శ్రీకృష్ణ రహస్యం నిధివన్
శ్రీకృష్ణ రహస్యం "నిధివన్"
శ్రీకృష్ణ లీలల గురించి తెలియనివారు ఉండరు. బృందావనంలో శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి చేసిన రాసలీలలు కోకోల్లలు. అలాంటి కథే బృందావనంలోని నిధి వన్ తో ముడిపడి ఉంది. యూపీలోని బృందావనం సమీపంలో ఉన్న నిధి వన్ లో ఇప్పటికీ రాత్రిపూట శ్రీకృష్ణడు గోపికలతో కలిసి రాసలీలలు ఆడతాడట. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకే ఈ నిధి వన్ ప్రవేశం ఉంటుంది. సంధ్యా సమయం కాగానే నిధి వన్ ను మూసేస్తారు. ఆ తర్వాత ఎవ్వరూ అక్కడ ఉండరు. చివరకు నిధి వన్ లో ఉండే పక్షులు కూడా సంధ్యా సమయం కాగానే అక్కడ్నుంచి వెళ్లిపోతాయి. ఒకవేళ ఎవరైనా నిధి వన్ లో రాత్రి పూట ఉండి శ్రీకృష్ణ రాసలీలలను దొంగతనంగా చూడాలని ప్రయత్నిస్తే వారి సంగతి అంతేనట. పదేళ్ల కింద జయపూర్ కు చెందిన ఓ కృష్ణ భక్తుడు ఎక్కడ ఏం జరుగుతుందో చూడాలని దొంగతనంగా అక్కడే ఉండిపోయాడట. రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లారేసరికి నిధివన్ ప్రవేశద్వారంలో అతను అచేతన అవస్థలో పడి ఉన్నాడు. ఆ తర్వాత అతను పిచ్చివాడిగా మారిపోయాడట. అలాగే గతంలోనూ ఓ భక్తునికి ఇలాగే జరిగిందట. శ్రీకృష్ణుడి రాసలీలను చూడాలని ప్రయత్నించి పిచ్చివాడైపోయాడట. నిధి వన్ లోపల రంగ మహల్ ఉంది. ఇక్కడ రోజూ రాత్రిపూట శ్రీకృష్ణుడు, రాధ కలిసి వస్తారట. అందుకే రంగ్ మహల్ లో ఉండే గంధపు మంచాన్ని ప్రతిరోజూ సాయంత్రంలోపే అలంకరిస్తారు. మంచపక్కనే ఒక చెంబులో నీరు, రాధ కోసం అలంకార సామాగ్రి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు ఇక్కడి మరో విశేషం ఏంటంటే తెల్లవారగానే రంగ్ మహల్ లోని మంచంపైన దుప్పట్లు అస్తవ్యస్తంగా ఉంటాయట. అలాగే చెంబులోని నీరు ఖాళీ అయిపోతుంది. దీని వెనక రహస్యమేంటో ఎవరూ కనిపెట్టలేకపోయారు. అందుకే దీన్ని శ్రీకృష్ణలీలగానే భావిస్తారు.
నిధి వన్ లో మరో వింత ఏంటంటే.. ఎక్కడైనా చెట్లు పైకి ఎదుగుతాయి. ఇక్కడ మాత్రం చెట్లు కిందకు పెరుగుతాయి. అంటే భూమిలోకి... ఇక నిధివన్ లో అన్నీ తులసి చెట్లే ఉంటాయి. అవి కూడా జంటగా కలిసి ఉంటాయి. ఏ చెట్టును చూసి ఇలానే జంటగా ఉంటాయి. ఇంతకు దీని వెనక విశేషం ఏంటంటే ఈ తులసి చెట్లే గోపికలట. సాయంత్రం కాగానే తులసిచెట్లన్నీ గోపికల రూపంలో మారిపోతాయట. ఉదయం కాగానే షరామామూలుగానే తిరిగి తులసి చెట్ల రూపంలోకి వెళ్లిపోతాయట. అందుకే నిధి వన్ నుంచి తులసిమొక్కలకు చెందిన చిన్న ఆకును కూడా తీసుకుపోనివ్వరు. ఒకవేళ అలా తీసుకుపోయినా అరిష్టమట. ఇక నిధి వన్ కు సమీపంలో స్థానికుల ఇళ్లు ఉన్నాయి. అయితే ఆ ఇళ్లకు కిటికీలు ఉండవు. ఎందుకంటే నిధి వన్ వైపు వారి చూపు ఉండకూడదని కిటికీలు పెట్టుకోరు. ఒకవేళ ఎవరైనా కిటికీలు పెట్టినా వాటి నుంచి నిధి వన్ వైపు రాత్రిపూట మాత్రం చూడరు. నిధి వన్ లో రాత్రిపూట జరిగే రాసలీలలను చూడాలనుకోవడం పాపంగా బావిస్తారు స్థానికులు. అందుకే ఇలా కిటికీలు పెట్టుకోకుండా జాగ్రత్త పడతారు. ఇదండీ నిధి వన్ రహస్యమయ గాథ.