రోజూ నుదుటన విభూతి ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
రోజూ నుదుటన విభూతి ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
భారతీయ హిందూ ధర్మంలో విభూతికి చాలా ప్రాధాన్యత ఉంది. విభూతిని భస్మం అంటారు. పరమేశ్వరుడికి భస్మంతో అభిషేకమే చేస్తారు. ఆయన విభూతి అంటే అంత ప్రీతి. ఇక విభూతి శక్తిని తెలియజేయడానికి ఒక చిన్న విషయాన్ని కూడా చెబుతుంటారు. అదేంటంటే.. ఒక విదేశీయుడు ఒక శివాలయం బయట ఒక పిల్లవాడు విభూతి అమ్ముతుంటే ఆ పిల్లవాడి దగ్గరకు వెళ్లి ఈ విభూతి ఎక్స్‌పైరీ డేట్ ఎంత? అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడు.. ఈ విభూతికి ఎక్స్‌పైరీ డేట్ లేదు.. దీన్ని రోజూ నుదుటన పెట్టుకుంటే మన ఎక్స్‌పైరీ డేట్ పెరుగుతుంది అని సమాధానం ఇస్తాడు. మనిషి ఆయుష్షును పెంచే శక్తి విభూతికి ఉంటుందనేది ఈ విషయంలో అర్థం. అయితే ఇది మాత్రమే కాదు.. ప్రతి రోజూ విభూతిని నుదుటన ధరించడం వల్ల అద్బుతమే జరుగుతుంది..
జీవితంలో చేసిన, తెలియక చేసుకున్న దోషాలు, సర్వ పాపాలు పటాపంచలు చేయడంలో విభూతి శక్తివంతంగా పనిచేస్తుంది. సంపూర్ణ ఆయురారోగ్యాలు చేకూరి, ఆయుష్షు పెరగాలన్నా, సిరిసంపదలు లభించాలన్నా ప్రతి రోజూ విభూతిని ధరించడమే ఏకైక మార్గమని శాస్త్రం చెబుతుంది.
హిందువులు అంటేనే పూజలకు పెట్టింది పేరు.. కానీ నేటికాలపు బిజీ జీవితాలలో పూజలు చేయడం కష్టంగా, సమయం దొరకనంత ఇబ్బందులలో ఉంటారు. అలా రోజూ పూజలు చేయలేని వారు ప్రతి రోజూ స్నానం చేయగానే విభూతిని నుదుటన పెట్టుకోవాలి. ఇలా చేస్తే సహస్రనామాలతో దేవుడిని పూజించినంత ఫలం, నిత్యం ఆలయ దర్శనం చేసుకున్నంత పుణ్యం లబిస్తాయట. ఇంత శక్తివంతమైన విభూతిని దరించిన వారి జీవితం కూడా ఎంతో గొప్పగా అభివృద్ది చెందుతుందట.
హోమ భస్మాన్ని కూడా విభూతిగా ధరిస్తారు. ఈ హోమ భస్మాన్ని ధరించడం వల్ల నవగ్రహ బాధలు, జీవితంలో చేసిన అన్ని రకాల దోషాలు, గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాలు అన్నీ తొలగిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారట. అందుకే ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే కాసింత విభూతిని నుదుటన ధరించడం ఎంతో మంచిది.
*రూపశ్రీ.