లక్ష్మీకటాక్షం

 

లక్ష్మీకటాక్షం

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురామ్ |
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం
త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్

పాలకడలికి కూతురిగా పుట్టి శ్రీమహావిష్ణువుని పెండ్లియాడి, సకల లోకాలనూ కాచి రక్షిస్తున్న శ్రీమహాలక్ష్మీ నీకు నమస్కరిస్తున్నాను. నిరంతరం నన్ను కరుణతోచూడు. నాపై నీ దయారసవృష్టిని కురిపించు. సర్వేసర్వత్రా నీ కటాక్షాన్ని నాకు అనుగ్రహించు. నీ కటాక్షం వల్లనే నాకు సకల భోగభాగ్యాలూ కలుగుతున్నాయ్. ధనధాన్య రాశులు సమకూరుతున్నాయ్. నా ఇల్లు సమృద్ధిగా ఉంది. నేను పదిమందికీ మేలు చేయగలిగిన స్థితిలో ఉన్నాను. ఆర్తులను ఆదుకోగలిగిన పరిస్థితి నీ దయవల్లనే నాకు కలిగింది. జగన్మాతా, శ్రీమహాలక్ష్మీ కేవలం నీ దయవల్లనే, నీ కృపాకటాక్షం వల్లనే అఖిలభువనాలూ మనగలుగుతున్నాయి. కేవలం నీ కరుణవల్లనే ఏడేడులోకాలూ సమృద్ధిగా ఉంటున్నాయి. నీ కరుణ ఉన్నవాళ్లు నిరంతరం ఆత్మానందంలో తేలియాడుతుంటారు.

దివ్యతేజస్సుతో వెలిగిపోతుంటారు. నీ అనుగ్రహం ఉన్నవాడే రాజవుతాడు. నీ అనుగ్రహం ఉన్ననాడే వాడు ఆ పదవిని నిలబెట్టుకోగలుగుతాడు. జగద్రక్షకీ అంతా నీ దయే. సర్వేస్వరీ అంతా నీ మాయే. నీ అనుగ్రహం ఉన్న మానవుడు తనంతటతానుగా క్రమశిక్షణ పాటిస్తూ, సత్సీలత కలిగి, మృదుభాషణుడై, సర్వ శుభలక్షణ సంపన్నుడై విరాజిల్లుతాడు. మహామాయ మాయలో పడిపోయి నీ దివ్యమంగళరూపాన్ని చూడలేనివాడు నిరంతరం చిక్కులతో అలమటించిపోతుంటాడు. లక్ష్మీకళ లేనిదే సాక్షాత్తూ శ్రీహరికికూడా విలువలేదు. అందుకే ఆయన నిన్ను తెలివిగా హృదయంలో నిలుపుకున్నాడు. భార్యను గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఏ మగవాడైనా నా అంతటి గొప్పవాడౌతాడు అన్నట్టుగా ఉంటుంది సిరిగలవాని చిరునవ్వు.

శ్రీప్రదమైన ఆ చిరునగవుని చూసిన జన్మ పావనమౌతుంది. తల్లిగా, చెల్లిగా, అనురాగాన్ని పంచే అర్ధాంగిగా, కడుపున పుట్టిన బిడ్డగా అన్నిరూపాల్లోనూ నీవే నిరంతరం అనుగ్రహ వృష్టిని కురిపిస్తూ మానవాళిపై దయచూపిస్తున్నావు తల్లీ. నీ కరుణవల్లనే జగత్తంతా సుభిక్షంగా ఉంది. నీ అనుగ్రహం వల్లనే సకల లోకాలూ సంపదలతో తులతూగుతున్నాయి. ఎప్పటికీ నీ అనుగ్రహాన్ని మాపై ఇలాగే కురిపించి. నిన్నే నమ్మిన నీ బిడ్డలను సదా అనుగ్రహించు. అఖండ ఐశ్వర్యాన్ని, సిరిసంపదలను, అనంతమైన సంతోషాన్ని ప్రసాదించు.
                                                                                               
                                                                                          - మల్లాది వేంకటగోపాలకృష్ణ