ఈ వీరుడికి శ్రీకృష్ణుడు తన అరచేతిలో అంత్యక్రియలు నిర్వహించాడు!

 

ఈ వీరుడికి శ్రీకృష్ణుడు తన అరచేతిలో అంత్యక్రియలు నిర్వహించాడు!

మహాభారత యుద్ధం కురుక్షేత్ర భూమిని యోధుల రక్తంతో తడిపింది. కౌరవ, పాండవుల పక్షాల్లో లక్షలాది మంది యోధులు మరణించారు. వారిలో కౌరవుల పక్షాన ధర్మానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక యోధుడు ఉన్నాడు.  అతను ఎంతో వీరోచితంగా పోరాడినా చివరికి మరణించాడు. ఆ యోధుడికి, సాక్షాత్తు శ్రీకృష్ణుడే  అంత్యక్రియలు నిర్వహించాడు.  అది కూడా శ్రీకృష్ణుడు తన అరచేతిలో నిర్వహించాడు. ఇంతకీ ఆ యోధుడు ఎవరు?  దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

 కర్ణుడు..

సూర్యుని కుమారుడైన కర్ణుడే ఆ యోధుడు. ఒకవైపు శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు అర్జునుడు నిరాయుధుడైన కర్ణునిపై బాణం వేశాడు. మరోవైపు, శ్రీకృష్ణుడే స్వయంగా కర్ణుని శరీరాన్ని తన అరచేతిలో ఉంచుకుని అంత్యక్రియలు నిర్వహించాడు.

మహాభారత యుద్ధ సమయంలో, కర్ణుని రథచక్రం ఇరుక్కుపోయినప్పుడు అర్జునుడు బాణంతో కొట్టినా, కర్ణుడు మరణించలేదు. మహాభారత కథనం ప్రకారం, కర్ణుని సత్కర్మల కారణంగా ధర్మ దేవతలు అతడిని రక్షించారట.

ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు, బ్రాహ్మణుని వేషంలో కర్ణుని వద్దకు వెళ్లి, తాను చేసిన పుణ్యాన్ని దానం ఇవ్వమని అడిగాడట.  కర్ణుడు వాటన్నిటినీ సంతోషంగా ఇచ్చేశాడు. దీనితో కృష్ణుడు సంతోషించి, కర్ణుడిని ఒక వరం కోరాడు. అప్పుడు కర్ణుడు, తాను కన్య గర్భం నుండి జన్మించినందున, తన అంత్యక్రియలను శ్రీకృష్ణుడే  నిర్వహించాలని, అదీ కన్యభూమిలో జరిపించాలని శ్రీకృష్ణుడిని వరం కోరాడు. శ్రీకృష్ణుడు అతని కోరికను మన్నించాడు.

అరచేతిలో అంత్యక్రియలు..

కర్ణుని చివరి కోరిక ప్రకారం, శ్రీకృష్ణుడు స్వయంగా కర్ణుని అంత్యక్రియలు నిర్వహించాడు. దీనిపై రెండు కథనాలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం, ప్రపంచంలో అంత్యక్రియలు జరగని కన్య భూమి గానీ, ప్రదేశం గానీ లేదు. అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుని శరీరాన్ని తన ఎడమ అరచేతిలో ఉంచి అంత్యక్రియలు నిర్వహించాడట.

మరో కథనం ప్రకారం ఇంతవరకు ఎవరికీ దహన సంస్కారాలు జరగని కురుక్షేత్ర ప్రదేశంలో, శ్రీకృష్ణుడు కర్ణుని అంత్యక్రియలు నిర్వహించాడు. కర్ణుని  భార్య వైశాలి కూడా ఆత్మార్పణం చేసుకుని సతీసహగమనం చేసిందట.

                                         *రూపశ్రీ.