నైవేద్యం తరవాతే పూజలందుకునే చిన్నికృష్ణుడు

 

 

నైవేద్యం తరవాతే పూజలందుకునే చిన్నికృష్ణుడు

 


మన దేశంలో కృష్ణుడికి ఎన్నో దేవాలయాలు ఉన్నా, త్రిచాంబరం కృష్ణుడికి ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో తెలుసా ఇక్కడ వెలసినది బాలకృష్ణుడు. ఈ ఆలయం కేరళలోని త్రిచాంబరంలో ఉంది. కంసుడిని సంహరించాకా ఎంతో ఆనందంతో ఉన్న చిన్ని కృష్ణుడు ఇక్కడ మనకు  కనిపిస్తాడు,అది కూడా రుద్ర భంగిమలో కూర్చుని  ఉండటం మరో ప్రత్యేకత. చూడటానికి ఎంతో చక్కగా ఉండే ఇక్కడి స్వామికి గుడి తలుపులు తెరవగానే నైవేద్యం పెట్టటం ఒక ఆచారంగా సాగుతోంది. అది కూడా ఎందుకో తెలుసా కంసుడిని సంహరించాకా కృష్ణయ్య దేవకీ దేవి దగ్గరకి వచ్చి ఆకలిగా ఉంది అన్నం పెట్టమని అడిగాడట,అందుకే ఇప్పటికీ  ఇక్కడ గుడి తలుపులు తెరవగానే ముందుగా  దేముడికి నైవేద్యం పెట్టి తరవాతే  పూజలు నిర్వహిస్తారని చెప్తున్నారు ఇక్కడి అర్చకులు.


ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఇక్కడ మనకి ఏనుగులు కనిపించవు,మామూలుగా కేరళలోని ఏ దేవాలయానికి వెళ్ళినా  మనకి ముందుగా  కనిపించేవే ఏనుగులు. అలాంటిది  ఇక్కడ గర్భగుడిలోకి ఏనుగులకి ప్రవేశం లేదు,దానికి కారణం కృష్ణుడిని చంపటానికి కంసుడు కువలయా అనే ఏనుగుని పంపటం వల్ల ఇక్కడి శ్రీకృష్ణుడికి ఏనుగుల సామీప్యత గిట్టదట.

 


ఇక్కడి ఆలయంలో ప్రతి ఏటా జరిగే ఉత్సవాలు మలయాళం కేలండర్ ప్రకారం కుంభ మాసంలో మొదలయి 15 రోజుల తర్వాత మీనమాసంలో ముగుస్తాయి. (అంటే మనకి మార్చి 6 నుంచి 20 వరకు) ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీకృష్ణ బలరాముల విగ్రాహలని ఊరేగిస్తారట. అంతేకాదు తితాంబు అనే నృత్యాన్ని చేస్తారట. ఎన్నో యుగాలనుంచి పూజలందుకుంటున్న ఆ చిన్ని కృష్ణుని అనుగ్రహం మనకి కూడా దక్కాలని ఆశిద్దాం.

                                                                                                                                                                                                                        ...కళ్యాణి