Read more!

శ్రీసాయిసచ్చరిత్రము ఇరవై ఐదవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము



ఇరవై ఐదవ అధ్యాయము

 

 

 

 

దాము అన్నా కాసార్ (అహమదునగరు) - సట్టా వ్యాపారము - మామిడి పండ్ల లీల
భగవంతుడి అవతారాన్ని, పరబ్రహ్మ స్వరూపుడూ, మహా యోగేశ్వరుడూ, కరుణాసాగరుడూ అయిన శ్రీసాయినాథుడుకి సాష్టాంగనమస్కారం చేసి ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తాము. యోగి చూడామణి అయిన శ్రీసాయినాథ మహారాజుకు జయం అగుగాక! సమస్త శుభాలకు నిలయం, మన ఆత్మారాముడు, భక్తులపాలిట ఆశ్రయదాత అయిన సాయికి జయం అగుగాక. జీవితాశయాన్ని, పరమావధిని చూసిన బాబాకు ప్రణామాలు.
సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసింది వారియందు మనఃపూర్వకమైన భక్తి. భక్తుడికి స్థిరమైన నమ్మకం పూర్ణభక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరుతాయి. హేమాడ్ పంతు మనస్సులో బాబా జీవితలీలలను వ్రాయాలనే కోరిక జనించగానే, బాబ వెంటనే అతనితో వ్రాయించారు. సంగ్రహంగా సంగతులన్నీ వ్రాసుకోమని బాబా ఆజ్ఞా యిచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ది, శక్తి, ధైర్యం కలిగి దాన్ని ముగించారు. దాన్ని వ్రాసే యోగ్యత మొదట అతనికి లేకపోయింది. కాని బాబా దయాపూరితమైన ఆశీర్వచనాలతో దాన్ని అతడు పూర్తి చేయగలిగాడు. ఈ విధంగా సచ్చరిత్ర సిద్ధమైంది. అది ఒక చంద్రకాంతమణి వంటిది. దానినుండి సాయిలీలలనే అమృతం స్రవించింది. దాన్ని చదివేవారు మనసారా త్రాగవచ్చు.
భక్తుడికి సాయిలో పరిపూర్ణమైన, హృదయపూర్వకమైన భక్తి కలిగినప్పుడు దుఃఖాలనుండి, అపాయాల నుండి బాబా కాపాడి రక్షిస్తూ ఉంటాడు. వారి యోగక్షేమాలు బాబా చూస్తూ ఉంటాడు. అహమద్ నగరు నివాసి అయిన (ప్రస్తుతము పూనా వాసి) దామోదర్ సావల్ రాం రాసనే కాసార్ ఫురఫ్ దాము అన్నా కథ పైన పేర్కొనిన వ్యాకానికి ఉదాహరణగా దిగువ ఇవ్వబడింది.
దాము అన్నా (దామోదర్ సావల్ రాం రాసనే)
6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భంలో ఇతని గురించి చెప్పాము. చదివేవారు దాన్ని జ్ఞాపకం ఉంచుకునే ఉంటారు. అతడు 1897వ సంవత్సరంలో శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి వెళ్ళాడు. అప్పటినుండి ఇప్పటివరకు అలంకరించిన పతాక మొకటి కానుకగా ఇస్తూ ఉన్నాడు. అదీ గాక ఉత్సవానికి వచ్చే బీదలకు అన్నదానం చేస్తున్నాడు.
అతని జట్టీ వ్యాపారములు : 1 ప్రత్తి

 

 

 

 


బొంబాయి స్నేహితుడు ఒకడు దాము అన్నాకు, ప్రత్తిలో జట్టీ వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు రెండు లక్షల రూపాయలు లాభం సంపాదించాలని వ్రాసాడు. వ్యాపారం లాభదాయకమైనదనీ, ఎంత మాత్రం ప్రమాదకరం కాదనీ, గనుక అవకాశం పోగొట్టుకొనవద్దని అతడు వ్రాసాడు. దాము అన్నా ఆ బేరాన్ని చేయాలా? మానటమా? అనే ఆందోళనలో పడ్డాడు. జట్టీ వ్యాపారం చేయడానికి వెంటనే నిశ్చయించుకోలేక పోయాడు. దాని గురించి బాగా ఆలోచించి తానూ బాబా భక్తుడు అవటంతో శ్యామాకి ఒక జాబు సవివరంగా వ్రాసి బాబాని అడిగి వారి సలహాను తెలుసుకోమన్నాడు. ఆ మరుసటి రోజు ఆ ఉత్తరం శ్యామాకు చేరింది. శ్యామా దాన్ని తీసుకుని మసీదుకు వెళ్ళాడు. బాబా ముందర పెట్టాడు. బాబా ఆ కాగితం ఏమిటని అడిగారు. సమాచారం ఏమిటి అన్నారు? శ్యామా అహమద్ నగరు నుండి దాము అన్నా ఏదో కనుక్కోవడానికి వ్రాసాడు అన్నాడు. బాబా ఇలా అన్నారు : "ఏమి వ్రాసి ఉన్నాడు? ఏమి ఎత్తు వేస్తున్నాడు? భగవంతుడు ఇచ్చినదానితో సంతుప్తి చెందక ఆకాశానికి ఎగరే ప్రయత్నిస్తున్నట్టు వుంది. వాని ఉత్తరము చదువు'' బాబా చెప్పిందే ఆ ఉత్తరములో గల సమాచారమని, శ్యామా "దేవా! నీవిక్కడే ప్రశాంతంగా కూర్చుని, భక్తుల ఆందోళనపాలు చేస్తావు. వారు వ్యాకులు అవటంతో, వారిని ఇక్కడికి ఈడ్చుకుని వస్తావు. కొందరిని ప్రత్యేకంగాను, కొందరిని లేఖల రూపంగా తెస్తావు. ఉత్తరంలోని సంగతులు తెలిసి నను ఎందుకు చదవమని బలవంత పెడుతున్నావు?'' అన్నాడు. బాబా "ఓ శ్యామా! దయచేసి చదువు. నా నోటికి వచ్చింది నేను మాట్లాడతాను. నన్ను విశ్వసించే వారెవ్వరు?'' అన్నారు.

 

 

 

 


అప్పుడు శ్యామా ఉత్తరాన్ని చదివారు. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇలా అన్నారు. "సేటుకి పిచ్చిపట్టింది. అతని గృహంలో ఎలాంటి లోటు లేదని వ్రాయి. తనకున్న సగం రొట్టెతో సంతృప్తి చెందమని వ్రాయి. లక్షలు ఆర్జించడానికి ఆయాస పడవద్దని చెప్పు.'' శ్యామా జవాబు పంపారు. దాన్కోర్సం ఆతృతతో దాము అన్నా కనిపెట్టుకుని ఉన్నాడు. జాబు చదువుకుని అతడు తన ఆశ అంతా అడియాస అయింది అనుకున్నాడు. కాని స్వయంగా వచ్చి మాట్లాడటానికి, ఉత్తరం వ్రాయటానికి భేదం ఉందని శ్యామా వ్రాయటంతో స్వయంగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడాలని అనుకున్నాడు. అందుకే షిరిడీకి వెళ్ళాడు. బాబాకు నమస్కరించాడు. బాబా పాదాలు ఒత్తుతూ కూర్చున్నాడు. అతనికి బాబాను బహిరంగంగా జట్టీ వ్యాపారం గురించి అడగడానికి ధైర్యం చాల లేకపోయింది. బాబా సయాయపడితే వ్యాపారంలో కొంత లాభం బాబాకి యిస్తే బాగుండును అనుకున్నాడు. ఇలా రహస్యంగా దాము అన్నా తన మనసులో అనుకున్నాడు. బాబాకు తెలియనిది ఏమీ లేదు. అరచేతిలో ఉన్న ఉసిరికాయలా భూతభవిష్యత్ వర్తమానాలు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావాలని. కాని తల్లి చేదుమాత్ర యిస్తుంది. తీపి వస్తువులు ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. చేదుమాత్ర ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తాయి. తల్లి తన బిడ్డయొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదుమాత్రలే ఇస్తుంది. బాబా దయగల తల్లివంటివారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానాలలో లాభాల గురించి బాగా తెలిసినవారు. దాము అన్నా మనస్సును కనిపెట్టి బాబా యిలా అన్నారు."ప్రపంచ విషయాలలో తగుల్కొనటం నాకు యిష్టం లేదు'' బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్నా ఆ పనిని మానుకున్నాడు.
2. ధాన్యములు బేరము :

 

 

 

 

తరువాత దాము అన్నా ధ్యానం వ్యాపారం చేయ తలపెట్టాడు. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి "నీవు 5 శేర్ల చొప్పున కొని 7 శేర్ల చొప్పున అమ్మవలసి వస్తుంది. కాబట్టి ఈ వ్యాపారం కూడా మానుకో'' అన్నారు. కొన్నాళ్ళ వరకు ధాన్యం ధర హెచ్చుగానే ఉంది. కాని ఒక మాసం రెండు మాసాలు వర్షాలు విశేషంగా కురిసాయి. ధరలు హఠాత్తుగా పడిపోయాయి. ధాన్యాలు నిలువచేసిన వారందరూ నష్టపోయారు. ఈ దురదృష్టం నుండి దాము అన్నా కాపాడ్డబడ్డాడు. ప్రత్తి జట్టీ వ్యాపారం కూడా కూలిపోయింది. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేశాడు. మదుపు పెట్టినవారికి గొప్ప నష్టం వచ్చింది. బాబా తనను రెండుసార్లు గొప్ప నష్టాలనుండి తప్పించారని, దము అన్నాకు బాబాలో గల నమ్మకం పెరిగింది. బాబ మహాసమాధి చెందేవరకూ వారికి నిజమైన భక్తుడిగా ఉన్నాడు. వారి మహాసమాధి తరువాత కూడా ఇప్పటివరకు భక్తితో ఉన్నాడు.
ఆమ్రలీల (మామిడిపండ్ల చమత్కారము)  :

 

 

 

 

ఒకరోజు 300 మామిడిపండ్ల పార్సిల్ వచ్చింది. రాళే అనే మామలతదారు గోవానుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపారు. అది తెరిచినప్పుడు పండ్లన్నీ బాగానే ఉన్నాయి. అది శ్యామా ఆధీనంలో పెట్టారు. అందులో 4 పండ్లు మాత్రమే బాబ కొలంబలో (కుండలో) పెట్టారు. బాబా "ఈ నాలుగు దాము అన్నాకు, అవి అక్కడే ఉండాలి'' అని అన్నారు. దాము అన్నాకు ఇద్దరు భార్యలు ఉన్నారు. కాని అతనికి సంతానం లేకేపోయింది. అనేక జ్యోతిష్కులను సంప్రదించారు. అతడు కూడా జ్యోతిష్యాన్ని కొంతవరకు చదివాడు. తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండటంతో అతనికి సంతానం కలిగే అవకాశం లేదనుకున్నాడు. కాని అతనికి బాబాయందు అత్యంత నమ్మకం ఉంది. మామిడిపండ్లు అందిన రెండుగంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించడానికి వెళ్లగా బాబా యిలా అన్నారు "అందరు మామిడిపండ్లవైపు చూస్తున్నారు. కాని అవి దముకోసం ఉంచినవి. కాబట్టి అది దాము తిని చావాల్సిందే.'' దాము ఆ మాటలు విని భయపడ్డాడు. కాని మహాల్సాపతి (బాబా ముఖ్యభక్తుడు)  దాన్ని ఇలా సమర్థించారు. "చావమనేది అహంకారాన్ని గురించి, దాన్ని బాబాముందు చంపటం ఒక ఆశీర్వాదం'' బాబా అతనితో ఇలా అన్నారు "నీవు తినవద్దు నీ చిన్నభార్యకి యివ్వు. ఈ యామ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను, నలుగురు కుమార్తెలను ప్రసాదిస్తుంది'' దము ఆ ప్రకారమే చేశాడు. కొంతకాలానికి బాబా మాటలు నిజమయ్యాయి. జ్యోతిష్కుని మాటలు ఉత్తవి అయ్యాయి.

 

 

 

 


బాబా మాటలు వారి సమాధికి పూర్వమేగాక ఇప్పుడు కూడా వారి మహత్యాన్ని స్థాపిస్తున్నాయి. బాబా యిలా అన్నారు "సమాధి చెందినప్పటికీ నా సమదిలోనుంచి నా ఎముకలు మాట్లాడతాయి. అవి మీకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తాయి. మనఃపూర్వకంగా నన్ను శరణుజొచ్చినవారితో నా సమాధి కూడా మాట్లాడుతుంది. వారి వెన్నంటి కదలను. నేను మీవద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుతూ మీ క్షేమాన్ని కనుగొంటూ ఉంటాయి. ఎల్లప్పుడూ నన్నే జ్ఞాపకంలో ఉంచుకోండి. అప్పుడే మీరు అత్యంత మేలు పొందుతారు'' హేమాడ్ పంతు ఈ అధ్యాయం ఒక ప్రార్థనతో ముగిస్తున్నాడు.
ప్రార్థన :

 

 

 

 

"ఓ సాయి సద్గురూ! భక్తుల కోరికలు నెరవేర్చే కల్పవృక్షమా! మీ పాదాలు మేమెన్నటికీ మరువకుందుము గాక. మీ పాదాలను ఎప్పుడూ చూస్తూ ఉండేదము గాక. ఈ సంసారంలో చావు పుట్టుకలతో మిక్కిలి బాధ పడుతున్నాము. ఈ చావుపుట్టుకలనుంచి మమ్మల్ని తప్పించు. మా ఇంద్రియాలు విషయములపై పోనీయకుండా అడ్డుకో. మా దృష్టిని లోపలకు మరల్చి ఆత్మతో ముఖాముఖి చేయి. ఇంద్రియాలు, మనస్సు బయటకు వెళ్ళే నైజాన్ని ఆపనంతవరకు ఆత్మసాక్షాత్కారానికి అవకాశం లేదు. అంత్యకాలంలో కొడుకుగాని, భార్యగాని, స్నేహితుడుగాని ఉపయోగాపడరు. నీవే మాకు ఆనందాన్ని, మోక్షాన్నికలుగచేసేవాడవు. వివాదములలో దుర్మార్గపు పనులలో మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయుము. నీ నామస్మరణ చేయడానికి జిహ్వ యుత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచివే అగుగాక చెడ్డవే అగుగాక తరిపి వేయి. మా గృహాలను శరీరాన్ని మరిచిపోయేలా చేయుము. మా అహంకారాన్ని నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తియందు ఉండేలా చేయుము. తక్కిన వస్తువులన్నిటినీ మరిచిపోయేట్లు చేయుము. మనస్సు చంచాల్యాన్ని తీసివేయుము. దాన్ని స్థిరంగా ప్రశాంతంగా ఉంచుము. నీవు మమ్ములను గట్టిగా పట్టి ఉంచినట్లయితే ఆ అజ్ఞానందకారం నిష్క్రమిస్తుంది. నీ వెలుతురులో మేము సంతోషంగా ఉండేదము. మమ్మల్ని నిద్రనుండి లేపుము. నీ లీలామృతం త్రాగే భాగ్యం నీకటాక్షం చేతనూ గతజన్మలలో మేము చేసిన పుణ్యం వలన కలిగింది''

 

 

 

 

 


నోటు : దాము అన్నా యిచ్చిన వాంగ్మూలం ఈ సందర్భంగా గమనించ దగినది.ఒకరోజు అనేకమందితో నేను కూడా బాబ పాదాల వద్ద కూర్చుని ఉన్నప్పుడు, నా మనస్సులో రెండు సంశయాలు కలిగాయి. ఆ రెంటికి బాబా యిలా జవాబిచ్చారు.
1. సాయిబాబా వద్ద అనేకమంది గుమిగూడుతున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందుతారా?
దీనికి బాబా ఇలా జవాబిచ్చారు : "మామిడిచెట్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడు. పువ్వులన్నీ కూడా పండ్లు అయితే, ఎంత మంచి పంట అవుతుంది? కాని అలా జరుగుతుందా? పువ్వుగానే చాలామట్టుకు రాలిపోతుంది. గాలికి కొన్ని పిందెలు రాలిపోతాయి. కొన్ని మాత్రమే మిగులుతాయి.
2. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతికశరీరం విడిచిన తరువాత నా జీవితమనే ఓడ ఎలా నడపగలను? అది ఎటో కొట్టుకొని పోతుందా? అలా అయితే నా గతి ఏమిటి?

 

 

 

 


దీనికి బాబా జవాబిలా చెప్పారు "ఎక్కడ అయినా, ఎప్పుడయినా నా గురించి చింతిస్తే నేను అక్కడే ఉంటాను'' 1918 ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేరుస్తూ ఉన్నారు. 1918 తరువాత కూడా నేరవేస్తున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపిస్తున్నారు. ఇది 1910-11 కాలంలో జరిగింది. నా సోదరులు వేరుపడ్డారు. నా సోదరి కాలధర్మం చెందింది. దొంగతనం జరిగింది. పోలీసు విచారణ జరిగింది. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి.
నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యింది. నేను జీవితాన్ని, సుఖాలను లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు వెళ్లగా వారు ఉపదేశంతో శాంతింపచేసి, అప్పా కులకర్ణి యింటిలో బొబ్బట్లతో విందు కావించారు. నా నుదుట చందనం పూసారు.
నా యింటిలో దొంగతనం జరిగింది. నాకు ముప్పై సంవత్సరాల నుండి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు నా భార్య యొక్క నగలపెట్టె దొంగిలించాడు. అందులో శుభమైన నత్తు (నాసికాభరణము) ఉండేది. బాబా ఫోటో ముందు ఏడ్చాను. ఆ మరుసటి రోజే ఆ మనిషి నగలపెట్టెను తిరిగి యిచ్చివేసి క్షమాపణ కోరాడు.

ఇరవై అయిదవ అధ్యాయం సంపూర్ణం