Read more!

శ్రీసాయిసచ్చరిత్రము ఇరవై తొమ్మిదవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము

 

ఇరవై తొమ్మిదవ అధ్యాయము

 

 

 

 

1.మద్రాసు భజనసమాజము 2. తేండూల్ కర్, (తండ్రి-కొడుకులు) 3. డాక్టర్ కాప్టెన్ హాటే 4. వామన్ నార్వేకర్ మొదలైన వారి కథలు.
ఈ అధ్యాయంలో రుచికరమైన, ఆశ్చర్యకరమైన మరికొన్ని సాయి కథలున్నాయి.
1. మద్రాసు భజనసమాజము :
1916వ సంవత్సరంలో రామదాసి పంథాకి చెందిన మదరాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరింది. అందులో ఒక పురుషుడు అతని భార్య, అతని కుమార్తె, అతని వదినె ఉన్నారు. వారి పేర్లు తెలియవు, మార్గమధ్యంలో వారు అహమదునగరు  జిల్లా, కోపర్ గాం తాలూకాలో షిరిడీ అనే గ్రామంలో సాయి అనే ఒక గొప్ప యోగీశ్వరుడు ఉన్నారని, వారు పరబ్రహ్మస్వరూపులనీ, ప్రశాంతులనీ, ఉదారస్వభావులనీ, భక్తులకు ప్రతిరోజూ ద్రవ్యం పంచిపెడతారనీ, విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితంగా సత్కరిస్తారనీ విన్నారు. ప్రతిరోజూ దక్షిణరూపంగా చాలా డబ్బు వసూలు చేసి, దాన్ని భక్తకొండాజి కూతురు 3 ఏండ్ల ఆమనికి ఒక రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు కొందరికి, జమాలికి 6 రూపాయలను, ఆమని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇస్తుండేవారు. ఇదంతా విని సమాజము షిరిడీకి వచ్చి అక్కడ ఆగి మంచి భోజనం చేశారు. వారు మంచి పాటలు పాడారు. కాని లోలోన ద్రవ్యాన్ని ఆశిస్తూ ఉన్నారు. వారిలో ముగ్గురు పేరాస గలవారు. యజమానురాలు మాత్రం అలాంటి స్వభావం కలది కాదు. ఆమె బాబా యందు పరమగౌరవాలు కలది. ఒకరోజు మధ్యాహ్న హారతి జరుగుతుండగా బాబా ఆమె భక్తివిశ్వాసాలకు ప్రీతి చెంది ఆమె యిష్టదైవం యొక్క దృశ్యాన్ని ప్రసాదించారు. ఆమెకు బాబా శ్రీరామునిలా కనిపించారు. తన యిష్టదైవాన్ని చూసి ఆమె మనస్సు కరిగింది. కళ్ళనుండి ఆనందబాష్పాలు కారుతుండగా ఆమె ఆనందంతో చేతులు తట్టింది. ఆమె ఆనంద వైఖరికి మిగిలినవారు ఆశ్చర్యపడ్డారు. కాని కారణం ఏమిటో తెలుసుకోలేకపోయారు. జరిగినదంతా ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పింది. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూశానని చెప్పింది. ఆమె అమాయక భక్తురాలు అవటంతో, శ్రీరాముని చూడటం ఆమె పడిన భ్రమ అని భర్త అనుకున్నాడు. అది అంతా వట్టి ఛాదస్తమని వెక్కిరించాడు. అందరు సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూడటం అసంభవమని అన్నాడు. ఆమె ఆ ఆక్షేపణకు కోపగించుకోలేదు. ఆమెకు శ్రీరామ దర్శనం అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, దురాశలు లేనప్పుడు లభిస్తూనే ఉన్నాయి.
ఆశ్చర్యకరమైన దర్శనము :

 

 

 


ఈ ప్రకారంగా జరుగుచుండగా ఒకరోజు రాత్రి అద్భుతమైన దృశ్యం ఈ విధంగా కన్పించింది. అతడొక పెద్ద పట్టణంలో ఉన్నాడు. అక్కడి పోలీసులు తనను బంధించారు. తాడుతో చేతులు కట్టి, ఒక పంజరంలో బంధించారు. పోలీసువారు తాడుముడి మరింత బిగిస్తుండగా సాయిబాబా పంజరం దగ్గరే నిలబడి ఉండటం చూసి విచారంగా అతడు ఇలా అన్నాడు "నీ కీర్తి విని నీ పాదాల దగ్గరికి వచ్చాను. నీవు స్వయంగా ఇక్కడ నిలబడి ఉండగా ఈ ఆపద నాపై ఎందుకు పడింది?'' బాబా యిలా అన్నారు "నీవు చేసిన కర్మఫలితాన్ని నీవే అనుభవించాలి!' 'అతడు ఇలా అన్నాడు "ఈ జన్మలో నాకు ఇలాంటి ఆపద రావడానికి నేను ఎలాంటి పాపం చేయలేదు.'' బాబా ఇలా అన్నారు "ఈ జన్మలో కాకపొతే గతజన్మలో ఏమయినా పాపం చేసి ఉండవచ్చు.'' అతడు ఇలా అన్నాడు "గత జన్మలో నేను ఏమైనా పాపం చేసి ఉన్నట్లయితే, నీ సమక్షంలో దాన్ని ఎలా నిప్పుముందు ఎండుగడ్డిలా దహనం చేయరాదు?'' బాబా "నీకు అలాంటి విశ్వాసం ఉన్నదా?'' అని అడగగా అతడు 'కలదు' అన్నాడు. బాబా అప్పుడు కళ్ళు మూసుకో అన్నారు. అతడు కళ్ళు మూసి తెరిచినంతలో ఏదో క్రిందపడిన పెద్ద చప్పుడయింది. పోలీసువారు రక్తం కారుతూ పడిపోయి ఉన్నారు. తాను బంధవిముక్తుడై ఉన్నాడు. అతడు అత్యంత భయపడి బాబా వైపు చూశాడు. బాబా ఇలా అన్నారు, "ఇప్పుడు నీవు బాగా పట్టుబడ్డావు. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధిస్తారు'' అప్పుడు తాడు ఇలా విన్నవించాడు. "నీవు తప్ప రక్షించే వారెవరూ లేరు. నన్ను ఎలాగయినా కాపాడు'' అప్పుడు బాబా అతన్ని కళ్ళు మూసుకోమన్నారు. వాడు అలాగే చేసి తిరిగి కళ్ళు తెరిచినంతలో, వాడు పంజరం నుండి విడుదలయినట్టు, బాబా ప్రక్కన ఉన్నటు కనిపించింది. అతడు బాబా పాదాలపై పడ్డాడు.

 

 

 


బాబా యిలా అన్నారు : "ఈ నమస్కారాలకి ఇంతకుముందు నమస్కారాలకు ఏమైనా భేదం ఉందా? బాగా ఆలోచించి చెప్పు!'' అతడు ఇలా అన్నాడు : "కావలసినంత భేదం కలదు. ముందటి నమస్కారాలు నీవద్ద పైకం తీసుకోవడానికి చేసినవి. ఈ నమస్కారం నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియూ నేను కోపంతో నీవు మహమ్మదీయుడవై ఉండి హిందువులను పాడుచేయుచుంటివని అనుకునేవాడిని.'' బాబా "నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా?'' అని ప్రశ్నిస్తే అతడు నమ్మను అన్నాడు. అప్పుడు బాబా "నీ యింటిలో పంజా లేదా? నీవు మొహరం అప్పుడు పూజ చేయటం లేదా? మరియు మీ యింటిలో మహమ్మదీయ దేవత అయిన కాడ్బీబీ లేదా? పెళ్లి మొదలైన శుభకార్యాలప్పుడు ఆమెను మీరు శాంతింప చేయటం లేదా?'' అన్నారు. అతడు దీనికంతటికీ ఒప్పుకున్నాడు. అప్పుడు బాబా "నీకింకా ఏమి కావాలి" అని అడిగారు. అతడు తన గురువైన రామదాసును దర్శించాలని కోరిక ఉన్నదని అన్నాడు. వెనుకకు తిరిగి చూడమని బాబా అన్నారు. వెనుకకు తిరగ్గానే అతనికి ఆశ్చర్యం కలిగేలా రామదాసస్వామి తన ముందర ఉన్నారు. వారి పాదాలపై పడగానే, రామదాసు అదృశ్యుడయ్యాడు. జిజ్ఞాసగలవాడై అతడు బాబాతో ఇలా అన్నాడు "మీరు వృద్ధులుగా కనబడుచున్నారు. మీ వయస్సు మీకు తెలుసా?'' బాబా, "నేను ముసలివాడిని అంటున్నావా? నాతో పరుగెత్తి చూడు'' అంటూ పరుగెత్తడం మొదలుపెట్టారు. అతడు కూడా వెంబడించాడు. ఆ ధూళిలో బాబా అదృశ్యమయ్యారు. అతడు నిద్రనుంచి మేల్కొన్నాడు.

 

 

 


మేలుకున్న వెంటనే స్వప్నదర్శనం గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అతని మనోవైఖరి పూర్తిగా మారి, బాబా గొప్పదనమని గ్రహించాడు. అటు తరువాత అతని సంశయవైఖరి పేరాస పూర్తిగా తొలిగిపోయింది, బాబా పాదాలపై అసలయిన భక్తి మనస్సులో ఉద్భవించింది. ఆ దృశ్యం ఒక స్వప్నమే కాని, అందులో ఉన్న ప్రశ్నోత్తరాలు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కోసం గుమిగూడి ఉండగా అతనికి బాబా రెండు రూపాయల విలువగల మిఠాయిని, రెండు రూపాయల నగదు ఇచ్చి ఆశీర్వదించారు. అతనిని మరికొన్ని రోజులు ఉండమని అన్నారు. అతనిని బాబా ఆశీర్వదించి ఇలా అన్నారు "అల్లా నీకు కావలసినంత డబ్బు ఇస్తాడు. నీకు మేలు చేస్తాడు'' అతనికి అక్కడ ఎక్కువ ధనం దొరకలేదు. కాని అన్నిటికంటె మేలైన వస్తువు దొరికింది. అదే బాబా ఆశీర్వాదము. తరువాత ఆ భజన సమాజానికి ఎంతో ధనము లభించింది. వారి యాత్రకూడా జయప్రదంగా సాగింది. వారికి ఎలాంటి కష్టాలు ప్రయాణ మధ్యలో కలుగలేదు. అందరూ క్షేమంగా ఇల్లు చేరారు. వారు బాబా పలుకులు, ఆశీర్వాదాలు, వారి కటాక్షాలతో కలిగిన ఆనందం గురించి మనస్సులో చింతింస్తున్నారు.
తన భక్తులను వృద్ధి చేయటానికి, వారి మనస్సులను మార్చడానికి బాబా అవలంభించిన మార్గంలో ఒకటి చూపడానికి ఈ లీల ఒక ఉదాహరణం. ఇప్పటికి ఇలాంటి మార్గాలను బాబా అవలంభిస్తూ వున్నారు.
2. తేండూల్కర్ కుటుంబము :

 

 

 


బాంద్రాలో తేండూల్కర్ కుటుంబం ఉండేది. ఆ కుటుంబం వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉన్నారు. సావిత్రీబాయి తేండూల్కర్ 'శ్రేసాయినాథ భజనమాల' అనే మరాఠీ గ్రంథాన్ని 800 అభంగములు, పదములతో ప్రచురించారు. దానిలో సాయిలీలలు అన్నీ వర్ణింపబడ్డాయి. బాబాయందు శ్రద్ధాభక్తులు గలవారు దాన్ని తప్పక చదవవలెను. వారి కుమారుడు బాబు తేండూల్కర్ వైద్యపరీక్షకు కూర్చోవాలని రాత్రింబవళ్ళు కస్టపడి చదువుతున్నాడు. అతడు కొందరు జ్యోతిష్కుల సలహా తీసుకున్నారు. వారు అతని జాతకాన్ని చూసి ఈ సంవత్సరం గ్రహాలూ అనుకూలంగా లేవని చెప్పారు. కనుక ఆ మరుసటి సంవత్సరం పరీక్షకు కూర్చోవాలని అలా చేసిన తప్పక ఉత్తీర్ణుడు అవుతాడని చెప్పారు. ఇది విని అతని మనస్సుకు విచారం అశాంతి కలిగాయి. కొన్ని రోజుల తరువాత అతని తల్లి షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకున్నారు. ఆమె బాబాకు అనేక విషయాలతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పింది. ఇది విని బాబా ఆమెతో ఇలా అన్నారు "నాయందు నమ్మకం వుంచి జాతకాలు, వాటి ఫలితాలు, సాముద్రిక శాస్త్రజ్ఞులు పలుకులు ఒక ప్రక్కకు త్రోసి, తన పాఠాలు చదువుకోమని చెప్పు. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమను. అతడు ఈ సంవత్సరం తప్పక ఉత్తీర్ణుడు అవుతాడు. నాయందే నమ్మకం వుంచుకోమను, నిరుత్సాహం చెందవద్దను.'' తల్లి యింటికి వచ్చి బాబా సందేశం కొడుకుకు వినిపించారు.

 

 

 


 అతడు శ్రద్ధగా చదివాడు; పరీక్షకు కూర్చున్నాడు. వ్రాత పరీక్షలో బాగా వ్రాసాడు కాని సంశయంలో మునిగి ఉత్తీర్ణుడు కావడానికి కావలసిన మార్కులు రావనుకున్నాడు. కాబట్టి నోటిపరీక్షకి కూర్చోడానికి ఇష్టపడలేదు. కాని పరీక్షకులు అతని వెంటపడ్డారు. వ్రాతపరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యాడనీ నోటిపరీక్షకు రావాలనీ పరీక్షాధికారి కబురు పెట్టారు. ఇలా ధైర్యవచనం విని అతడు పరీక్షకు కూర్చుని రెండింటిలో ఉత్తీర్ణుడయ్యాడు. గ్రహాలూ వ్యతిరేకంగా ఉన్నా బాబా కటాక్షంతో ఆ సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. సంశయాలు, కస్టాలు మన భక్తిని స్థిరపరచడానికి మనల్ని చుట్టుముడతాయి. మనల్ని పరీక్షిస్తాయి. పూర్తి విశ్వాసంతో బాబాను కొలుస్తూ మన కృషి సాగించినట్లయితే మన ప్రయత్నాలన్నీ చివరకు విజయవంతం అవుతాయి.

 

 

 


ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువై ఉన్నాడు. వృద్యాప్యం వల్ల సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుతూ ఉన్నారు. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు. కాబట్టి సెలవు పొడిగించుకోవాలని అనుకున్నారు; లేదా ఉద్యోగంనుండి విరమించుకోవాలని అనుకున్నారు. కంపెనీ మేనేజరు అతనికి ఫించను ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించాలని నిశ్చయించుకున్నారు. అత్యంత నమ్మకంతో చాలాకాలం తమ వద్ద ఉద్యోగం చేసినవాడు కాబట్టి ఎంత ఫించను ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. అతని వేతనం నేలకు 150 రూపాయలు. ఫించను అందులో సగం 75 రూపాయలు, కుటుంబం ఖర్చులకు సరిపోదు కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతృతగా ఉన్నారు. చివరి నిర్ణయానికి 15 రోజులు ముందు తేండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి, "100 రూపాయల ఫించను ఇచ్చినా బాగుంటుందని అనుకుంటాను. అది నీకు సంతృప్తికరమా?'' అన్నారు. ఆమె ఇలా జవాబిచ్చింది. "బాబా నన్నెందుకు అడుగుతావు? మేము నిన్నే విశ్వసించి ఉన్నాము'' బాబా 100 రూపాయలు అన్నా, అతనికి 10 రూపాయలు అధికంగా అంటే 110 రూపాయలు ఫించను లభించింది. తన భక్తులపై బాబా ఇలాంటి విచిత్రమైన ప్రేమానురాగాలు ప్రదర్శించేవారు.
3. కాప్టెన్ హాటే :

 

 

 


కాప్టెన్ హాటే బికానేరులో ఉండేవారు. అతడు బాబాకు అత్యంత భక్తుడు. ఒకరోజు బాబా అతని స్వప్నంలో కనిపించి "నన్ను మరిచిపోయావా?'' అన్నారు. హాటే వెంటనే బాబా పాదాలు పట్టుకుని "బిడ్డ తల్లిని మరిచిపోతే ఎలా బ్రతుకుతుంది?'' అంటూ తోటలోకి వెళ్ళి తాజా చిక్కుడు కాయలు తెచ్చి స్వయంపాకాన్ని, దక్షిణను బాబాకి అర్పించబోగా, అతడు మేల్కొన్నాడు. ఇది అంతా స్వప్నం అనుకున్నాడు. ఈ వస్తువులన్నిటినీ షిరిడీ సాయిబాబా దగ్గరకి పంపాలని నిశ్చయించుకున్నాడు. కొన్ని రోజుల తరువాత గ్వాలియర్ వెళ్ళాడు. అక్కడనుండి 12 రూపాయలు మనిఆర్డరు ద్వారా బొంబాయిలో ఉన్న తన స్నేహితుడికి పంపి అందులో రెండు రూపాయలతో స్వయంపాకం వస్తువులు చిక్కుడుకాయలు కొని, 10 రూపాయల దక్షిణ సమర్పించాలని రాశాడు. ఆ స్నేహితుడు షిరిడీకి వెళ్ళి కావలసిన సామానులు కొన్నాడు. కాని చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకుని వచ్చింది. అతడు చిక్కుడుకాయలు కొని స్వయంపాకం సిద్ధం చేసి కెప్టెన్ హాటే తరపున దాన్ని బాబాకి అర్పించాడు. బాబా భోజనం చేస్తున్నప్పుడు అన్నం ఇతర పదార్థాలను మాని చిక్కుడుకాయ కూరను తిన్నారు. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషానికి అంతులేకపోయింది.
పవిత్రము చేసిన రూపాయి :

 

 

 


ఇంకొకసారి హాటేకి తన ఇంటిలో బాబా తాకి పవిత్రం చేసిన రూపాయిని ఉంచుకోవాలనే కోరిక కలిగింది. షిరిడీకి వెళ్ళే స్నేహితుడు ఒకడు తటస్థపడగా వాదిద్వారా హాటే రూపాయి పంపించాడు. ఆ స్నేహితుడు షిరిడీకి చేరుకున్నాడు. బాబాకి నమస్కరించిన తరువాత తన గురుదక్షిణ యిచ్చాడు. బాబా దాన్ని జేబులో వేసుకున్నారు. తరువాత హాటే యిచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దానివైపు బాగా చూసి, తన కుడిచేతి బొటన వ్రేలితో పైకి ఎగరేసి ఆడి, ఆ స్నేహితునితో ఇలా అన్నారు "దీన్ని దాని యజమానికి ఊదీ ప్రసాదంతో పాటు యివ్వు. నాకేమి అక్కరలేదని చెప్పు. శాంతంగా, సంతోషంగా ఉండమను'' ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చాడు. హాటేకి బాబా పవిత్రం చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతా చెప్పాడు. ఈసారి హాటే అత్యంత సంతృప్తి చెందాడు. బాబా సద్బుద్ధి కలుగ చేస్తారని గ్రహించాడు. మనఃపూర్వకంగా కోరుకోవటంతో బాబా తన కోరికను యథాప్రకారం నెరవేర్చారని సంతోషించాడు.
4. వామన నార్వేకర్ :

 

 

 


చదివేవారు ఇంకొక కథ విందురుగాక. వామన నార్వేకర్ అనే అతడు బాబాను అమితంగా ప్రేమించేవాడు. ఒకరోజు అతడు ఒక రూపాయి తెచ్చాడు. దానికి ఒక ప్రక్క సీతారామలక్ష్మణులను, ఇంకొక ప్రక్క భక్తాంజనేయుడు ఉన్నారు. అతడు దాన్ని బాబాకి యిచ్చాడు. బాబా దాన్ని తాకి, పవిత్రం చేసి ఊదీ ప్రసాదంతో ఇవ్వాలని అతని కోరిక. కాని బాబా దాన్ని వెంటనే జేబులో వేసుకున్నారు. శ్యామా, నర్వేకర్ ఉద్దేశం తెలుపుతూ దాన్ని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడుకున్నాడు. బాబా ఇలా అన్నారు "దీన్ని ఎందుకు అతనికి ఇవ్వాలి? దీన్ని మనమే ఉంచుకుందాము. అతడు 25 రూపాయలు యిస్తే తిరిగి అతనికి అతనికి ఇద్దాము'' ఆ రూపాయి కొరకు వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందు పెట్టాడు. బాబా ఇలా అన్నారు "ఆ నాణెం విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామా! ఈ రూపాయిని తీసుకో. మన కోశములో దేన్నీ ఉంచుదాము. దీన్ని నీ పూజామందిరంలో పెట్టి పూజించుకో'' బాబా ఎందుకు ఈ మార్గాన్ని అవలంభించారో అడగడానికి ఎవరికీ ధైర్యం చాలలేకపోయింది. ఎవరికేది క్షేమమో బాబకే తెలుసు.

ఇరువది తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం