ఫిబ్రవరి 28 సోమ ప్రదోషం… చాలా ప్రత్యేకం!
ఫిబ్రవరి 28 సోమ ప్రదోషం… చాలా ప్రత్యేకం!
శివుడు సృష్టిని నడిపించే లయకారుడు. చెడును అంతం చేసే ప్రళయకారుడు. శివుని అనుగ్రహంతో సాధ్యం కానిదంటూ లేదు. అకాల మృత్యువును సైతం గడ్డిపోచలా దహించివేయగల దైవం తను. ఆ పరమేశ్వరుని పూజించేందుకు అనువైన సమయం ప్రదోష కాలం.
ప్రతి రోజూ సూర్యాస్తమయానికి ముందు, తర్వాత కాలాన్ని ప్రదోషంగా పేర్కొంటారు. కాలాన్ని బట్టి, సంప్రదాయాలను బట్టి… ఈ ప్రదోష సమయం వేర్వేరు విధాలుగా ఉంటుంది. వీటిలో ఏది సరైంది అని తర్జనభర్జన పడేకంటే… సూర్యాస్తమయానికి ఒక అరగంట నుంచి తర్వాత అరగంట వరకు ప్రదోషంగా భావిస్తే ఎలాంటి ధర్మసందేహం కలగదు. ఈ గంట సమయంలో శివుని ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు.
ప్రదోషకాలంలో శివుడు ఆనంద తాండవం చేస్తాడని ప్రతీతి. ఆ మైమరపును చూసేందుకు సకల దేవతలూ కైలాసాన్ని చేరుకుంటారట. ప్రమథ గణాలు సైతం ఈ కాలంలో చురుగ్గా ఉంటాయని నమ్మకం. ఇలాంటి అరుదైన సమయంలో… శివుని అర్చించుకోవడం, ఆయనకు ఇష్టమైన రుద్రాన్ని చదవడం, తనను ప్రసన్నం చేసుకునేందుకు శివస్తోత్రాలను పఠించడం లాంటి పనులు చేయవచ్చు. ఇవేవీ కుదరకపోయినా… ఆ కాసేపు ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరిని జపించినా విశేషమైన ఫలితం ఉంటుంది.
ప్రతి త్రయోదశి రోజున వచ్చే ప్రదోష కాలం మరింత ప్రత్యేకం. ఆ రోజును మహా ప్రదోషంగా భావించి… ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ రోజు అంతా నిరాహారంగా ఉండి, సాయం వేళ శివ పూజ చేసిన తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ త్రయోదశి ప్రదోష కాలంలోనే పరమేశ్వరుడు హాలాహలాన్ని స్వీకరించి… లోకాన్ని ఆ విషం నుంచి కాపాడని పురాణకథనం. హాలాహలం అంటే చెడుకు, కష్టానికీ, అడ్డంకులకూ, అనారోగ్యానికీ, పాపాలకూ సూచన. కాబట్టి ఆ రోజున శివుని ఆరాధిస్తే… మన లౌకిక జీవితంలో ఉండే ప్రతికూలతలన్నింటినీ కూడా ఆయన తొలగించివేస్తాడని నమ్మకం.
ఇక ఈ ఫిబ్రవరి 28న మహాప్రదోషం సోమవారం నాడు వచ్చింది. ఇలా వచ్చే ప్రదోషాన్ని సోమ ప్రదోషం అంటారు. దీనికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. పైగా సోమవారానికి చంద్రుడు అధిపతి. జాతకరీత్యా చంద్రడు మన మనఃస్థితిని శాసిస్తాడు. కాబట్టి ఈ రోజున కనుక శివుని ఆరాధించి, మరీ ముఖ్యంగా ప్రదోష సమయంలో ఆయన్ను కొలుచుకుంటే… జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరి, ప్రశాంతత ఏర్పడుతుంది!
- నిర్జర.