Read more!

చివరి శుక్రవారం శరణు వేడుదాం!!

 

చివరి శుక్రవారం శరణు వేడుదాం!!

 

సంవత్సరంలో మహిళలకు ప్రత్యేకమైన, ప్రాముఖ్యమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ శుక్రవారం యొక్క విశిష్టతను ఇదివరకే చెప్పుకున్నాము. శ్రావణ మాసంతో పెళ్లిళ్లు, పండుగల సందడి మొదలవుతుంది. మహిళలు ఎంతో పవిత్రంగా భావించే వరలక్ష్మి వ్రతం శ్రావణమాసపు రెండవ శుక్రవారం జరుపుకోవడం శాస్త్రంగా ఎంతో కాలం జరుగుతూ వస్తున్నది. అయితే ఏదైనా కారణాల వల్ల వరలక్ష్మి వ్రతం కానీ, ప్రత్యేక పూజలు కానీ చేసుకోలేని వాళ్లకు ఆఖరి శుక్రవారం చివరి అవకాశంగా ఉంది. 

పవిత్రం ప్రత్యేక వారం

శ్రావణమాసం పవిత్రమైనది అయితే, శుక్రవారం మరింత ప్రత్యేకమైనది అని వేరుగా చెప్పక్కర్లేదుగా. అయితే మాసంలో చివరి వారం కావడం వలన మరింత ప్రత్యేకంగా, మరింత సందడిగా ఉంటుందీ చివరి శుక్రవారం. పూజలు, వ్రతాలు ఒక ఎత్తు అయితే పెళ్లి కాని అమ్మాయిలకు మరింత ప్రత్యేకంగా చెప్పుకుంటారు.

*పెళ్లి కాని వారికొక వరం

చాలామంది చివరి వారం చేసుకునే వరలక్ష్మి వ్రతంలో కానీ ప్రత్యేక పూజలో కానీ ముత్తయిదువులను పిలిచి వాయనం, తాంబూలం ఇవ్వడం ఒక పద్ధతి మరియు వారి ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. అయితే పూజ చేసుకున్న వారి నుండి తాంబూలం తీసుకుంటే పెళ్లి కాని అమ్మాయిలకు తొందరగా పెళ్లవుతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. వరమహాలక్ష్మి వివిధ రూపాలలో కరుణిస్తుందని, అదే విధంగా పెళ్లికాని అమ్మాయిలకు అన్ని సమస్యలు తొలగిపోయి పెళ్లి జరిగేలా అనుకూలత ఇస్తుందని నమ్మకం. కొన్ని ప్రాంతాలలో ఆరోజు భక్తితో ఉపవాసం ఉండి, పూజ చేసుకుని ముత్తైదువుల నుండి తాంబూలం అందుకుంటారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. 

చివరి వారం కూడా వ్రతం చేసుకోవడానికి కుదరని వారు ఎలాంటి బెంగ పెట్టుకొనక్కర్లేదు. ఉదయాన్నే లేచి, ఇంటిని శుభ్రం చేసుకుని, తలారా స్నానం చేసి, వీలైనంతలో ప్రసాదం వండి, పండ్లు, పూలు, అక్షింతలతో అమ్మవారిని పూజించి, నైవేద్యం పెట్టి. వరమహాలక్ష్మి కరుణించేలా మనసులో తలచుకుని, మహాలక్ష్మి అష్టోత్తరం, కుదిరితే లలిత సహస్ర నామాలు వంటివి చెప్పుకుని చేతనైనంతలో చుట్టుపక్కల ఉన్న ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే సరిపోతుంది. మనస్ఫూర్తిగా ఇలా చేయడం వల్ల వరమహాలక్ష్మి తప్పక తన చల్లని చూపుతో కాపాడుతుందని పెద్దల మాట.

కాబట్టి చివరి శుక్రవారం రోజును వధులుకోకుండా వీలైనంతవరకు భక్తిపూర్వకంగా సాధ్యమైనట్టు వరమహాలక్ష్మిని పూజించుకుంటే  కోరిన కోర్కెలు తీర్చే వరాల దేవత సంతోషించి వరాలు కురిపించడం ఖాయం. ఈ ఏడు శ్రావణ మాసానికి సుఖంగా పరిసమాప్తి పలకడం ముఖ్యం మరి.

◆వెంకటేష్ పువ్వాడ