Read more!

శ్రీసాయిసచ్చరిత్రము ఇరవై ఆరవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము


ఇరవై ఆరవ అధ్యాయము

 

 

 

 

1. భక్త పంతు 2. హరిశ్చంద్ర పితలే 3. గోపాల అంబాడేకర్ ల అనుభవాలు
ఈ విశ్వమునందు కనిపించే ప్రతివస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టించబడింది. ఈ వస్తువులు నిజంగా వుండివుండలేదు. నిజంగా ఉండేది ఒక్కటే. అదే భగవంతుడు. చీకటిలో తాడునుగాని, దండమును కాని చూచి పాము అనుకున్నట్లు, ప్రపంచంలో కన్పించే వస్తువు బాహ్యానికి కనిపించేలా కనిపిస్తుంది. గాని అంతర్గతంగా నున్న సత్యం తెలుసుకోలేము. సద్గురువే మన బుద్ది అనే అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూసేటట్లు చేస్తాడు. మనకు అగుపడినది నిజస్వరూపం కాదని గ్రహిస్తాము. కాబట్టి సద్గురువు అసలయిన దృష్టిని కలుగ చేయమని ప్రార్థింతుముగాక! అదే సత్యదృష్టి.
ఆంతరిక పూజ :

 

 

 

 


హేమాడ్ పంతు మనకొక కొత్తరకం పూజావిధానాన్ని బోధించుచున్నారు. సద్గురువు పాదాలు కడగటానికి ఆనందభాష్పాలు అనే వేడినీళ్ళను ఉపయోగించేదము గాక! స్వచ్చమైన పరమ అనే చందనాన్ని వారి శరీరానికి పూసెదము గాక! దృఢవిశ్వాసం అనే వస్త్రంతో వారి శరీరాన్ని కప్పెదము గాక! అష్టసాత్త్విక భావాలు అనే ఎనిమిది తామరపుష్పాలు సమర్పించెదము గాక! ఏకాగ్రచిత్తంతో ఫలాన్ని సమర్పించెదము గాక. భావం అనే బుక్కా వారి శరీరముపై జల్లి భక్తి అనే మొలత్రాడును కట్టేదము గాక, మన శిరస్సును వారి బొటన వ్రేళ్ళపై ఉంచెదము గాక. సద్గురువుని ఈ ప్రకారంగా నగలతో అలంకరించి మన సర్వస్వాన్ని వారికి సమర్పింతుము గాక. అలాంటి ఆనందకరమైన పూజ చేసిన తరువాత ఇలా ప్రార్థించెదము గాక!
"మా మనస్సును అంతర్ముఖము చేయుము. దాన్ని లోపలివైపు వెళ్ళునట్లు చేయుము. నిత్యానిత్యాలకు గల తారతమ్యాన్ని తెలిసికొను శక్తి దయచేయుము. "మా మనస్సును అంతర్ముఖం చేయుము. దాన్ని లోపలివైపు వెళ్ళేటట్లు చ్జేయుము. నిత్యానిత్యాలకు గల తారతమ్యాన్ని తెలిసికునే శక్తి దయచేయుము. పపంచ వస్తువులలో మాకు ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారం కలిగేలా చేయుము. మేము మా శరీరాన్ని, ప్రాణాన్ని సర్వాన్ని నీకు సమర్పించెదము. సుఖదుఃఖాల అనుభవాలు కలుగకుండా ఉండేలా మా నేత్రాలు నీవిగా చేయుము. మా శరీరాన్ని, మనస్సును నీ స్వాధీనంలో ఉంచుకో, నీ యిష్టం వచ్చినట్టు చేయుము. మా చంచల మనస్సు నీ పాదాల చెంత విశ్రాంతి పొందుగాక'' ఇక ఈ అధ్యామలోని కథలవైపు మరలుదాము.
భక్త పంతు :

 

 

 

 


ఒకనాడు పంతు అనే భక్తుడు, మరొక సద్గురువు శిష్యుడు అదృష్టవశాత్తు షిరిడీకి వచ్చారు. అతనికి షిరిడీకి వెళ్ళే ఇచ్చ లేకపోయింది. కాని తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అంటారు. అతడు బి.బి.అండ్ సి.ఇ. రైల్వేలో వెళ్తున్నాడు. అందులో అనేకమంది స్నేహితులు, బంధువులు కలిశారు. వారదరూ షిరిడీకి పోవుచున్నారు. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేక పోయాడు. వారు బొంబాయిలో దిగారు. పంతు విరార్ లో దిగారు. అక్కడ తన గురువును దర్శించి, షిరిడీకి వెళ్ళటానికి అనుమతి పొంది, ఖర్చుల నిమిత్తం డబ్బును సమకూర్చుకుని అందరితో కలిసి షిరిడీకి వచ్చారు. అందరూ ఉదయమే షిరిడీకి చేరి 11 గంటలకు మసీదుకు వెళ్ళారు. బాబా పూజ కోసం చేరిన భక్తుల గుంపును చూసి అందరూ సంతోషించారు. కాని పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రిందపడిపోయాడు. వారందరూ భయపడ్డారు. అతనికి చైతన్యం కలిగించడానికి ప్రయత్నించారు. అతని ముఖంపై నీళ్ళు చల్లగా బాబా కటాక్షంతో తెలివి వచ్చింది. నిద్రనుంచి లేచిన వాడిలా లేచి కూర్చున్నాడు. సర్వజ్ఞుడు అయిన బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి, నిర్భయంగా ఉండమని ధైర్యం చెపుతూ తన గురువులోనే భక్తి నిలిచేలా ఈ క్రింది విధంగా పలికారు "ఏమైనను కానివ్వండి. పట్టు విడువరాదు. నీ గురువులోనే ఆశ్రయం నిలుపుకో. ఎల్లప్పుడూ నిలకడగా ఉండుము. ఎప్పుడు వారి ధ్యానంలోనే మునిగి ఉండుము.'' పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యాన్ని గ్రహించారు. ఈ విధంగా తన సద్గురువుని జ్ఞాపకం తెచ్చుకున్నారు. అతను తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరువలేదు.
హరిశ్చంద్ర పితలే :

 

 

 

 


బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అనే అతను ఉన్నాడు. అతనికి మూర్ఛ రోగంతో బాధపడుతున్న కొడుకు ఒకడు ఉన్నాడు. ఇంగ్లీసు మందులను ఆయుర్వేదం మందులను కూడా వాడారు కాని జబ్బు కుదరలేదు. కాబట్టి యోగుల పాదాలపై పడటం ఒక్కటే సాధన మిగిలింది. 15వ అధ్యాయంలో చక్కని కీర్తలనతో దాసగణు బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేశారని తెలుసుకున్నాము. 1910లో పితలే అలాంటి కథలు కొన్నిటిని విన్నాడు. వారినుండి, యితరులు చెప్పినదాని నుండి, బాబా తన దృష్టిచేత, స్పర్శ చేత, బాగు అవని జబ్బులను బాగు చేస్తారని గ్రహించారు. సాయిబాబాను చూడటానికి మనస్సులో కోరిక పుట్టింది. సర్వవిధాలా సంనాహమై, బహుమానాలను వెంట తీసుకుని పండ్ల బుట్టలను పట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చారు. అతడు మసీదుకు వెళ్ళారు. బాబాకు సాష్టాంగ నమస్కారం చేశారు. తన రోగి కొడుకును బాబా పాదాలపై వేశారు. బాబా ఆ బిద్దవైపు చూడగానే ఒక వింత జరిగింది. పిల్లవాడు వెంటనే కళ్ళు గిర్రున తిప్పి చైతన్యం తప్పి నేలపై పడ్డాడు. అతని నోట చొంగ కారింది. అతని శరీరం చెమట పట్టింది. అతను చచ్చినవాడిలా పడ్డాడు. దీన్ని చూసి తల్లిదండ్రులు అత్యంత బాధపడ్డారు. అటువంటి మూర్ఛలు వచ్చేవి కానీ ఈ మూర్ఛ చాలాసేపటివరకూ ఉంది. తల్లి కంటినీరు వరదలుగా కారుచున్నాయి. ఆమె ఏడవటం మొదలుపెట్టింది. ఆమె స్థితి దొంగలనుండి తప్పించుకోవాలనే ఒక గృహంలోకి పరుగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు, పులికి భయపడి పారిపోయి కసాయివాడి చేతిలో పడిన ఆవులా, ఎండచే బాధపడి చెట్టు నీడకు  వెళ్లగా అది బతసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయానికి వెళ్లగా అది వానిపై కూలినట్లు ఉంది.

 

 

 

 


ఆమె ఇలా ఎదుస్తుండగా బాబా ఆమెని ఇలా ఓదార్చారు "ఇలా ఏడవకూడదు. కొంతసేపు ఆగుము. ఓపికతో ఉండుము. కుర్రవాణ్ణి బసకు తీసుకొని వెళ్ళుము. అరగంటలో వాడికి చైతన్యం వస్తుంది.'' బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చారు. బాబా మాటలు యథార్థం అయ్యాయి. వాడాలోనికి తీసుకొని వెళ్ళగానే కుర్రవాడికి చైతన్యం వచ్చింది. పితలే కుటుంబమంతా సంతోషించారు. వారి సంశయాలు అన్నీ తీరాయి. పితలే బాబా దర్శనం కోసం భార్యతో మసీదుకు వచ్చారు. వారు బాబా పాదాలకు వినయంతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదాలను ఒత్తుతూ కూర్చున్నారు. మనస్సులో బాబా చేసిన ఉపకారానికి నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో ఇలా అన్నారు. "నీ ఆలోచనలు, సంశయాలు, భయోత్పాతాలు, ఇప్పుడు చల్లబడ్డాయా? ఎవరికైతే నమ్మకం, ఓపిక ఉంటుందో, వారిని తప్పక భగవంతుడు రక్షిస్తాడు'' పితలే ధనికుడు, మరియాద కలవాడు. అతడు అందరికీ మిఠాయి పంచిపెట్టారు. బాబాకు చక్కని పళ్ళను తాంబూలము ఇచ్చారు. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రమభాక్తులతో నిండియుండెను. ఆమె స్తంభానికి దగ్గరగా కూర్చుని బాబావైపు దృష్టి నిలిపి కళ్ళనుండి ఆనందభాష్పాలు రాలుస్తూ ఉండింది. ఆమె స్నేహ పరమ భావాలను చూసి బాబా అత్యంత సంతుష్టి చెందారు. దేవునిలా యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడతారు. ఏ భక్తుడు హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగాను పూజించి శరణు వేడుకుంటాడో వాడికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్దిరోజులు బాబా వద్ద సుఖంగా ఉన్న తరువాత ఇంటికి వెళ్లాలని నిశ్చయించి, బాబా దర్శనం కోసం మసీదుకు వచ్చారు. బాబా వారికి ఊదీ ప్రసాదం యిచ్చి ఆశీర్వదించారు. పితలేను దగ్గరగా పిలిచి ఇలా అన్నారు "బాపూ! అంతకుముందు 2 రూపాయలు ఇచ్చి వున్నాను. ఇప్పుడు 3 రూపాయలు ఇస్తున్నాను. వీటిని పూజామదిరంలో పెట్టుకుని పూజించు. నీవు మేలు పొందెదవు' పితలే వాటిని ప్రసాదంగా అంగీకరించారు. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వచనాల కోసం ప్రార్థించారు. ఇదే తాను షిరిడీ వెళ్లటం మొదటిసాగి కనుక, అంతకుముందు 2 రూపాయలు ఇచ్చానని బాబా మాటలకు అర్థాన్ని గ్రహింపలేకపోయాడు. దీన్ని తెలిసికోవాలనే కుతూహల పడ్డాడు కానీ బాబా ఊరుకున్నారు.

 

 

 

 


స్వగృహానికి వెళ్ళి తన ముసలి తల్లికి ఈ వృత్తాతం అంతా చెప్పి బాబా అంతకు ముందు రెండు రూపాయలు ఇచ్చానన్నారు. అదేమీ అని అడిగాడు. ఆమె తన పుత్రునితో ఇలా చెప్పింది "నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి వెళ్ళినట్లు, మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్ కోట్ కర్ మహారాజుగారి వద్దకు వెళ్ళారు. ఆ మహారాజు కూడ సిద్ధపురుషుడు; పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కాబట్టి ఆయన పూజను స్వామి ఆమోదించారు. వారు మీ తండ్రికి రెండు రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజించమన్నారు. మీ తండ్రిగారు చనిపోయేవరకు వాటిని పూజిన్స్తూ ఉండేవారు. అటు తరువాత పూజ ఆగిపోయింది. రూపాయలు పోయాయి. కొన్ని సంవత్సరాల తరువాత రూపాయల సంగతి పూర్తిగా మరచిపోయాము. నీవు అదృష్టవంతుడివి అవటంవల్ల, అక్కల్ కోట్ కర్ మహారాజు శ్రీ సాయిరూపంలో కనిపించి నీ కర్తవ్యాన్ని జ్ఞాపకానికి తెచ్చి, నీ కష్టాలను తప్పించాలని చూస్తున్నారు. కాబట్టి ఇకమీదట జాగ్రత్తగా ఉండు. సంశయాలను, దురాలోచనలను విడిచిపెట్టు. మీ తాతముత్తాతల ఆచారం ప్రకారం నడుచుకో. సత్ప్రవర్తనను అవలంబించు. కుటుంబ దైవాలను పూజించు. రూపాయలను పూజించుము. వాటి విలువను గ్రహించి, వాటిని శ్రద్ధగా పూజించి, మహాత్ముల ఆశీర్వచనం దొరికినందుకు గర్వించు. శ్రీ సాయి నీలో ఉన్న భక్తిని మేలుకొల్పారు నీ మేలు కోసం దాన్ని అభివృద్ధి చేసుకో'' తల్లి మాటలు విని పితలే అత్యంత సంతోషించారు. శ్రీ సాయి యొక్క సర్వంతర్యాత్వంలోను, వారి శక్తియందు అతనికి నమ్మకం కలిగింది. వారి దర్శన ప్రాముఖ్యాన్ని గ్రహించాడు. అప్పటినుండి తన నడవడి గురించి చాలా జాగ్రత్తగా ఉన్నాడు.
అంబాడేకర్ గారు :

 

 

 

 


పూనావాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు అబ్కారీ డిపార్టుమెంటులో 10 సంవత్సరాలు నౌకిరీ చేశాడు. ఠాణా జిల్లాలోను, జవ్హార్ స్టేట్ లోను ఆయన ఉద్యోగాలు చేసి విరమించుకున్నారు. మరొక ఉద్యగం కోసం ప్రయత్నించారు. కాని ఫలించలేదు. అతడు అనేక కష్టాలపాలయ్యాడు. అతని స్థితి రానురాను అసంతృప్తికరంగా ఉండింది. ఈ ప్రకారం 7ఏళ్ళు గడిచాయి. అతడు ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్తూ బాబాకు తన కస్టాలు చెప్పుతూ ఉండేవాడు. 1916లో అతని స్థితి చాలా హీనంగా ఉండటంతో షిరిడీలో ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకున్నారు. దీక్షిత్ వాడాకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చుని ఒకరోజు రాత్రి దగ్గరున్న నూతిలో పడి చావాలని నిశ్చయించుకున్నారు. అతడు ఈ ప్రకారం చేయాలని నిశ్చయించుకోగానే బాబా మరి ఒకటి చేయాలని నిశ్చయించుకున్నారు. కొన్ని అడుగుల దూరంలో ఒక హోటలుడేది. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ ని పిలిచి అక్కల్ కోట్ కర్ మహారాజుగారి చరిత్రను చదివావా? అని అడుగుతూ పుస్తకాన్ని యిచ్చారు. అంబాడేకర్ దాన్ని తీసుకొని చదవాలని అనుకున్నాడు. పుస్తకం తెలిచేసరికి ఈ కథ వచ్చింది. అక్కల్ కోట్ కర్ మహారాజుగారి కాలంలో ఒక భక్తుడు బాగుపడని దీర్ఘరోగంతో బాధపడుతున్నాడు. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దూకాడు. వెంటనే మహారాజు వచ్చి వాణ్ణి బావిలోనుంచి బయటకు తీసి ఎలా అన్నారు "గతజన్మ పాపపుణ్యాలను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభావం పూర్తికాకపోతే ప్రాణత్యాగం నీకు తోడ్పడదు. నీవింకొక జన్మమెత్తి బాధ అనుభవించాలి. చావటానికి ముందు కొంతకాలం ఎందుకు నీ కర్మను అనుభవించరాదు? గత జన్మంలో పాపాలను ఎందుకు తుడిచి వేయరాదు? దాన్ని శాశ్వతంగా పోయేట్లు చేయుము''

 

 

 

 


సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ అత్యంత ఆశ్చర్యపడ్డాడు. వారి మనస్సు కరిగింది. బాబా సలహా ఈ ప్రకారంగా లభించనట్లయితే వాడు చచ్చిపోయి ఉండేవాడు. బాబా సర్వజ్ఞత్వం, దయాళుత్వం చూసి అంబాడేకర్ కు బాబా పట్ల నమ్మకం బలపడి అతని భక్తి ధృఢమయ్యింది. అతని తండ్రి అక్కల్ కోట్ కర్ మహారాజు భక్తుడు. కాబట్టి కొడుకు కూడా తండ్రిలా భక్తుడు కావాలని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనం పొందాడు. వాని శ్రేయస్సు వృద్ధి పొందింది. జ్యోతిష్యం చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకున్నాడు. కావలసినంత ధనాన్ని సంపాదించుకోగలిగాడు. మిగతా జీవితమంతా సుఖంగా గడిపాడు.

ఇరువది ఆరవ అధ్యాయం సంపూర్ణం