శ్రావణ మాసం ప్రాముఖ్యత ఏంటి..ఈ మాసంలో వచ్చే పర్వదినాలు ఇవే!
శ్రావణ మాసం ప్రాముఖ్యత ఏంటి..ఈ మాసంలో వచ్చే పర్వదినాలు ఇవే!
హిందువులకు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణమాసం ఆగస్టు 17 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ సంవత్సరం అధిక మాసం రావడంతో నిజమైన శ్రావణమాసం ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానుంది. పురాణ కాలం నుంచి కూడా శ్రావణ మాసానికి ఒక విశిష్టత ఉంది. శ్రావణమాసం హరిహరులు ఇద్దరికీ ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. శ్రీ మహా విష్ణువు అలాగే లక్ష్మీదేవికి శ్రావణమాసం ఎంతో ఇష్టమైన మాసం. అటు శివుడికి కూడా శ్రావణమాసం చాలా విశిష్టమైనది. శ్రావణమాసం దక్షిణాయణంలో వచ్చే పుణ్యమాసం. ఈ మాసంలో సకల శుభకార్యాలకు చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. తెలుగు మాసాల ప్రకారం ఇది వరుస క్రమంలో 5వ మాసం. చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు. కనుక ఈ మాసాన్ని శ్రావణమాసం అని పిలుస్తారు. ముఖ్యంగా నోములు నోచే వారికి వ్రతాలు చేసే వారికి శ్రావణమాసం చాలా శుభప్రదమైనది. వివాహాది శుభకార్యాలకు శ్రావణమాసం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో తలబెట్టే పనులకు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసాన్ని లక్ష్మీప్రదమైన మాసం అని కూడా అంటారు.
శ్రావణ మాసంలో అనేక పర్వదినాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మాసంలోనే వరలక్ష్మీ వ్రతం ఉంటుంది. ప్రతి శ్రావణ శుక్రవారం మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా శ్రావణమాసంలో రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఈనెల 25వ తేదీన రెండవ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు.
మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, నాగచతుర్థి, పుత్రదా ఏకాదశి, రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, రాఘవేంద్ర జయంతి, శ్రీ కృష్ణాష్టమి, కామిక ఏకాదశి, పోలాల అమావాస్య వంటి పండగలను ఘనంగా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 14తో శ్రావణమాసం ముగుస్తుంది. ఆ తర్వాత భాద్రపద మాసం ప్రారంభం అవుతుంది. శ్రావణ మాసంలో ఆచరించాల్సిన వ్రతాలలో ప్రధానమైనది మంగళగౌరీ వ్రతం. శ్రావణమాసంలో వచ్చే 4 మంగళ వారాల పాటు ఈ మంగళ గౌరీ వ్రతం ఆచరించాలి. పార్వతి దేవిని గౌరి అని పిలుస్తారు. మంగళ గౌరీ వ్రతం కొత్తగా పెళ్ళయిన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తమ కుటుంబం భోగభాగ్యాలతో తులతూగుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడు తన సోదరీ అయినా ద్రౌపదికి ఈ వ్రతం గురించి చెప్పినట్లు మహాభారతంలో కూడా ప్రస్తావన ఉంది.
ఇక ఈ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే వరలక్ష్మీదేవి వ్రతం అత్యంత ముఖ్యమైనది. శ్రావణ శుక్రవారం పూట మహిళలంతా భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీదేవి వ్రతం ఆచరిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ చుట్టూ ఉన్న ముత్తైదువులను ఆహ్వానించి పేరంటం నిర్వహిస్తారు. వరలక్ష్మి వ్రతం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో బాగా నిర్వహిస్తారు. మహిళలు తమ సౌభాగ్యం కోసం సంతానం అభివృద్ధి కోసం ఈ వ్రతం ఆచరిస్తారు. అలాగే శ్రావణ మాసంలో నూతన గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభం, వంటివి కూడా నిర్వహించడం ద్వారా ఆయా రంగాల్లో విజయం సాధించవచ్చు అని పండితులు చెబుతున్నారు