శ్రీసాయిసచ్చరిత్రము ఇరవై నాలుగవ అధ్యాయము
శ్రీసాయిసచ్చరిత్రము
ఇరవై నాలుగవ అధ్యాయము
బాబా హాస్యము, చమత్కారము, శనగల లీల
1. హేమాడ్ పంతు 2. సుదామ 3. అన్నా చించణీకర 4.మావిశీ బాయి - అనుభవములు
ఈ అధ్యాయంలోగాని, వచ్చే అధ్యాయంలోగాని ఫలానాది చెపుతాము అనటం ఒక విధంగా ఆహాంకారమే. మన సద్గురువు పాదాలకు అహంకారాన్ని సమర్పించిగాని, మన ప్రయత్నలో జయం పొందము. మనం అహంకార రహితులమైతే, మన జయం నిశ్చయం.
సాయిబాబాను పూజించటంతో ఇహపర సౌఖ్యాలు రెండింటినీ పొందవచ్చు. మన మూల ప్రకృతిలో పాతుకొని, శాంతి సౌఖ్యాలను పొందుతాము. కాబట్టి ఎవరయితే తమ క్షేమాన్ని కోరుకుంటారో వారు గౌరవ ఆదరాలతో సాయిబాబా లీలలను వినాలి. మననం చేసుకోవాలి. దీన్ని నెరవేరిస్తే వారు సులభంగా జీవితపరమావధిని పొందగలరు. చివరకి మోక్షానందం పొందుతారు.
సాధారణంగా అందరూ హాస్యం, చమత్కార భాషణలు ఇష్టపడతారు గాని, తాము హాస్యాస్పదం కావడానికి ఇష్టపడరు. కాని బాబా చమత్కార మార్గం వేరు. అది అభినయంతో కూడుకున్నప్పుడు చాలా సంతోషదాయకంగా నీతిదాయకంగా ఉండేది. కాబట్టి ప్రజలు తాము వెక్కిరింతల పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు. హేమాడ్ పంతు తన విషయాన్ని ఈ క్రింద తెలుపుతున్నారు.
శనగల కథ :
షిరిడీలో ఆదివారం రోజు సంత జరిగేది. చుట్టుపక్కల పల్లెలనుండి ప్రజలు వచ్చి వీథులలో దుకార్నాలు వేసికొని వారి సరుకులు అమ్ముకుంటూ ఉండేవారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు మసీదుకు నిండుకునేది. ముఖ్యంగా ఆదివారంరోజు కిక్కిరిసి పోతూ ఉండేది. ఒక ఆదివారం రోజు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చుని బాబా పదాలు ఒత్తుతూ మనస్సులో జపం చేస్తూ ఉన్నారు. బాబా ఎడమవైపు శ్యామా, కుడివైపు వామనరావు ఉన్నారు. శ్రీమాన్ బూటీ, కాకా సాహెబు దీక్షిత్ మొదలైనవారు కూడా ఉన్నారు. శ్యామా నవ్వుతూ అన్నా సాహెబుతో, "నీ కోటుకి శనగగింజలు అంటుకున్నట్టున్నాయి చూడు'' అన్నారు. అలా అంటూ హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగగింజలు నేలరాలాయి. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమచేతి ముందుభాగాన్ని చాచారు. అందరికీ ఆశ్చయం కలిగేలా కొన్ని శనగగింజలు క్రిందకి దొర్లటం ప్రారంభించాయి. అక్కడున్నవారు వాటిని ఏరుకున్నారు.
ఈ సంఘటన హాస్యానికి తావిచ్చింది. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కాచేతిలో ఎలా ప్రవేశించి ఉంటాయో ఊహించటం ప్రారంభించారు. శనగలు చొక్కాలో ఎలా దూరి అక్కగా నిలవగలిగాయో హేమాడ్ పంతు కూడా గ్రహించలేకపోయారు. ఎవ్వరికి సరైన సమాధానం తోచకజవాబు ఇవ్వనప్పుడు అందరూ ఈ అద్భుతానికి ఆశ్చర్యపడుతుండగా బాబా, "వీనికి (అన్నా సాహెబుకు) తానొక్కడే తినే దుర్గుణం ఒకటి ఉంది. ఈనాడు సంతరోజు శనగలు తింటూ ఇక్కడకి వచ్చాడు. వాని నైజం నాకు తెలుసు. ఈ శనగలే దానికి నిదర్శనం. ఈ విషయంలో ఏం ఆశ్చర్యముంది?'' అన్నారు.
హేమాడ్ పంతు : బాబా నేనెప్పుడూ ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గానం నాపై ఎలా మోపుతారు? ఈనాటికి ఎన్నడూ షిరిడీలోని సంత నేను చూసి ఉండలేదు. ఈ రోజు కూడా నేను సంతకు పోలేదు. అలా అయితే నేను శనగలు ఎలా కొని ఉంటాను? నేను కొననప్పుడు నేను ఎలా తినివుంటాను. నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేను ఎప్పుడూ ఏమీ తిని ఎరుగను.
బాబా : అవును అది నిజమే. దగ్గరున్న వారికి ఇస్తావు. ఎవరూ దగ్గర లేనప్పుడు నీవుగాని, నేనుగాని ఏమి చేయగలము? కాని నీవు తినడానికి ముందు నన్ను స్మరిస్తావా? నేను ఎల్లప్పుడూ నీ చెంత లేనా? నీవు ఏదైనా తినడానికి ముందు నాకు అర్పిస్తున్నావా?
నీతి :
ఈ సంఘటనలో బాబా ఏమి చెప్పారో జాగ్రత్తగా గమనిద్దాము. పంచేంద్రియాల కంటే ముందే, మనస్సు బుద్ది విషయ ఆనందాన్ని అనుభవిస్తుంది. కాబట్టి మొదటే భగవంతుణ్ణి స్మరించుకోవాలి. ఇలా చేసినట్లయితే ఇది కూడా ఒక విధంగా భగవంతునికి అర్పితం అవుతుంది. విషయాలను విడిచి పంచేంద్రియాలు ఉండలేవు. కాబాట్టి ఈ విషయాలను మొదట గురువుకి అర్పించినట్లయితే వాటిలోని అభిమానం సహజంగా అదృశ్యమైపోతుంది. ఈ విధంగా కామము, క్రోధము, లోభము మొదలైన వాటి గురించిన వృత్తులన్నిటినీ (ఆలోచనలు) మొట్టమొదట గురువుకి అర్పించాలి. ఈ అభ్యాసం ఆచరించినట్లయితే దేవుడు వృత్తులన్నీ నిర్మూలన అవడానికి సహాయపడతాయి. విషయాలను అనుభవించే ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావిస్తే, ఆ వస్తువును అనుభవించవచ్చా? లేదా? అనే ప్రశ్న ఏర్పడుతుంది. ఏది అనుభవించడానికి తగదో దాన్ని విడిచిపెడతాము. ఈ విధంగా మన దుర్గుణాలన్నీ నిష్క్రమిస్తాయి. మన శీలం చక్కబడుతుంది. గురువుపట్ల ప్రేమ వృద్దిచెందుతుంది. శుద్ధజ్ఞానం మొలకెత్తుతుంది.ఈ జ్ఞానం వృద్ధిపొందినప్పుడు దేహబుద్ధి నశించి, బుద్ది చైతన్యఘనంతో లీనమవుతుంది. అప్పుడే మనకు ఆనందం. సంతృప్తి కలగుతాయి.
గురువుకి, దేవుడికి ఎవరు భేదం ఎంచుతారో వారు దైవాన్ని ఎక్కడా చూడలేరు. భేదాలన్నిటినీ ప్రక్కకు త్రోసి, గురువును, దేవుణ్ణి ఒకటిగా భావించాలి. ఈ ప్రకారంగా గురువుని సేవించినట్లయితే భగవంతుడు నిశ్చయంగా ప్రీతి చెందుతాడు. మన మనస్సులను స్వచ్చంగా చేసి ఆత్మ సాక్షాత్కారం ప్రసాదిస్తుంది. క్లుప్తంగా చెప్పేది ఏమిటంటే మనం గురువుని స్మరించనిదే ఏ వస్తువును పంచెంద్రియాలతో అనుభవించరాదు. మనస్సును ఈ విధంగా శిక్షిస్తే మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞాపకానికి ఉంచుకుంటాము. మంకు బాబా ధ్యాస ఎన్నో రెట్లు వృద్ధిపొందుతుంది. బాబా సగుణస్వరూపం మన కాళ్ళ ఎదుట నిలుస్తుంది. అప్పుడు భక్తి, వైరాగ్యం, మోక్షం మన వశం అవుతాయి. మన మనస్సులో బాబాను ఎప్పుడయితే నిలుపుకుంటామో, అప్పుడు మనం ఆకలిని, పిపాసను, సంసారాన్ని మరచిపోతాము. ప్రపంచ సుఖాలలో గల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందాన్ని పొందుతాయి.
సుదాముని కథ :
పై కథ చెపుతున్నప్పుడే హేమాడ్ పంతుకు సుదాముని కథ జ్ఞాపకానికి వచ్చింది. అందులో కూడ ఇదే నీటి ఉంది. కాబట్టి దాన్ని ఇక్కడ చెపుతున్నాము.
శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి ఒక సహపాఠి సుదాముడు అనేవాడు గురువైన సౌందీపని ఆశ్రమంలో నివశిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణబలరాములను అడవికి వెళ్ళి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపించారు. సౌందీపని భార్య సుదాముని కూడా అదే పనిమీద ముగ్గురి కోసం శనగలు ఇచ్చి పంపించింది. కృష్ణుడు, సుదాముని అడవిలో కలిసి, "దాదా, నీళ్ళు కావాలి. నాకు దాహం వేస్తున్నది'' అన్నాడు. సుదాముడు "ఉత్తకడుపుతో నీరు త్రాగకూడదు, కాబట్టి కొంచెం సేపు ఆగడం మంచిది'' అన్నాడు. కాని తనవద్ద శనగలు ఉన్నాయి, కొంచెం తినమని అడగలేదు. శ్రీకృష్ణుడు అలసి ఉండటంతో సుదాముని తొడపై తలవుంచి గుర్రుపెడుతూ నిద్రపోయాడు. ఇది కనిపెట్టి సుదాముడు తన జేబులోని శనగలు తీసి తినదానికి ఉపక్రమించాడు. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు "దాదా ఏమి తింటున్నావు? ఎక్కడనుంచి ఆ శబ్దము వస్తున్నది?'' సుదాముడు ఇలా అన్నాడు "తినడానికి ఏమున్నది? నేను చలితో వణుకుతున్నాను. నా పళ్ళు కటకటా అంటున్నాయి. విష్ణుసహస్రనామం కూడా సరిగ్గా ఉచ్చరించలేకుండా ఉన్నాను''. ఇది విని సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు "నేనొక స్వప్నం చూసాను. అందుకో ఒకడు ఇంకొకరి వస్తువులను తింటున్నాడు. ఏమి తింటున్నావు అని అడగ్గా ఏముంది తినడానికి మన్నా'' అన్నాడు. అంటే తినడానికి ఏమీ లేదని భావం. రెండవవాడు 'తథాస్తు' అన్నాడు. దాదా! ఇది ఒక స్వప్నం. నాకు ఇవ్వకుండా నువ్వు తినవని నాకు తెలుసు. స్వప్నప్రభావంతో నీవు ఏమి తింటున్నావు అని అడిగాను''. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు అని గాని, అతని లీలలుగాని తెలిసివున్నట్లయితే సుదాముడు అలా చేసి వుండడు. కాబట్టి అతడు చేసినదాన్ని తానే అనుభవించవలసి వచ్చింది. శ్రీకృష్ణ ప్రియ స్నేహితుడు అయినప్పటికీ అతని ఉత్తరాకాలం అంతా గర్భదారిద్ర్యంతో బాధపడవలసి వచ్చింది. కొన్నాళ్ళకు భార్య కష్టం చేసి సంపాదించి ఇచ్చి పంపించిన పిడికెడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతోషించి ఒక బంగారు పట్టణాన్ని అనుభవించడానికి ఇచ్చాడు. ఎవరికయితే దగ్గరున్నవారికి ఇవ్వకుండా తినే అలవాటు ఉంటుందో వారు దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి.
శృతి కూడా దీన్నే నొక్కి చెపుతున్నది. మొదట భగవంతుడికి అర్పించి ఆ భుక్త శేషాన్నే మనం అనుభవించాలి. బాబా కూడా దీన్నే హాస్యరూపంగా యుక్తితో బోధించారు.
అన్నా చించణీకరు, మావిశీబాయి :
హేమాడ్ పంతు ఇక్కడ ఇంకొక హాస్యసంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వాన్ని వర్ణించారు. దామోదర్ ఘనశ్యామ్ బాబరె వురఫ్ అన్నా చించణీకర్ అనే భక్తుడు ఒకడు ఉన్నాడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడేవాడు, ఎవరినీ లక్ష్యపెట్టేవాడు కాదు; ఉన్నదున్నట్టు చెప్పేవాడు, ఎప్పటిదప్పుడే తేల్చుకునేవాడు. బయటికి కఠినంగాను, హఠం చేసేవాడిలాగా కనిపించినా, వాడు మంచి హృదయం కలవాడు. నక్కజిత్తులవాడు కాదు. అందుకే బాబా వాణ్ణి ప్రేమిస్తూ ఉండేవారు. అందరూ సేవ చేసినట్లే అతడు కూడా మధ్యాహ్నం బాబా ఎడమచేతిని (కఠడా పైన వేసి ఉన్నదాన్ని) తోముతూ ఉండేవాడు. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి అనే ఆమె ఉంది. ఆమెను బాబా 'అమ్మా' అని పిలిచేవారు. ఇతరులు మావిశీబాయి అని పిలిచేవారు. ఆమె కూడా బాబాను సేవిస్తూ ఉండేది. ఈమెది స్వచ్చమైన హృదయం. ఆమె బాబానడుమును, మొలను, వీపును తన రెండు చేతుల వ్రేళ్ళు అల్లి దానితో నొక్కుతూ ఉండేది. ఆమె దీన్ని అతితీవ్రంగా చేస్తూ ఉంది. బాబ వీపు కడుపు కలిసిపోయినట్లు కనిపిస్తూ ఉండేది. ఇంకొక ప్రక్క అన్నా తోముతూ ఉన్నాడు. మావిశీబాయి ముఖం క్రిందికి మీదికి అవుతూ ఉంది. ఒకసారి ఆమె ముఖం అన్నా ముఖానికి చాలా దగ్గరగా వెళ్ళింది.
హాస్యమాడే నైజం కలది అవడంతో ఆమె "ఓహో! అన్నా చెడ్డవాడు, నన్నుముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంత ముసలివాడయినప్పటికీ నన్ను ముద్దు పెట్టుకోడానికి సిగ్గులేదా?'' అంది. అన్నాకు కోపం వచ్చింది. చొక్కాచేతులు పైకెత్తి అతను ఇలా అన్నాడు "నేను ముసలివాడిని దుర్మార్గుడిని అంటున్నావు. నేను వెఱ్ఱివాడినా? నీవే కలహానికి కాలు దువ్వుతున్నావు''. అక్కడున్నవారందరూ ఈ ముసలివాళ్ళ కలహాన్ని చూసి నవ్వుతున్నారు. బాబా ఇద్దరినీ సమానంగా ప్రేమించేవారు కనుక ఇద్దరినీ ఓదార్చాలని తలచి ఈ క్రింది విధంగా నేర్పుతో సమాధానపరిచారు. బాబ ప్రేమతో "ఓ అన్నా! ఎందుకు అనవసరంగా గోల చేస్తున్నావు? తల్లిని ముద్దుపెట్టుకుంటే దానిలో అనౌచిత్యం ఏమిటి'' అన్నారు. బాబా మాటలు విని, ఇద్దరూ సంతుష్టి చెందారు. అందరూ సరదాగా నవ్వారు. బాబా చమత్కారానికి హృదయానంద పూరితులయ్యారు.
బాబా నైజం, భక్తి పారాయణత్వం :
బాబ తన భక్తులకు వారివారి ఇష్టానుసారం సేవ చేయడానికి అనుమతిస్తూ ఉండేవారు. దీనిలో ఇతరులు జోక్యం కలుగచేసుకోవడం బాబాకి ఇష్టం లేదు. ఒక ఉదాహరణ ఇస్తాము. ఈ మావిశీబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తికడుపును తోముతూ ఉన్నాడు. ఆమె ప్రయోగించే బలాన్ని చూసి, యితర భక్తులు అత్రపడ్డారు వారు ఇలా అన్నారు "అమ్మా! కొంచెం మెల్లగా తోము. బాబా కడుపులోని ప్రేవులు, నరాలు తెగిపోగలవు'' ఇలా అనగానే, బాబా వెంటనే లేచి కోపంతో సటకాను నేలపై కొట్టారు. వారి కళ్ళు నిప్పుకణంలా ఎర్రబడ్డాయి. బాబాను చూడడానికి ఎవరికీ ధైర్యం లేకపోయింది. బాబా సటకా చివరిని రెండు చేతులతో పట్టుకుని పొత్తికడుపులోనికి గ్రుచ్చుకున్నారు. ఇంకొక చివరని స్తంభానికి ఆనించారు.
సటకా అంతా పొత్తికడుపులో దూరినట్లు కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటిలో పొత్తికడుపు పేలిపోతుంది అనుకున్నారు. బాబా క్రమంగా స్తంభం వైపు వెళ్తూ ఉన్నారు. అందరూ భయపడ్డారు. ఆశ్చర్యంతోను, భయంతోనూ మాట్లాడలేక మూగవాళ్ళలా నిలిచారు. బాబా తన భక్తురాలి కోసం ఈ కష్టం అనుభవించారు. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోము అన్నారు. మంచి ఉద్దేశ్యంతో వారు ఈ మాటలు అన్నారు. దీనికి కూడా బాబా ఒప్పుకోలేదు. వారి మంచి ఉద్దేశ్యమే బాబాను కష్టంలో దిన్చినందుకు వారు ఆశ్చర్యపోయారు. ఏమే చేయలేక కనిపెట్టి చూస్తూ ఉన్నారు. అదృష్టంతో బాబ కోపం తగ్గింది. సటకాను విడిచి గద్దెపై కూర్చున్నారు. అప్పటినుండి భక్తులు ఇష్టానుసారం సేవ చేస్తున్నప్పుడు ఇతరులు జోక్యం కలుగ చేసుకోరాదనే నీతిని నేర్చుకున్నారు. ఎవరి సేవ ఎలాంటిదో బాబాకే గుర్తు.
ఇరువది నాలుగవ అధ్యాయము సంపూర్ణము