శ్రావణమాసం వచ్చేసింది!

 

శ్రావణమాసం వచ్చేసింది!

మన తెలుగు పంచాంగం చూస్తే బోలెడు సంబరం దాగుంటుంది. పండుగలు, వ్రతాలు, ప్రత్యేక రోజులు వాటి కోసం ఇంటిల్లిపాదీ చేసే సందడి అంతా ఇంతా కాదు. శ్రావణమాసం అంటేనే స్పెషల్. నిజం చెప్పాలంటే పంచాంగం లో ఒకో మాసానికి ఒకో స్పెషల్ ఉన్నా శ్రావణమాసం అంటే ఇంకొంచెం ఎక్కువ ప్రత్యేకత ఉంటుంది. అందరూ చెప్పే మాటల్లా శ్రావణ మాసం ఇది పెళ్లిళ్ల సీజన్ అనే మాటే కాదు హిందూ మతంలో ఆడవాళ్లకు ఎంతో ముఖ్యమైన మాసం కూడా.

ఈ నెల 29వ తేదీన శ్రావణమాసం మొదటి శుక్రవారం వచ్చేస్తుంది. ఆడవాళ్లు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే శ్రావణ మాసం రోజు తప్పకుండా చేయాల్సిన పనులు, ఆ పనులు చేయడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుంటే శ్రావణమాసంలో ఎంతో గొప్ప ఫలితాన్ని పొందేయవచ్చు.

మహాలక్ష్మి పూజ!

ఇంటికి కొత్త కళను తెచ్చేది శ్రావణమాసం. ఈ శ్రావణమాసంలో ఆడవాళ్లు మహాలక్ష్మిని పూజిస్తారు. అలా చేస్తే దీర్ఘసుమంగళిగా ఉంటారని పెద్దలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. 

అంటే తాము చేసే పూజల వల్ల భర్తకు మంచి జరుగుతుందని అర్థం. ఇంటికి సంపాదన తీసుకొచ్చే మగవాడు బాగుంటే ఇల్లంతా బాగున్నట్టే కదా మరి.

ఐశ్వర్యం!

◆ సాధారణంగా లక్ష్మీ దేవిని అష్టలక్ష్ముల రూపంలో కొలుస్తారు. ఆ అష్టలక్ష్ములలో ఒకటైన ఐశ్వర్య లక్ష్మీ అనుగ్రహం అందరికీ అవసరమే.

లక్ష్మీ దేవి అందరి దగ్గరకు వెళ్ళిపోతే ఈ ప్రపంచంలో పేదరికం ఉండదు కదా!! అయితే ఆ అమ్మ అనుగ్రహం కోసం మహాలక్ష్మి పూజ చేసుకోవడం మంచిది.

◆ మహాలక్ష్మి పూజను భక్తిగా చేసుకున్నవాళ్లకు ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తుంది ఆ మహాలక్ష్మి.

వాయనాలు!

శ్రావణ శుక్రవారం పూజలు చేసుకోవడం చాలామంది చేస్తారు. అయితే పూజ తరువాత వాయనం విషయంలో చాలామంది అవగాహన కలిగి ఉండరు.

శుక్రవారం పూజ అయిపోయిన తరువాత ఇంట్లో చేసిన పిండివంటలలో పూర్ణాలు, గారెలు మొదలైనవి ముత్తైదువులకు వాయనంగా ఇవ్వాలి.

ఇలా వాయనాలు ఇస్తే ఇటు అత్తగారి ఇంట్లోనూ, అటు పుట్టింట్లోనూ అందరూ సంతోషంగా ఉంటారు. ( ఇందులో అంతరార్థం ఏమిటంటే ఇలా పూజను గొప్పగా జరుపుకుంటే ఆ పూజకు రెండు కుటుంబాలు కలుస్తాయి. కుటుంబాల మధ్య బంధాలు గట్టిపడతాయని అర్థం).

తులసిపూజ!

తులసిపూజ అనేది చాలామంది శ్రావణమాసంలో చేసుకునే అతిముఖ్యమైన పూజ. 

దేవాలయాల్లో దేవతలకు అభిషేకాలు చేయించడం కూడా ఈ శ్రావణమాసంలో ప్రముఖంగా చేసే పనులు.

ఈ రెండు పనులను చేసి  మహాలక్ష్మి దేవి ముందు మనసులో ఉన్న కోరిక కోరితే ఆ మహాలక్ష్మి దేవి కొన్నిరోజులలోనే ఆ కోరిక తప్పకుండా తీరుస్తుందట. అయితే హేతుబద్ధమైన కోరికలను మాత్రమే ఆ దేవతలు అయినా దేవుళ్ళు అయినా తీరుస్తారు అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. 

నేతి దీపాలు!

సాధారణంగా గుడిలో కానీ ఇంట్లో కానీ దీపం పెట్టడం అంటేనే ఎంతో గొప్ప పుణ్యాన్ని కలిగించే విషయం.

శ్రావణమాసంలో అమ్మవారి గుడిలో కానీ ఇంట్లో అమ్మవారి పటం ముందు కానీ నేతి దీపాలు వెలిగించి, మల్లెపువ్వులతో అమ్మవారిని అలంకరించి కస్తూరి గంధం, జాజిపువ్వులు మొదలైనవాటితో పూజిస్తే ఆ అమ్మవారు సంతోషపడతారట. అంతేకాదు అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా పెట్టాలి.

శ్రావణ శుక్రవారం ప్రత్యేకత కదా అని మిగిలిన రోజులు పట్టించికోకుండా ఉండటం సరికాదు. ప్రతిరోజు ఉదయమే ఇంటిని శుభ్రం చేసుకుని, స్నానం చేసి  పూజ, దీపారాధన జరిగితే ఆ ఇంట్లో సకల ఐశ్వర్యాలను ఆ మహాలక్ష్మి దేవి అనుగ్రహిస్తుందని పెద్దలు, పండితులు చెబుతారు. కాబట్టి శ్రావణమాసాన్ని భక్తిగా పాటించండి మరి.

                                  ◆ వెంకటేష్ పువ్వాడ.