహ కామ రోష మదాం హంకార వర్జితా
ప్రాణతుల్యా భగవతః ప్రేమ పాత్రం ప్రియంవదా
సర్వసస్యాత్మికాదేవి జీవనోపాయ రూపిణీ
మహాలక్ష్మీ శ్చ వైకుంఠే పతిసేవారతా సతీ
అని దేవీభాగవతంలో అమ్మవారి అయిదు శక్తుల గురించి, లక్ష్మీదేవి గురించి చెప్పారు. లక్ష్మీదేవి సర్వసంపదల స్వరూపం. సకల సంపదలకు అధిష్టాన దేవత. వైకుంఠంలో మహాలక్ష్మిగా విష్ణు సేవా పరాయణురాలు. పతిభక్తికి ప్రతీక. శ్రీ అనేది లక్ష్మీదేవికి అసాధారణమైన పేరు. ఈ ణామానికి అర్థాలు ఇలా ఉన్నాయి....
శ్రీ యతే పరం భగవతం ఇతి శ్రీః - భగవంతుని ఆశ్రయించునది కాబట్టి శ్రీ
శ్రీయతే ఇతి శ్రీః - అందరిచేత ఆశ్రయింపబడుతున్నది కాబట్టి శ్రీ
శ్రుణోతి ఇతి శ్రీః - ఆశ్రితుల ప్రార్థన వింటున్నది కాబట్టి శ్రీ
శ్రావయతి ఇతి శ్రీః - ఆశ్రితుల ప్రార్థనను స్వామికి వినిపిస్తున్నది కాబట్టి శ్రీ
శ్రుణాతి దోషాన్ ఇతి శ్రీ - ఆశ్రితుల దోషాలను పోగొడుతున్నది కాబట్టి శ్రీ
శ్రీణాతి గుణై ఇతి శ్రీ - తమ సద్గుణాలతో సర్వత్రా వ్యాపిస్తోంది కాబట్టి శ్రీ
ఇటువంటి ధనదేవత విశ్వచైతన్యానికే ప్రతీక. దారిద్య్రం అనే అంధకారాన్ని పారదోలే తల్లి.
విలగ్నౌతే పార్శ్వ ద్వయ పరిసరే మత్త కరిణౌ
కరో న్నీతై రంచన్మణి కలశ ముగ్ధాస్య గళితై
నిషించ న్తౌ ముక్తామణిగణ చయై స్త్యాం జలకణైః
నమస్యామో దామోదర గృహిణి దారిద్ర్య దళితా
ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే....రెండు ఏనుగులు రెండు వైపులా నిలచి, తొండాలతో కలశాల్ని ఎత్తిపట్టుకుని ముత్యాల్ని తలపింపచేసే నీటి బిందువుల్తో నీకు అభిషేకం చేస్తుంటాయి. అటువంటి తల్లీ నీకు వందనం.
లక్ష్మీదేవికి రెండువైపులా రెండు ఏనుగులు ఉంటాయి. ఇవి శుభానికి, ఐశ్వర్యానికి సంకేతం. అందుకే రాజులు కూడా తమ సైన్యంలో ఏనుగులకూ ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు. ఈవిధంగా లక్ష్మీదేవిని అదృష్టానికి, శుభానికి సూచికగా చెబుతారు.