శ్రావణ మాసం ప్రారంభం!

 

శ్రావణ మాసం ప్రారంభం!

సనాతన ధర్మంలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంది. ముఖ్యంగా శ్రావణ మాసానికి మన ధర్మం లో చాలా విశేషం ఉంది. ఈ సంవత్సరం శ్రావణమాసం ఆగస్టు 17 నుంచి ప్రారంభం కాబోతోంది.  ఇప్పటికే అధికమాసం  పూర్తి చేసుకున్న అనంతరం నిజస్ శ్రావణమాసం రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది.  శ్రావణమాసంలో మనందరికీ గుర్తుకు వచ్చేది వరలక్ష్మీ వ్రతం. ప్రతి శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ముఖ్యంగా రెండవ శ్రావణ శుక్రవారం అంటే ఆగస్టు 25న వరలక్ష్మీదేవి వ్రతం నిర్వహిస్తారు.  అలాగే ఈ మాసంలో నాగ పంచమి, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి,  హయగ్రీవ జయంతి వంటి పండుగలు సైతం నిర్వహిస్తారు.  శ్రావణమాసం  శుభకార్యాలకు అత్యంత అనువైన కాలం. ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు నిర్వహించేందుకు ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి.  అదే విధంగా గృహప్రవేశము,  శంకుస్థాపనలు,  నూతన వ్యాపారం ప్రారంభం చేసేందుకు శ్రావణమాసం అత్యంత అనుకూలమైనది.

సాధారణంగా ఆషాడంలో పెళ్లి ముహూర్తాలు ఉండవు. . ఆషాడం తర్వాత  శ్రావణమాసంలో వివాహాది శుభకార్యాలు జరిపేందుకు అత్యంత అరువైన సమయం అని పండితులు చెబుతున్నారు.  అలాగే ఈ మాసంలో మంగళ గౌరీ వ్రతం కూడా ఆచరిస్తారు.  మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి మంగళ గౌరీ వ్రతం ఆచరించమని ప్రబోధించినట్లు  ప్రస్తావన ఉన్నది.  అంతేకాదు శ్రావణమాసంలో  ప్రతి మంగళవారం  ఈ మంగళ గౌరీ వ్రతం ఆచరించాలి.  కొత్తగా పెళ్లయిన  స్త్రీలు తొలి ఐదు సంవత్సరాలు ఈ వ్రతం ఆచరిస్తే నిత్య సుమంగళిగా వర్ధిల్లవచ్చని  పురాణాల్లో పేర్కొన్నారు

ఇక శ్రావణమాసంలో నరసింహ స్వామికి కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శ్రావణమాసంలోని శనివారం పూట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు.  ఈరోజు రావి చెట్టుకు పూజలు చేయడం ద్వారా శ్రీమహావిష్ణువుకు  పూజ చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి.

ఇక శ్రావణమాసంలో పంచమినాడు నాగ పంచమి నిర్వహిస్తారు.  ఈ సంవత్సరం ఆగస్టు 21న నాగ పంచమి  పర్వదినం రాబోతోంది.  తెలుగు రాష్ట్రాల్లో నాగపంచమి రోజున నాగరాజు కొలువుండే పుట్టలో పాలు పోసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు ఇలా చేయడం వల్ల కాలసర్ప దోషం తొలగిపోతుందని పేరు ఉంది.

అలాగే ఈ మాసంలోనే రాఖీ పౌర్ణమి కూడా వస్తుంది శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు.  ఈ రోజే బ్రాహ్మణులు జంధ్యం మార్చుకుంటారు.  పాత జంధ్యం విసర్జించి రాఖీ పౌర్ణమి రోజే కొత్త జంధ్యం ధరిస్తారు.  అలాగే శ్రావణమాసంలోనే శ్రీకృష్ణాష్టమి కూడా నిర్వహిస్తారు శ్రీకృష్ణుడు శ్రావణమాసంలోని అష్టమి రోజున రోహిణి నక్షత్రం వేళ  జన్మించినట్లు భాగవతంలో ఉంది.  ఆరోజే చిన్నికృష్ణుడికి పూజలు నిర్వహిస్తారు.  ఈ విధంగా శ్రావణమాసం సనాతన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత పొంది ఉంది.