శ్రీసాయిసచ్చరిత్రము ముప్పైఐదవ అధ్యాయము
శ్రీసాయిసచ్చరిత్రము
ముప్పైఐదవ అధ్యాయము
ఊదీ మహిమ : 1. కాకామహాజని స్నేహితుడు, యజమాని. 2. బాంద్రా అనిద్ర రోగి. 3. బాలాజీ పాటీలు నేవాస్కర్.
ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ వర్ణితమే. ఇందులో బాబా రెండు విషయాలలో పరీక్షింపబడి లోపంలేదని కనుగొనబడటం కూడా చెప్పబడింది. బాబాను పరీక్షించే కథలు మొట్టమొదట చెప్పాబడుతుంది.
ఆధ్యాత్మిక విషయాలలో లేదా సాధనాలలో, శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడతాయి. భగవంతుడు నిరాకారుడని నమ్మేవారు భగవంతుడు ఆకారం కలవాడని నమ్మేవారిని ఖండించి అది వట్టి భ్రమ అంటారు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే. కాబట్టి వారికి ఎందుకు నమస్కరించాలి? అంటారు. ఇతర శాఖలవారు కూడా ఆక్షేపణ చేస్తూ వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ ఎందుకు చేయాలి? అంటారు. సాయిబాబా గురించి కూడా అలాంటి ఆక్షేపణ చేశారు. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగారు. యోగులు ఈ ప్రకారంగా ధనం పోగుచేయటం శ్రేయస్కరమా? వారి ఇలా ధనం జాగ్రత్త చేసినట్లయితే వారి యోగి గుణాలు ఎక్కడ? అని విమర్శించారు. అనేకమంది బాబాను వెక్కిరించడానికి షిరిడీకి వెళ్ళి చివరికి వారిని ప్రార్థించడానికి అక్కడే ఉండిపోయారు. అటువంటి రెండు ఉదాహరణలు ఈ క్రింద ఇస్తున్నాము.
కాకామహాజని స్నేహితుడు :
కాకామహాజని స్నేహితుడు నిరాకారుడైన భగవంతుణ్ణి ఆరాధించేవాడు. విగ్రహారాధనకి అతడు విముఖుడు. అతడు ఊరుకనే వింతలు ఏమైనా తెలుసుకోడానికి షిరిడీకి వెళ్ళడానికి అంగీకరించారు. కాని, బాబాకు నమస్కరించనని, వారికి దక్షిణ ఇవ్వన్నీ చెప్పారు. కాకా ఈ షరతులకు ఒప్పుకున్నారు. ఇద్దరూ శనివారం రోజు బొంబాయి విడిచి ఆ మరుసటి రోజు షిరిడీకి చేరుకున్నారు. వారు మసీదు మెట్లు ఎక్కగానే కొంచెం దూరంలో ఉన్న బాబా, మహాజని స్నేహితున్ని మంచి మాటలతో ఆహ్వానించారు. ఆ కంఠధ్వని అత్యంత చిత్రంగా ఉంది. ఆ కంఠం అతని తండ్రి కంఠంలా ఉండింది. ఆ కంఠం గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చింది. శరీరం సంతోషంతో ఉప్పొంగింది. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెపుతాను? అత్యంత ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు "ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే'' అన్నారు. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి, తన మనోనిశ్చయాన్ని మరిచినవాడై, బాబా పాదాలకు నమస్కరించారు.
ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడగగా కాకామహాజని యిచ్చారు. బాబా కాకానే దక్షిణ అడుగుతూ ఉన్నారు. కాని అతని స్నేహితుణ్ణి అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో "బాబా నిన్నే రెండుసార్లు దక్షిణ అడిగారు. నేను నీతో ఉన్నాను. నన్నెందుకు విడిచిపెడుతున్నారు?'' అన్నారు. "నీవే బాబాను అడుగు'' అని అతడు జవాబిచ్చారు. తన స్నేహితుడు ఏమని చెవిలో ఊడుచున్నాడని బాబా కాకామహాజనిని అడగగా, తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడు అన్నారు. బాబా "నీకు ఇవ్వడానికి మనస్సులో యిష్టం లేకపోయింది. కాబట్టి నిన్ను అడగలేదు. కాని యిప్పుడు నీకు ఇష్టమున్నట్లయితే ఇవ్వవచ్చు'' అన్నారు. కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయలు దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చారు. బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపంలో ఇలా చెప్పారు "నీవు దాన్ని తీసివేయి; మనకు మధ్యనున్న అడ్డును తీసివేయి. అప్పుడు మనం ఒకరినొకరు ముఖాముఖి చూసుకోగలము, కలిసి కొనగలం!'' వెళ్ళడానికి బాబా వారికి సెలవు యిచ్చారు. ఆకాశంలో మేఘాలతో కమ్మి ఉన్నప్పటికీ వర్షం వస్తుందేమో అనే భయం కలుగుతున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణం సాగుతుందని బాబా ఆశీర్వదించారు. ఇద్దరూ సురక్షితంగా బొంబాయి చేరుకున్నారు. అతడు ఇంటికి వెళ్ళి తెలుపు తీసేసరికి రెండు పిచ్చుకలు చచ్చిపడి ఉన్నాయి. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయింది. తానే కిటికీలు తెరిచి ఉన్నట్లయితే పిచ్చుకలు రక్షింపబడి ఉండేవి. వాటి అదృష్టానుసారం అవి చచ్చాయి. మూడవదాన్ని రక్షించడానికే బాబా త్వరగా తనను పంపించారు అనుకున్నారు.
కాకామహాజని - యజమాని :
ఠక్కర్ థరమ్సే జెఠాభాయి, హైకోర్టు ప్లీడరుకి ఒక కంపెనీ ఉండేది. దానిలో కాకా మేనేజరుగా పనిచేస్తూ ఉండేవారు. యజమానీ, మేనేజరు అన్యోన్యంగా ఉండేవారు. కాకా షిరిడీకి అనేకసార్లు వెళ్ళటం, కొన్ని రోజులు అక్కడనుండి తిరిగి బాబా అనుమతి పొంది రావటం, మొదలైనవి ఠక్కరుకు తెలుసు. కుతూహలం కోసం బాబాను పరీక్షించే ఆసక్తితో, ఠక్కర్ కాకాతో హోళీ సెలవులలో షిరిడీకి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. కాకా ఎప్పుడు తిరిగి వస్తారో అనేది నిశ్చయంగా తెలియదు కాబట్టి ఠక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళారు. ముగ్గురు కలిసి బయల్దేరారు. బాబాకి ఇవ్వస్డానికి కాకా రెండు శేర్ల ఎండుద్రాక్ష పండ్లు (గింజలతో ఉన్నవి) దారిలో కొన్నారు. వారు షిరిడీకి సరైన వేళకు చేరుకొని, బాబా దర్శనంకోసం మసీదుకు వెళ్ళారు. అప్పుడు అక్కడ బాబాసాహెబు తర్ఖడు ఉన్నారు. ఠక్కర్ మీరు ఎందుకు వచ్చారు అని తర్ఖడుని అడిగారు. దర్శనం కోసమని తర్ఖడు జవాబిచ్చారు. మహిమలు ఏమైనా జరిగాయా అని ఠక్కర్ ప్రశ్నించారు. బాబా దగ్గర ఏమైనా అద్భుతాలు చూడటం తన నైజం కాదనీ, భక్తులు ప్రేమతో కాంక్షించేది జరుగుతుందని తర్ఖడ్ చెప్పారు.
కాకా బాబా పాదాలకు నమస్కరించి ఎండుద్రాక్ష పళ్ళను అర్పించారు. బాబా వాటిని పంచిపెట్టమని ఆజ్ఞాపించారు. ఠక్కరుకు కొన్ని దాక్షలు దొరికాయి. అతనికి అవి తినడానికి యిష్టం లేదు. ఎందుచేత అంటే తన వైద్యుడు కడిగి శుభ్రపరిచకుండా ద్రాక్షలు తినకూడదని సలహా యిచ్చిఉన్నాడు. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచింది. తనకు వాటిని తినడం ఇష్టం లేదు కాని బాబా తినడానికి ఆజ్ఞాపించటంతో పారేయలేక పోయాడు. పారేసినట్లయితే బాగుడదని వాటిని నోటిలో వేసుకున్నారు. గింజలని ఏమి చేయాలో తోచకుండా ఉంది. మసీదులో గింజలు ఉమ్మివేయడానికి జంకుతూ ఉన్నాడు. తన యిస్టానికి వ్యతిరేకంగా చివరికి గింజలు తన జేబులో వేసుకున్నారు. బాబా యోగి అయినట్లయితే తనకు ద్రాక్షపండ్లు ఇష్టం లేదని తెలియదా? బాబా వాటిని ఎందుకు బలవంతంగా ఇచ్చారు? ఈ ఆలోచన అతని మనస్సులో తట్టగానే బాబా యింకా మరికొన్ని ద్రాక్షపళ్ళు ఇచ్చారు. అతడు వాటిని తినలేదు, చేతిలో పట్టుకున్నారు. బాబా వాటిని తినమని అన్నారు. వారి ఆజ్ఞానుసారం తినగా, వాటిలో గినకు లేకుండా ఉన్నాయి. అందుకు అతడు అమితంగా ఆశ్చర్యపడ్డాడు. అద్భుతాలు చూడలేదనుకున్నాడు. కాబట్టి అతనిపై ఈ అద్భుతం ప్రయోగించబడింది. బాబా తన మనస్సుని కనిపెట్టి గింజలుగల ద్రాక్షపళ్ళను గింజలు లేనివాటిగా మార్చివేశారు. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించడానికి తర్ఖడుకు ఎలాంటి ద్రాక్షలు దొరికాయని అడిగారు. గింజలతో ఉన్నవి దొరికాయని తర్ఖడు చెప్పారు. ఠక్కరు ఆశ్చర్యపడ్డారు. తనలో ఉద్భవిస్తున్ననమ్మకం ధృడపరచడానికి బాబా యథార్థంగా యోగి అయినట్లయితే ద్రాక్షపళ్ళు మొట్టమొదట కాకి ఇవ్వాలి అనుకున్నారు. అతని మనస్సులో ఉన్న ఈ సంగతి కూడా గ్రహించి, బాబా కాకా దగ్గర ఎండుద్రాక్షల పంపిణీ ప్రారంభించాలని ఆజ్ఞాపించారు. ఈ నిదర్శనంతో ఠక్కరు సంతృప్తి చెందారు.
శ్యామా ఠక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశారు. అందుకు బాబా ఇలా అన్నారు : "అతను ఎలా అతనికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు ఉన్నారు.'' కాకా ఈ జవాబుకు చాలా ప్రీతిచెందారు. తన మనోనిశ్చయం మరిచి ఠక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగి వెళ్ళిపోయారు. మధ్యాహ్నహారతి అయిన తరువాత, వారందరూ బాబా సెలవు తీసుకోవడానికి మసీదుకు వెళ్ళారు. శ్యామా వారి పక్షాన మాట్లాడారు. బాబా ఇలా చెప్పడం మొదలుపెట్టారు :
"ఒక చంచల మనస్సుగల పెద్దమనిషి ఉండేవాడు. అతనికి ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా ఉంది. ఎలాంటి విచారాలు లేకుండా ఉన్నారు. అనవసరమైన ఆరాటం పైన వేసుకుని, అక్కడక్కడ తిరుగుతూ మనఃశాంతిని పోగొట్టు కుంటున్నాడు. ఒక్కొక్కప్పుడు భారాలన్నీ వదిలేవేస్తూ ఉండేవారు. మరొకప్పుడు వాటిని మోస్తూ ఉన్నాడు. అతని మనస్సుకు నిలకడ లేకపోయింది. అతని స్థితిని కనిపెట్టి కనికరించి నేను నీకు యిష్టం వచ్చినచోట నీ నమ్మకం పాదుకొల్పుకో. ఎందుకిలా భ్రమిస్తావు? ఒకే చోటును ఆశ్రయించుకొని నిలకడగా ఉండు'' అని చెప్పాను.
వెంటనే ఠక్కరు అది అంతా తన గురించే అని గ్రహించారు. కాకా కూడా తన వెంట రావాలని అనుకున్నాడు. కాని కాకాకు అంత త్వరగా షిరిడీ విడవడానికి ఆజ్ఞ దొరుకుతుందని ఎవ్వరూ అనుకోలేదు. బాబా దీన్ని కూడా కనిపెట్టి కాకాను అతని యజమానితో వెళ్ళటానికి ఆజ్ఞ యిచ్చారు. ఈ విధంగా బాబా సర్వజ్ఞుడు అనడానికి ఠక్కరుకి ఇంకొక నిదర్శనం దొరికింది.
బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకుని అతనికి ఇలా చెప్పారు : "నేను ఒక రూపాయి దక్షిణ ఎవరి దగ్గరనుండి కాని తీసుకున్నట్లయితే దానికి పదిరెట్లు యివ్వాలి. నేను ఊరికే ఏమీ తీసుకోను. యుక్తాయుక్తాలు తెలియకుండా నేను ఎవరినీ అడగను. ఫకీరు ఎవరని చూపిస్తారో వారి దగ్గరే నేను తీసుకుంటాను. ఎవరైనా ఫకీరుకు గతజన్మనుంచి బాకీ ఉన్నట్లయితే, అతని దగ్గరే ధనం పుచ్చుకుంటాను. దానం చేసేవాడు ఇచ్చేది ప్రస్తుతం విత్తనాలు నాటటం వంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించటం కోసమే. ధర్మం చేయడానికి ధనాన్ని ఉపయోగించాలి. దాన్ని సొంతానికి వాడుకుంటే అది వ్యర్థం అయిపోతుంది. గతజన్మలో నీవు యిచ్చి ఉంటేనే గాని, నీవు ఇప్పుడు అనుభవించలేవు. కాబట్టి ధనాన్ని పొందాలనుకుంటే, దాన్ని ప్రస్తుతం యితరులకు ఇవ్వడం సరైన మార్గం. దక్షిణ ఇస్తున్నట్లయితే వైరాగ్యం పెరుగుతుంది. దానివలన భక్తిజ్ఞానాలు కలుగుతాయి. ఒక రూపాయి యిచ్చి 10 రూపాయలను పొందవచ్చు.
ఈ మాటలు విని, ఠక్కరు తన నిశ్చయాన్ని మరిచిపోయి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టారు. షిరిడీకి రావడం మేలైందాని అనుకున్నాడు. ఎలాగంటే అతని సంశయాలన్నీ తొలిగిపోయాయి. అతడు ఎంతో నేర్చుకున్నాడు. అటువంటివారి విషయాలలో బాబా ప్రయోగించే యుక్తి అత్యంత అమోఘమైనది. అన్నీ బాబాయే చేస్తున్నా, దేనిలోనూ అభిమానం వుంచలేదు. ఎవరయినా నమస్కరించినా నమస్కరించకపోయినా, దక్షిణ యిచ్చినా, ఇవ్వకపోయినా తనకి అందరూ సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించేవారు కాదు. తనను పూజించాలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు.
నిద్రపట్టని రోగము :
బాంద్రావాసి, కాయస్థప్రభు కులానికి చెందిన ఒక పెద్దమనిషి చాలా కాలం నిద్రపట్టక బాధపడుతూ వుండేవాడు. నిద్రపోవడాని కోసం నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రంగా తిడుతూ ఉండేవాడు. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రిళ్ళు అస్థిరంగా చేస్తూ ఉండేవి. ప్రతిరోజూ ఇలా జరిగి ఏమి చేయడానికి తోచలేదు. ఒకరోజు అతడు బాబా భక్తునితో ఈ విషయాన్ని మాట్లాడాడు. బాబా ఊదీయే దీన్ని తప్పనిసరిగా బాగుచేస్తుందని అతడు సలహా ఇచ్చాడు. అతడు అతనికి కొంత ఊదీ యిచ్చి ప్రతిరోజూ నిద్రించడానికి ముందు కొంచెం నుదుటికి రాసుకుని మిగతా పొట్లాన్ని తలక్రింద దిండుకు దిగువన పెట్టుకోమన్నాడు. ఇలా చేసిన తరువాత సంతోషం, ఆశ్చర్యం కలిగేలా అతనికి మంచి నిద్ర పట్టింది. ఎలాంటి చికాకులు లేకపోయాయి. అతడు సాయిని నిత్యం స్మరిస్తూ ఉన్నాడు. సాయి బాబా పటాన్ని తెచ్చి గోడపై వ్రేలాడదీశాడు. దాన్ని ప్రతిరోజూ పూజిస్తూ ఉన్నాడు. గురువారం రోజు పూలమాల వేస్తుండేవాడు. నైవేద్యం సమర్పిస్తూ ఉండేవాడు. తరువాత అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది.
బాలాజీ పాటీలు నేవాస్కరు :
ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశారు. ఇతడు షిరిడీలో బాబా ఏఏ మార్గాల ద్వారా వెళ్తూ ఉండేవారో వాటినన్నింటినీ తుడిచి శుభ్రం చేస్తుండేవాడు. అతని అనంతరం ఈ పని రాధాకృష్ణమాయి అతి శుభ్రంగా నెరవేరుస్తూ ఉండేది. ఆమె తరువాత అబ్దుల్లా చేస్తుండేవాడు. బాలాజీ ప్రతి సంవత్సరం పంట కోయగానే దాన్ని అంతా తెచ్చి బాబాకి అర్పితం చేస్తూ ఉండేవాడు. అతడు బాబా యిచ్చినదానితో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ ప్రకారంగా అతడు చాలా సంవత్సరాలు చేశాడు. అతని తరువాత అతని కుమారుడు దాన్ని అవలంభించాడు.
ఊదీ ప్రభావము :
ఒకరోజు బాలాజీ సంవత్సరీకం రోజు నేవాస్కరు కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనానికి పిలిచారు. భోజనసమయానికి పిలిచిన వారికంటే మూడురెట్లు బంధువులు వచ్చారు. నేవాస్కరు భార్యకు సంశయం కలిగింది. వండిన పదార్థాలు వచ్చినవారికి చాలవనీ, కుటుంబగౌరవానికి భంగం కలుగుతుందనీ ఆమె భయపడింది. ఆమె అత్తగారు ఓదారుస్తూ "భయపడకు, ఇది మనది కాదు. ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయి. వాటిలో కొంచెం ఊదీ వేయి. గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయి, సాయి మనల్ని కాపాడుతారు'' అన్నది. ఆమె ఆ సలహా ప్రకారమే చేసింది. వచ్చిన వారికీ భోజనపదార్థాలు సరిపోవటమే కాక ఇంకా చాలా మిగిలింది. తీవ్రంగా ప్రార్థించినట్లయితే యథాప్రకారం ఫలితం పొందవచ్చు అని ఈ సంఘటన తెలుపుతుంది.
సాయి పామువలె కన్పించుట :
ఒకరోజు షిరిడీ నివాసి రఘుపాటీలు నేవాసెలో ఉన్న బాలాజీ పాటీలు ఇంటికి వెళ్ళారు. ఆరోజు సాయంకాలం ఒక పాము ఆవులకొట్టం లోపలికి బుసకొడుతూ దూరింది. అందులోని పశువులన్నీ భయపడి కదలడం మొదలుపెట్టాయి. ఇంటిలోని వారందరూ భయపడ్డారు. కాని బాలాజీ శ్రీసాయియే ఆ రూపంలో వచ్చారని భావించాడు. ఏమీ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పం ముందు పెట్టి ఇలా అన్నాడు "బాబా ఎందుకు బుసకొడుతున్నావు? ఎందుకీ అలజడి? మమ్మల్ని భయపెట్టదలిచావా? ఈ గిన్నెడు పాలను తీసుకొని నెమ్మదిగా త్రాగు'' ఇలా అంటూ అతడు దాని దగ్గర నిర్భయంగా కూర్చున్నాడు. ఇంటిలోని తక్కినవారు భయపడ్డారు. వారికి ఏమి చేయడానికి తోచకుండా ఉంది. కొద్దిసేపటిలో సర్పం తనంతట తానే మాయమైపోయింది. ఎంత వెదికినా కనిపించలేదు.
బాలాజీకి ఇద్దరు భార్యలు, కొంతమంది బిడ్డలు ఉన్నారు. బాబా దర్శనం కోసం వారు అప్పుడప్పుడు షిరిడీకి వెళ్తుండేవారు. బాబా వారికోసం చీరలు, బట్టలు కొని ఆశీర్వాదాలతో ఇస్తూ ఉండేవారు.
ముప్పైఐదవ అధ్యాయము సంపూర్ణం