లక్ష్మీప్రదమైన కాలం

 

లక్ష్మీప్రదమైన కాలం

శ్రావణ మాసం అని ఎందుకు పేరు ? అంటే మనయొక్క మొరలని ఆలకించేందుకు ఆ తల్లిని సిద్దపరిచే మాసం కనుకనే శ్రావణం అని పేరు. మన మొరలని ఆలకించే సమయం, శ్రవణ సంబంధమైన మాసం శ్రావణము. ఈ మాసంలో అమ్మ మనకు ఏకాంతంగా లభిస్తుంది. చాతుర్మాస్య క్రమం తెలుసుకుంటే అర్థం అవుతుంది. ఆషాడ మాస ఏకాదశి వరకు స్వామితో నిరంతరం ఉండే తల్లి పాలకడలిలో స్వామిని యోగ నిద్రలో పవళింపజేసి జగత్ రక్షణ ఎట్లా చేయాలో ఆలోచించుకోవడానికి కావల్సిన సమయాన్ని ఆయనకు ఇవ్వడానికి స్వామికి విశ్రాంతినిచ్చి అమ్మ బయలుదేరుతుంది. తరువాత వచ్చే మాసమైన శ్రావణ మాసంలో అమ్మ అందరి మొరలు వినడానికి అందుబాటులోకి వస్తుంది.

అందుకే అమ్మను ఆరాధన చేస్తుంటారు. శ్రావణ మాసం అంతా అమ్మను ఆరాధన చేయడానికి వీలైన సమయం. ప్రక్కన స్వామి లేనప్పుడు మన భాదలను అమ్మతో ఒంటరిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. తరువాత మాసం భాద్రపద. మనకు భద్రములను కలిగించడానికి చేసే మాసం. ఆతరువాతి మాసం ఆశ్వయుజ మాసం. అప్పుడు స్వామిని అమ్మను ఇరువురిని కలిపి పూజ చేయడానికి పూర్వ రంగం. అందుకే దసరా పండగనాడు స్వామి అశ్వవాహనం పై బయలుదేరి వస్తాడు. దానికి ముందు అమ్మ అనేక రూపాల్లో ఆరాధనల్ని అందుకొని శమీ వృక్షం క్రింద ఉంటుంది. శమీ అంటే క్షమింపజేసేది అని అర్థం. అందుకే స్వామి, మనం ఇరువురం శమీ వద్దకు వెళ్తాం. స్వామిని మనల్ని ఒకచోట కూర్చుతుంది అమ్మ. భగవంతుని రక్షణ తప్పక లభిస్తుంది అనే ఆనందంతోటే మనం ఆశ్వయుజ మాస చివరలో దీపాలను వెలిగిస్తాం. వచ్చే కార్తీక మాసంలో స్వామి లేచి వస్తాడు. ఈ క్రమాన్ని గమనించి మన పూర్వులు శ్రావణ మాసంలో అమ్మను ఆరాదిద్దాం.