Read more!

శ్రీసాయిసచ్చరిత్రము నలభైరెండవ అధ్యాయం

 

శ్రీసాయిసచ్చరిత్రము

 

నలభైరెండవ అధ్యాయం

 

 

 

 

బాబా మహాసమాధి చెందుట: 1. ముందుగా సూచించుట 2. రామచంద్ర దాదా పాటీలు, తాత్యాకోతే పాటీలుల చావులును తప్పించుట 3. లక్ష్మీబాయి శిందేకు దానము 4. చివరిదశ.


ఈ అధ్యాయంలో బాబా తమ దేహాన్ని చాలించిన వృత్తాంతము వర్ణితం.
గత అధ్యాయాలలో చెప్పిన లీలలు, బాబా కృప అనే కాంతిచే ఐహికజీవితంలోని భయాన్ని ఎలా త్రోసివేయగలమో, మోక్షానికి మార్గాన్ని ఎలా తెలుసుకొనగలమో, మన కష్టాలను సంతోషంగా ఎలా మార్చగలమో చెపుతుంది. సద్గురుని పాదారవిందాలను జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే మన కస్టాలు నశిస్తాయి. మరణం దాని నైజం కోల్పోతుంది. ఐహికదుఖాలు నశిస్తాయి. ఎవరయితే తమ క్షేమాన్ని కోరుకుంటారో వారు శ్రీసాయి లీలలను జాగ్రత్తగా వినాలి. అది వారి మనస్సును పావనం చేస్తుంది.
 
ముందుగా సూచించుట :

 

 

 

 


చదివేవారు ఇంతవరకు బాబా జీవితకథలను విన్నారు. ఇప్పుడు వారు మహాసమాధి ఎలా పొందారో వింటారుగాక. 1918 సెప్టెంబరు 28వ తేదీన బాబాకు కొంచెం జ్వరం తగిలింది. జ్వరం రెండుమూడు రోజులు ఉండింది. కాని ఆ తరువాత బాబా భోజనం మానేశారు. అందుకే ప్రమంగా బలహీనులయ్యారు. 17వ రోజు అంటే 1918 సంవత్సరం అక్టోబరు 15వ తేదీ మంగళవారం 2-30 గంటలకు బాబా భౌతికశరీరాన్ని విడిచారు. ఈ విషయం రెండు సంవత్సరాలకు ముందే బాబా సూచించారు కాని, అది ఎవరికీ బోధపడలేదు. అది ఇలా జరిగింది. 1916వ సంవత్సరం విజయదశమి రోజు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘన ఒనర్చి తిరిగి వస్తుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులయ్యారు. సీమోల్లంఘన అంటే గ్రామపు సరిహద్దును దాటటం. బాబా తమ తలగుడ్డ, కఫనీ, లంగోటీ తీసి వాటిని చించి ముందున్న ధునిలోకి విసిరేశారు. దీనిమూలంగా ధుని ఎక్కువగా మండసాగింది. ఆ కాంతిలో బాబా అమితంగా ప్రకాశించారు. బాబా అక్కడ దిగంబరుడై నిలిచి ఎర్రగా మండుతున్న కళ్ళతో బిగ్గరగా ఇలా అరిచారు. "ఇప్పుడు సరిగ్గా గమనించి నేను హిందువునో, మహామ్మదీయుడినో చెప్పండి''. అక్కడ ప్రతిఒక్కరూ గడగడ వణికిపోయారు.

 

 

 

 


బాబా దగ్గరికి వెళ్ళటానికి ఎవరూ సాహసించలేకపోయారు. కొంతసేపటికి భాగోజి శిందే (కుష్ఠురోగ భక్తుడు) ధైర్యంతో దగ్గరకు వెళ్ళి లంగోటీని కట్టి ఇలా అన్నాడు. "బాబా! సీమోల్లంఘన రోజు ఇదంతా ఏమిటి? ఈ రోజు నా సీమోల్లంఘనం'' అంటూ బాబా సటకాతో నేలపై కొట్టారు. బాబా రాత్రి 11 గంటలవరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగుతుందో లేదో అని అందరూ సంశయించారు. ఒక గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చారు. ఎప్పటిలా దుస్తులు వేసుకుని చావడి ఉత్సవానికి తయారయ్యారు. ఈ విధంగా బాబా తాము దసరారోజు సమాధి చెందుతామని సూచించారు కాని అది ఎవరికీ అర్థం కాలేదు. దిగువ వివరించిన ప్రకారం బాబా మరియొక్క సూచన కూడా చేసారు.

రామచంద్ర, తాత్యాకోతే పాటీళ్ళ మరణము తప్పించుట :

 

 

 

 


ఇది జరిగిన కొంతకాలం తరువాత రామచంద్ర పాటీలు తీవ్రంగా జబ్బుపడ్డారు. అతడు చాలా బాధపడ్డాడు. అన్ని ఔషధాలు ఉపయోగించారు కాని, అవి గుణాన్ని ఇవ్వలేదు. నిరాశ చెంది, చావుకు సిద్ధంగా ఉన్నారు. ఒకరోజు నడిరేయి బాబా అతని దిండు దగ్గర నిలిచారు. పాటీలు బాబా పాదాలు పట్టుకుని, "నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణిస్తానో దయచేసి చెప్పండి'' అన్నారు. దాక్షిణ్యమూర్తి అయిన బాబా నీవు ఆతృత పడవద్దు, నీ ఛావు చీటీ తీసివేశాను! త్వరలో బాగుపడతావు కాని, తాత్యాకోతే పటేలు గురించి సంశయిస్తున్నాను. అతడు శక. సం. 1840 (1918) విజయదశమి రోజు మరణిస్తాడు. ఇది ఎవరికీ తెలియనీయకు. వానికి కూడా చెప్పవద్దు, చెప్పినట్లయితే అమితంగా భయపడతాడు' 'అన్నారు. రామచంద్ర దాదా జబ్బు కుదిరింది. కానిఅతడు తాత్యా గురించి సంశయిస్తూ ఉన్నాడు. ఎలాగంటే బాబా మాటలు తిరుగులేదు కనుక తాత్యా రెండు సంవత్సరాలలో మరణం చెందుతాడు అనుకున్నాడు. దాన్ని రహస్యంగా ఉంచాడు. ఎవరికీ తెలియనీయలేదు. కాని, బాలాషింపికి మాత్రమే చెప్పాడు. రామచంద్రపాటీలు, బాలాషింపి ఈ ఇద్దరూ మాత్రమే తాత్యా గురించి భయపడుతూ ఉన్నారు.

 

 

 



రామచంద్ర దాదా త్వరలో ప్రక్కనుండి లేచి నడవసాగారు. కాలం వేగంగా కదలిపోయింది. 1918 భాద్రపదం ముగిసింది. ఆశ్వీయుజమాసం సమీపిస్తూ ఉంది. అందుకే బాబా దర్శనానికి రాలేకపోతున్నాడు. బాబా కూడా జ్వరంతో ఉన్నారు. తాత్యాకు బాబాపట్ల పూర్తి విశ్వాసం ఉండేది. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉన్నారు. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగం అధికం అయ్యింది. అతడు కదలేకపోయాడు. ఎల్లప్పుడు బాబానే స్మరిస్తూ ఉన్నాడు. బాబా పరిస్థితి కూడా క్షీణించింది. విజయదశమి సమీపిస్తూ ఉంది. రామచంద్ర దాదా, బాలాషింపీ తాత్యా గురించి అమితంగా భయపడ్డారు. వారి శరీరాలు వణకటం ప్రారంభమయ్యాయి. శరీరమంతా చెమటలు పట్టాయి. బాబా చెప్పిన ప్రకారం తాత్యా ఛావు దగ్గరకి వచ్చింది అనుకున్నారు. విజయదశమి రానే వచ్చింది. తాత్యా నాడి బలహీనమయ్యింది. త్వరలో ప్రాణం విడుస్తాడని అనుకున్నారు. ఇంతలో గొప్ప వింత జరిగింది. తాత్యా నిలబడ్డారు, అతని మరణం తప్పింది. అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేశారు. వారిలో వారు మరణం మార్చుకున్నట్టు కనిపించింది. బాబా తన ప్రాణాన్ని తాత్యా కోసం అర్పించారని ప్రజలు అనుకున్నారు. బాబా ఎందుకు ఇలా చేశారో బాబాకే తెలుసు. వారి కృత్యాలు అగోచరాలు. ఈ విధంగా బాబా తమ సమాధిని సూచించారు. తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపారు.

 

 

 

 


ఆ మరుసటి ఉదయం అంటే అక్టోబరు 16వ తేదీన పండరీపురంలో దాసగణుకు బాబా స్వప్నంలో సాక్షాత్కరించి ఇలా అన్నారు : "మసీదు కూలిపోయింది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టారు. కాబట్టి ఆ స్థలాన్ని విడిచి పెట్టాను. ఈ సంగతి నీకు తెలపడానికే వచ్చాను. వెంటనే అక్కడకు వెళ్ళు. నన్ను సరిపోయేంత పుష్పాలతో కప్పు'' షిరిడీనుంచి వచ్చిన ఉత్తరం వలన కూడా దాసగణుకు ఈ సంగతి తెలిసింది. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరుకున్నాడు. భజన కీర్తన ప్రారంభించారు. బాబాను సమాధి చేయడానికి ముందురోజు అంతా భగవన్నామస్మరణ చేశారు. భగవన్నామస్మరణ చేస్తూ ఒక చక్కని పువ్వుల హారాన్ని స్వయంగా గుచ్చి దాన్ని బాబా సమాధిపై వేశారు. బాబా పేరుతో అన్నదానం చేశారు.

లక్ష్మీబాయి శిందేకు దానము :

 

 

 

 


దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభసమయం. ఈ రోజున బాబా సమాధి చెందడానికి నిశ్చయించుకోవడం అత్యంత సవ్యంగా ఉన్నది. కొన్ని రోజులనుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. లోపల మాత్రం పూర్ణ చైతన్యులుగా ఉన్నారు. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుని మంచి స్థితిలో ఉన్నట్టు కనపడ్డారు. అపాయస్థితి దాటిందని, బాబా కోలుకుంటున్నారని అందరూ అనుకున్నారు. తాము త్వరలో సమాధి చెందుతామని బాబాకు తెలుసు. కాబట్టి లక్ష్మీబాయి శిందేకి కొంత ద్రవ్యాన్ని దానం చేయాలని నిశ్చయించుకున్నారు.

బాబా సర్వజీవవ్యాప్తి :

 

 

 

 


ఈ లక్ష్మీబాయి శిందే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేస్తూ ఉండేది. రాత్రి సమయంలో భక్త మహల్సాపతి, తాత్యా, లక్ష్మీబాయి శిందే తప్ప తదితరులు ఎవ్వరూ మసీదులో కాలు పెట్టడానికి అనుమతి లేకపోయింది. ఒకరోజు సాయంకాలం బాబా మసీదులో తాత్యాతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి శిందే వచ్చి బాబాకు నమస్కరించింది. బాబా ఇలా అన్నారు, "ఓ లక్ష్మీ! నాకు చాలా ఆకలి వేస్తుంది'' వెంటనే ఆమె లేచి "కొంచెంసేపు ఆగు. నేను త్వరలో రొట్టెను తీసుకుని వస్తాను'' అంది. అన్న ప్రకారం ఆమె త్వరగా రొట్టె, కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టింది. బాబా దాన్ని అందుకుని ఒక కుక్కకు వేశారు. లక్ష్మీబాయి ఇలా అడిగింది "ఇదేంటి బాబా! నేను పరుగెత్తుకుని వెళ్ళి నా చేతులారా నీకోసం రొట్టె చేశాను. నీవు దాన్ని కొంచెమైనా తినకుండా కుక్కకు వేశావు. అనవసరంగా నాకు శ్రమ కలగజేశావు.

 

 

 

 


 అందుకు బాబా ఇలా సమాధానం ఇచ్చారు : "అనవసరంగా విచారిస్తావెందుకు? కుక్క ఆకలి తీర్చటం నా ఆకలి తీర్చటం వంటిది. కుక్కకు కూడా ఆత్మ ఉంది. ప్రాణులు వేరు కావచ్చు. కాని అందరి ఆకలి ఒక్కటే. కొందరు మాట్లాడగలరు. కొందరు మూగవారిలా మాట్లాడలేరు. ఎవరయితే ఆకలితో ఉన్నవారికి భోజనం పెడతారో వారు నాకు అన్నం పెట్టినట్లే. దీన్నే గొప్ప నీతిగా తెలుసుకోండి'' ఇది చాలా చిన్న విషయం కాని, బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించి, ఇతరులకు ఎలాంటి బాధ కలగకుండా నిత్యజీవితంలో దాన్ని ఆచరణలో పెట్టడం ఎలాగో చూపించారు. ఆనాటినుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తిప్రేమలతో బాబాకు పెడుతూ ఉంది. బాబా మెచ్చుకుని ఎంతో ప్రేమతో తింటూ ఉండేవారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుస్తూ ఉండేవారు. ఆమె బాబా భుక్తశేషాన్నే ఎల్లప్పుడు తింటూ ఉండేది. ఈ రొట్టె కథను విషయాంతరంగా భావించరాదు. దీన్ని బట్టి బాబా సర్వజీవులలో ఉన్నాడని తెలుసుకోగలం. బాబా సర్వవ్యాపి, చావుపుట్టుకలు లేనివారు, అమరులు.

 

 

 

 


బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞాపకం ఉంచుకున్నారు. ఆమెను ఎలా మరచిపోతారు? బాబా తన భౌతికశరీరాన్ని విడుస్తున్నప్పుడు, తన జేబులో చేయిపెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంజోకసారి 4 రూపాయలు మొత్తం 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి యిచ్చారు. ఈ సంఖ్య 21వ అధ్యాయంలోని నవవిధభక్తులకు తెలియజేస్తుంది. లేదా ఇది సీమోల్లంఘన సమయంలో ఇచ్చే దక్షిణ అనుకోవచ్చు. లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు అవటంతో ఆమెకు ధనం అవసరం లేదు. కాబట్టి బాబా ఆమెకు ముఖ్యంగా నవవిధభక్తులను గురించి బోధించి ఉండవచ్చు. భాగవతం ఏకాదశస్కందం దశమ అధ్యాయంలో ఆరవ శ్లోకం పూర్వార్థం 5, ఉత్తరార్థం 4 విధాల భక్తి చెప్పబడి ఉంది. బాబా ఈ ప్రకారంగా మొదట 5, తరువాత 4 మొత్తం 9 రూపాయలు ఇచ్చారు. ఒక తొమ్మిదే కాక తొమ్మిదికి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతిమీదుగా వ్యయమయ్యాయి. కాని బాబా యిచ్చిన ఈ తొమ్మిది రూపాయలను ఆమె ఎప్పటికీ మరవదు.

 

 

 


అత్యంత జాగరూకత మరియు పూర్ణచైతన్యం కలిగి ఉండే బాబా అవసానకాలంలో కూడా తగిన జాగ్రత్త పడ్డారు. తన భక్తులపై గల ప్రేమానురాగాల పట్ల తగల్కోకుండా ఉండేట్లు, వారందరినీ లేచిపోమ్మని చెప్పారు. కాకాసాహెబు దీక్షిత్, బాపూసాహెబు బూటీ మొదలైనవారు మసీదులో ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉన్నారు. కాని బాబా వారిని వాడాకు వెళ్ళి భోజనం చేసి రమ్మని చెప్పారు. వారు బాబాను విడవలేకపోయారు; బాబా మాటను జవదాట లేకపోయారు. మనస్సులో ఇష్టం లేనప్పటికీ వారు వెళ్ళలేక వెళ్ళలేక మసీదు విడిచి వెళ్ళారు. బాబా స్థితి అపాయకరంగా ఉందని వారికి తెలుసు. కాబట్టి వారు బాబాను మరవకుండా ఉన్నారు. వారు భోజనానికి కూర్చున్నారు కాని వారి మనస్సు బాబాపై ఉండింది. వారు భోజనం పూర్తి చేయకముందే బాబా తమ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారని వార్త వచ్చింది. భోజనాలను విడిచిపెట్టి అందరూ మసీదుకు పరుగెత్తారు.

 

 

 

 


బయాజీ అప్పాకోతే పై బాబా దేహం ఒరికి ఉండింది. వారు నేలపై కాని తమ గద్దెపై కాని పడలేదు. తమ స్థలంలో ప్రశాంతంగా కూర్చుని తమ చేతితో దానం చేస్తూ శరీరం విడిచిపెట్టారు. యోగులు శరీరం ధరించి ఏదో పనిమీద భూలోకానికి వస్తారు. అది నెరవేరిన తరువాత వారెంత నెమ్మదిగాను, సులభంగాను అవతరించారో అంత శాంతంగా వెళ్తారు.

నలభైరెండవ అధ్యాయం సంపూర్ణం