శ్రీసాయిసచ్చరిత్రము ఇరవై ఏడవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము


ఇరవై ఏడవ అధ్యాయము

 

 

 

 

భాగవతము, విష్ణుసహస్రనామములనిచ్చి అనుగ్రహించుట
1. దీక్షిత్ యొక్క విఠల్ దర్శనము 2. గీతారహస్యము 3. ఖాపర్డే దంపతులు
బాబా మతగ్రంథాలను తమ స్వహస్తాలతో స్పృశించి పవిత్రం చేసి వాటిని తమ భక్తులకు పారాయణం కోసం ప్రసాదించుట మొదలైనవి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము.
మానవుడు సముద్రంలో మునగగానే, అన్ని తీర్థాలలోను, పుణ్యనదులలోనూ స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. అలాగే మానవుడు సద్గురువు పాదారవిందాలను ఆశ్రయించగానే, త్రిమూర్తులకు (బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు) నమస్కరించిన ఫలంతో పాటు పరబ్రహ్మానికి నమస్కరించిన ఫలితం కూడా లభిస్తుంది. కోరికలను నెరవేర్చే కల్పతరువు, జ్ఞానానికి సముద్రాన్ని, మనకు ఆత్మసాక్షాత్కారాన్ని కలుగుచేసేటువంటి శ్రీసాయిమహారాజుకు జయం అగుగాక! ఓ సాయి! నీ కథలలో శ్రద్ధను కలుగజేయుము. చాతకపక్షి మేఘజాలం త్రాగి ఎలా సంతోషిస్తుందో, అలాగే నీ కథలను చదివేవారూ, వినేవారూ అత్యంత ప్రీతితో వాటిని గ్రహింతురుగాక. నీ కథలు వింటున్నప్పుడు వారికి, వారి కుటుంబాలకు సాత్వికభావాలు కలుగుగాక! వారి శరీరాలు చెమరించుగాక! వారి నేత్రాలు కన్నీటితో నిండుగాక! వారి ప్రాణాలు స్థిరపడుగాక! వారి మనస్సులు ఏకాగ్రం అగుగాక! వారికి గగుర్పాటు కలుగుగాక! వారు వెక్కిళ్ళతో ఏడ్చి వణికెదరుగాక! వారిలోగల వైషమ్యాలు తరతమ భేదాలు నిష్క్రమించుగాక! ఇలా జరిగినట్లయితే గురువుగారి కటాక్షం వారిపైన ప్రసరించిందని అనుకోవాలి. ఈ భావాలు నీలో కలిగినప్పుడు, గురువు అత్యంత సంతోషించి ఆత్మ సాక్షాత్కారానికి దారి చూపిస్తాడు. మాయాబంధాలనుండి స్వేచ్ఛ పొందడానికి బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వేడుకోవాలి. వేదాలు నిన్ను మాయ అనే మహాసముద్రాన్ని దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవకోటియందులో భగవంతుని చూసినట్లు చేయగలరు.
గ్రంథములను పవిత్రము చేసి కానుకగా యిచ్చుట :

 

 

 

 


ముందటి అధ్యాయంలో బాబా బోధలు ఒనర్చే తీరులను చూశాము. అందులో ఇంకొక దాన్ని ఈ అధ్యాయంలో చూద్దాము. కొందరు భక్తులు మతగ్రంథాలను పారాయణ చేయడానికి బాబా చేతికిచ్చి బాబా పవిత్రం చేసిన తరువాత వాటిని పుచ్చుకునేవారు. అలాంటి గ్రంథాలు పారాయణ చేసేటప్పుడు బాబా తమతో ఉన్నట్లు భావించేవారు. ఒకరోజు కాకామహాజని ఏకనాథభాగవతాన్ని తీసుకుని షిరిడీకి వచ్చారు. శ్యామా ఆ పుస్తకాన్ని చదవడానికి తీసుకుని మసీదుకు వెళ్ళారు. అక్కడ బాబా దాన్ని తీసుకుని చేతితో తాకి, కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకి ఇచ్చి దాన్ని తన వద్ద ఉంచుకోమన్నారు. అది కాకా పుస్తకం అనీ, అందుకే దాన్ని అతనికి ఇచ్చి వేయాలని శ్యామా చెప్పారు. కాని బాబా "దాన్ని నేను నీకు ఇచ్చాను. దాన్ని జాగ్రత్తగా నీవద్ద ఉంచు. అది నీకు పనికి వస్తుంది'' అన్నారు. ఈ ప్రకారంగా బాబా అనేక పుస్తకాలను శ్యామా దగ్గర ఉంచారు. కొన్ని రోజుల తరువాత కాకామహాజని తిరిగి భాగవతం తెచ్చి బాబాకి ఇచ్చారు. బాబా దాన్ని తాకి ప్రసాదంగా మహాజనికే ఇచ్చి దాన్ని భద్రపరుచు అన్నారు. అది అతనికి మేలు చేస్తుంది అన్నారు. కాకా సాష్టాంగనమస్కారంతో స్వీకరించారు.
శ్యామా విష్ణుసహస్రనామములా పుస్తకం :

 

 

 

 


శ్యామా బాబాకు అత్యంత ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయాలని నిశ్చయించుకుని విష్ణుసహస్రనామాన్ని ప్రసాదంగా యిచ్చారు. దాన్ని ఈ క్రింది విధంగా జరిపారు.
ఒకప్పుడు ఒక రామదాసి (సమర్థ రామదాసు భక్తుడు) షిరిడీకి వచ్చారు. కొన్నాళ్ళు అక్కడ ఉన్నారు. ప్రతిరోజూ ఉదయమే లేచి, ముఖం కడుక్కుని, స్నానం చేసి, పట్టుబట్టలు ధరించి, విభూతి పూసుకుని విష్ణుసహస్రానామాన్ని, ఆధ్యాత్మరామాయణాన్ని శ్రద్ధతో పారాయణ చేస్తుండేవారు. అతడీ గ్రంథాలను అనేకసార్లు పారాయణ చేశారు. కొన్ని రోజుల తరువాత బాబా శ్యామాకు మేలు చేయాలని నిశ్చయించుకుని విష్ణుసహస్రనామ పారాయణం చేయించాలను అనుకున్నారు. కాబట్టి రామదాసిని పిలిచి తమకు కడుపునొప్పిగా ఉన్నదనీ, సోనాముఖి తీసుకోకపోతే నొప్పి తగ్గదనీ, కాబట్టి బజారుకు వెళ్ళి ఆ మందును తీసుకొని రమ్మని కోరారు. పారాయనాను ఆపి రామదాసి బజారుకు వెళ్ళారు. బాబా తన గద్దె దిగి రామదాసి పారాయణ చేసే స్థలానికి వచ్చి విష్ణుసహస్రనామ పుస్తకాన్ని తీసుకుని తమ స్థలానికి తిరిగి వచ్చి ఇలా అన్నారు "ఓ శ్యామా! ఈ గ్రంథము అత్యంత విలువైనది. ఫలమినదే. కాబట్టి నీకు ఇది బహుకరిస్తున్నాను. నీవు దీన్ని చదువు. ఒకప్పుడు నేను అత్యంత బాధ పడ్డాను. నా హృదయం కొట్టుకుంది. నా జీవితం అపాయంలో ఉండింది. అలాంటి సందిగ్థస్థితిలో నేను ఈ పుస్తకాన్ని నా హృదయానికి హత్తుకున్నాను. శ్యామా! అది నాకు గొప్ప మేలు చేసింది. అల్లాయే స్వయంగా వచ్చి బాగు చేశారని అనుకున్నాను. అందుకే దీన్ని నీకు యిస్తున్నాను. దీన్ని కొంచెం ఓపికగా చదువు. రోజుకి ఒక నామం చదివినా మేలు కలుగజేస్తుంది'' శ్యామా తనకా పుస్తకం అక్కరలేదన్నారు. ఆ పుస్తకం రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు. కోపిష్టి. కాబట్టి వాడితో కయ్యం వస్తుంది. మరియు తాను అనాగరికుడు అవటంతో దేవనాగరి అక్షరాలు చదవలేను అన్నాడు.

 

 

 

 


వినోదార్థం తనకు రామదాసితో బాబా కయ్యం కలుగజేస్తున్నాడని శ్యామా అనుకున్నాడే గానీ, బాబా తనకు మేలు కలుగజేస్తున్నాడని అనుకోలేదు. బాబా ఆ సహస్రనామం అనే మాలను శ్యామా మేడలో వేయాలని నిశ్చయించుకున్నారు. అతడు అనాగరికుడు అయినప్పటికీ బాబాకు ముఖ్యభక్తుడు. బాబా ఈ ప్రకారం అతనిని ప్రపంచ బాధలనుండి తప్పించాలని కోరుకున్నారు. భగవన్నామ ఫలితం అందరికీ విశదమే. సకల పాపాల నుండి దురాలోచనల నుండి, చావుపుట్టుకల నుండి అది మనల్ని తప్పిస్తుంది. దీనికంటే సులభమయిన సాధనం ఇంకొకటి లేదు. అది మనస్సును పావనం చేయటంలో అత్యంత సమర్థమైనది. దానికి ఎలాంటి తంతు కూడా అవసరం లేదు. దానికి నిమయాలు ఏవీ లేవు. అది అత్యంత సులభమైనది; ఫలప్రదమైనది. శ్యామాకు ఇష్టం లేనప్పటికీ వారితో దాన్ని అభ్యసింప చేయాలని బాబాకు దయ కలిగింది. కాబట్టి దాన్ని బాబా అతడిపై బలవంతంగా రుద్దారు. ఆ ప్రకారంగానే చాలా కాలం క్రిందట ఏకనాథమహారాజు బలవంతంగా విష్ణుసహస్రానామాన్ని ఒక బీదబ్రాహ్మణుడితో పారాయణ చేయించి వాణ్ణి రక్షించారు. విష్ణుసహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమయిన చక్కటి మార్గం. కాబట్టి దాన్ని బాబా శ్యామాకు బలవంతంగా ఇచ్చారు.

 

 

 

 


రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చారు. అన్నా చించణీకర్ అక్కడే ఉన్నాడు. నారదుడిలా నటించి జరిగినదంతా అతనికి చెప్పాడు. రామదాసి వెంటనే కోపంతో మండిపడ్డాడు. కోపంతో శ్యామాపై పడి, శ్యామాయే కడుపునొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపేలా చేసి ఈ లూపల పుస్తకం తీసుకున్నాడు అన్నాడు. శ్యామాను తిట్టడం ఆరంభించాడు. పుస్తకం ఇవ్వకపోతే తల పగలగొట్టుకుంటానని అన్నాడు. శ్యామా నెమ్మదిగా జవాబిచ్చారు. కాని ప్రయోజనం లేకపోయింది. అప్పుడు దయతో బాబా రామదాసితో ఇలా పలికారు "ఓ రామదాసీ! ఏమి సమాచారం? ఎందుకు చికాకు పడుతున్నావు? శ్యామా మనవాడు కాదా? అనవసరంగా వాడిని ఎలా తిడతావు? ఎందుకు జగడం ఆడుతున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాటాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథాలను నిత్యం పారాయణ చేస్తున్నావు కానీ, ఇంకా నీ మనస్సు అపవిత్రంగాను, అస్వాదీనంగానూ ఉన్నట్టుంది. నీవు ఎలాంటి రామదాసివయ్యా? సమస్త విషయాలలో నీవు నిర్మలుడిగా ఉండ వలెను. నీవు ఆ పుస్తకాన్ని అంతగా అభిలశించుట వింతగా ఉన్నది. నిజమైన రామదాసికి మమత కాక సమయ ఉండవలెను. ఒక పుస్తకం కోసం శ్యామాతో పోరాడుతున్నావా? వెళ్ళు, నీ స్థలంలో కూర్చో. ధనం ఇస్తేపుస్తకాలు అనేకం వస్తాయి. కాని మనుష్యులు రారు. బాగా ఆలోచించుకో. తెలివిగా ప్రవర్తించు. నీ పుస్తకం విలువ ఎంత? శ్యామాకు దానితో ఎలాంటి సంబంధం లేదు. నేనే దాన్ని తీసుకొని అతనికి ఇచ్చాను. నీకది కంఠంపాఠంగా వచ్చు కదా! కాబట్టి శ్యామా దాన్ని చదివి మేలు పొందుతాడు అనుకున్నాను. అందుకే దాన్ని అతనికి ఇచ్చాను''

 

 

 

 


బాబా పలుకులు ఎంత మధురంగా, మెత్తగా, కోమలంగా, అమృతతుల్యంగా ఉన్నాయి! వాటి ప్రభావం విచిత్రమైంది. రామదాసి శాంతించాడు. దానికి బదులు పంచరత్నగీత అనే గ్రంథాన్ని శ్యామా దగ్గర తీసుకుంటాను అన్నారు. శ్యామా అమితంగా సంతోషించి, "ఒక్కటే ఎందుకు పది పుస్తకాలు ఇస్తాను'' అన్నాడు.
బాబా ఈ విధంగా వారి తగువును తీర్చారు. ఇందులో ఆలోచించవలసిన విషయం ఏమిటంటే రామదాసి పంచరత్నగీత ఎలా కోరాడు? అతడిలో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించి ఉండలేదు. ప్రతినిత్యం మతగ్రంథాలను మసీదులో బాబా ముందు పారాయణ చేసేవాడు. శ్యామాతో బాబా ఎదుట ఎలా జగడం ఆడాడు? మనం ఎవరిని నిందించాలో, ఎవరిని తప్పుపట్టాలో పోల్చుకోలేము.

 

 

 

 

ఈ కథ ఈ విధంగా నడిపించక పోయినట్లయితే ఈ విషయం యొక్క ప్రాముఖ్యం భగవన్నామ స్మరణ ఫలితం, విష్ణుసహస్రనామ పారాయణ మొదలైనవి శ్యామాకు తెలిసి ఉండవు. బాబ బోధించే మార్గం, ప్రాముఖ్యం కలగజేసే విషయాలు సాటిలేనివి. ఈ గ్రంథాన్ని క్రమంగా శ్యామా చదివి దానిలో గొప్ప ప్రావీణ్యం సంపాదించారు. శ్రీమాన్ బూటీ అల్లుడైన జి.జి. నార్కేకు బోధించగలిగారు. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉండేవాడు.
గీతా రహస్యం :

 

 

 

 


బ్రహ్మవిద్య అధ్యాయం చేసేవారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించేవారు, ప్రోత్సహించేవారు. ఇక్కడ దానికి ఒక ఉదాహరణ ఇస్తాము. ఒకరోజు బాపూ సాహెబు జోగకు ఒక పార్సిల్ వచ్చింది. అందులో తిలక్ రాసిన గీతా రహస్యం ఉండింది. అతడు ఆ పార్సిల్ ను తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చాడు. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు అది క్రిందపడింది. అదేమిటి అని బాబా అడిగారు. అక్కడే దాన్ని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకాన్ని ఉంచాడు. బాబా కొన్ని నిముషాలు పుస్తకంలోని పేజీలను త్రిప్పి తన జేబులో నుండి ఒక రూపాయి తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో సహా పుస్తకాన్ని జోగుకి అందిస్తూ, "దీన్ని పూర్తిగా చదువు. నీకు మేలు కలుగుతుంది'' అన్నారు.
ఖాపర్డే దంపతులు :

 

 

 

 


ఖాపర్డేల వృత్తాంతంతో ఈ అధ్యాయాన్ని ముగిస్తాము. ఒకప్పుడు ఖపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలు ఉన్నారు. దాదాసాహెబు ఖాపర్డే సామాన్యుడు కాదు. అమరావతిలో అత్యంత ప్రసిద్ధికెక్కిన ప్లీడరు, అత్యంత ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిల్ లో సభ్యుడు, అమిత తెలివైనవాడు, గొప్ప వక్త. కాని బాబా ముందు ఎప్పుడూ నోరు తెరవలేదు. అనేకమంది భక్తులు పలుమార్లు బాబాతో మాట్లాడారు, వాదించారు; కాని ముగ్గురు మాత్రం - ఖాపర్డే, నూల్కర్, బూటీ - నిశ్శబ్దంగా కూర్చునేవారు. వారు వినయవిధేయత నమ్రతలు ఉన్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన ఖాపర్డే బాబా ముందు మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడేవాడు కాదు. నిజంగా మానవుడు ఎంత చదివినవాడైనా, వేదపారాయణ చేసినవాడైనా, బ్రహ్మజ్ఞాని ముందు వెలవెలబోతారు. పుస్తకజ్ఞానం బ్రహ్మజ్ఞానం ముందు రాణించదు. దాదాసాహెబు ఖాపర్డే 4 మాసాలు ఉన్నాడు. కాని అతని భార్య 7 మాసాలు ఉంది. ఇద్దరూ షిరిడీలో ఉండటంతో సంతోషించారు.

 

 

 

 

ఖాపర్డేగారి భార్య బాబాముందు భక్తిశ్రద్ధలు కలిగి ఉండేది. ఆమె బాబాను అమితంగా ప్రేమిస్తూ ఉండేది. ప్రతిరోజూ 12 గంటలకు బాబా కొరకు నైవేద్యం స్వయంగా తెస్తుండేది. దాన్ని బాబా ఆమోదించిన తరువాత తాను భోజనం చేస్తుండేది. ఆమె యొక్క నిలకడను, నిశ్చలభక్తిని బాబా యితరులకు బోధించాలని అనుకున్నారు. ఆమె ఒకరోజు మధ్యాహ్న భోజన సమయంలో ఒక పళ్ళెంలో సంజా, పూరీ, అన్నము, పులుసు, పరమాన్నం మొదలైనవి మసీదుకు తెచ్చింది. గంటల కొలది ఊరకనే ఉండే బాబా ఆనాడు వెంటనే లేచి, భోజన స్థలంలో కూర్చుని, ఆమె తెచ్చిన పళ్ళెంపైన ఆకు తీసి త్వరగా తినటం ఆరంభించారు. శ్యామా ఇలా అడిగారు "ఎందుకీ పక్షపాతం? ఇతరుల పళ్ళాన్ని నెట్టివేస్తావు. వాటివైపు చూడను కూడా చూడవు, దీన్ని నీ దగ్గరకి ఈడ్చుకుని తింటున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరం? ఇది మాకు సమస్యగా ఉంది'' బాబా ఇలా బోధించారు "ఈ భోజనం యథార్థంగా అమూల్యమైనది. గతజన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు. అది బాగా పాలిస్తూ ఉండేది. అక్కడినుండి నిష్క్రమించి, ఒక తోటమాలి ఇంటిలో జన్మించింది. తరువాత ఒక క్షత్రియుని ఇంటిలో ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడింది. తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించింది.. చాలాకాలం తరువాత ఆమెను నేను చూశాను. కాబట్టి ఆమె పళ్ళెంనుండి ఇంకా కొన్ని ప్రేమమయమైన ముద్దలను తీసుకోనివ్వండి'' ఇలా అంటూ బాబా ఆమె పళ్ళెం ఖాళీ చేసారు. నోరు చేతులు కడుక్కుని త్రేన్పులు తీస్తూ తిరిగి తన గద్దెపై కూర్చున్నారు. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించింది. బాబా కాళ్ళను పిసుకుతూ ఉంది. బాబా ఆమెతో మాట్లాడటం ప్రారంభించారు.

 

 

 

 

బాబా కాళ్ళను తోముతున్న ఆమె చేతులను బాబా తోమటం ప్రారంభించారు. గురుశిష్యులు ఇద్దరూ సేవచేసుకోవటం చూసి శ్యామా ఇలా అన్నాడు "చాలా బాగా జరుగుతుంది. భగవంతుడూ, భక్తురాలూ ఒకరికొకరు సేవ చేసుకోవటం అత్యంత వింతగా ఉన్నది'' ఆమె యథార్థమైన ప్రేమకు సంతోషించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించే కంఠంతో 'రాజారామ్' అనే మంత్రాన్ని ఎల్లప్పుడూ జపించమంటూ ఇలా అన్నారు. "నీవు ఇలా చేసినచో నీ జీవితాశయాన్ని పొందుతావు. నీ మనస్సు శాంతిస్తుంది. నీకు మేలు కలుగుతుంది. "ఆధ్యాత్మికము తెలియనివారికి ఇది సామాన్య విషయంలా కనిపిస్తుంది. కాని అది అలా కాదు. అది శక్తిపాతం; అంతే గురువు శిష్యునకు శక్తి ప్రసాదించటం. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి! ఎంత ఫలవంతమైనవి! ఒక్క క్షణంలో అవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడ్డాయి. ఈ విషయం గురువుకు, శిష్యుడికి గల సంబంధాన్ని బోధిస్తుంది. ఇద్దరూ పరస్పరం ప్రేమించి సేవ చేసుకోవాలి. వారిద్దరికి మధ్య భేదం లేదు. ఇద్దరూ ఒకటే. ఒకరు లేనిదే మరి ఒకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదాలమీద పెట్టడం బాహ్యదృశ్యమేగానీ, యథార్థంగా వారు ఇరువురూ లోపల ఒక్కటే. వారి మధ్య భేదము పాటించేవారు పక్వానికి రానివారు; సంపూర్ణజ్ఞానం లేనివారు.

 

ఇరువది ఏడవ అధ్యాయం సంపూర్ణం