Read more!

శ్రీసాయిసచ్చరిత్రము ఇరవై మూడవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము


ఇరవై మూడవ అధ్యాయము

 

 

 

 

1.యోగము - ఉల్లిపాయ 2. శ్యామా పాముకాటు బాగాగుట 3. కలరా నియయమాలను ఉల్లంఘించుట 4. గురుభక్తి పరీక్ష
నిజంగా ఈ జీవుడు త్రిగుణాలకు అనగా సత్వరజస్తమోగుణాలకి అతీతుడు. కాని మాయచే కప్పబడి, వాని నైజం అయిన సచ్చిదానందాన్ని మరిచిపోతూ తానూ శరీరమే అనుకుంటూ, అలాంటి భావనతో తానే చేసేవాడు అనుభవించేవాడు అని అనుకుంటూ, లెక్కలేని బాధలలో చిక్కుకుంటూ విముక్తిని పొందలేక పోతున్నాడు. విమోచానానికి మర్గమొక్కటే వుంది. అది గురువుని పాదాలలో ప్రేమమయమైన భక్తి, గొప్పనటుడైన సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజంలోకి మారుస్తారు.
ఇంతకు పూర్వం చెప్పిన కారణాలచే మేము సాయిని భగవంతుని అవతారంగా అనుకున్నాము. కాని వారు ఎల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడనని చెప్పేవారు. వారు అవతారపురుషులు అయినప్పటికీ ఇతరులు సంతృప్తికరంగా ఎలా ప్రవర్తించాలో చూపిస్తూ ఉండేవారు. ఆయా వర్ణాశ్రమాలకు విధింపబడిన కర్మలను ఎలా నెరవేర్చాలో తెలిపేవారు. ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేవారు కారు. తనకొరకు ఏమైనా చేయమని ఇతరులను కోరేవారు కారు. సమస్త చేతనాచేతనాలలో, భగవంతుణ్ణి చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితం కదా! ఎవరిని నిరాదరించటంగానీ, అవమానించటంగానీ వారు ఎరుగరు. సమస్తజీవులలో వారు నారాయణుని చూస్తుండేవారు. 'నేను భగవంతుడిని' అని వారు ఎప్పుడూ అనలేదు. భగవంతుని విధేయసేవకుడనని వారు చెప్పేవారు; భగవంతున్ని ఎల్లప్పుడూ తలిచేవారు. ఎల్లప్పుడూ 'అల్లా మాలిక్!' అనగా భాగంతుడే సర్వాధికారి అని అంటుండేవారు.
మేము ఇతర యోగులను ఎరుగుదుము వారు ఎలా ప్రవర్తిస్తారో, ఏమి చేసేవారో, ఎలా తింటారో తెలియదు. భగవంతుని కటాక్షంతో వారు అవతరించి అజ్ఞానులకు, బద్ధజీవులకు విమోచనం కలుగజేస్తారని మాత్రం మేము ఎరుగుదుము. మన పుణ్యం ఏమైనా ఉన్నట్లయితే మహాత్ముల కథలను లీలలను వినటానికి కుతూహలం కలుగుతుంది. లేకపోతే జరుగదు. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథలను చూద్దాము.

యోగము - ఉల్లిపాయ :

 

 

 

 

ఒకరోజు యోగాభ్యాసము చేసే సాధకుడు ఒకడు నానాసాహెబు చాందోర్కరుతో కలిసి శిరిడీకి వచ్చారు. అతడు యోగశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలన్నీ చదివారు. చివరికి పతంజలి యోగసూత్రాలు కూడా చదివారు. కాని అనుభవమేమీ లేకపోయింది. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధిస్థితిలో కొంచెం సేపయిన ఉండలేక పోయేవాడు. సాయిబాబా తన పట్ల ప్రసన్నుడైతే చాలాసేపు సమాధిలో ఉండటం నేర్పుతారని అతడు అనుకున్నాడు. ఈ లక్ష్యంతో అతడు షిరిడీకి వచ్చాడు. అతడు మసీదుకు వెళ్ళి చూసేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తింటున్నారు. దీన్ని చూడగానే అతనికి మనస్సులో ఒక ఆలోచన మెదిలింది. 'రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినేవాడు తన కష్టాలు ఎలా తీర్చగలడు? నన్ను ఎలా ఉద్దరిస్తాడు?' సాయిబాబా అతని మనస్సున మెదిలిన ఆలోచన గ్రహించి, నానాసాహెబుతో ఇలా అన్నారు : "నానా! ఎవరికైతే ఉల్లిని జీనించుకునే శక్తి ఉంటుందో వారే దాన్ని తినాలి'' ఇది విని యోగి ఆశ్చర్యపడ్డాడు. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్యశరణాగతి చేసాడు. స్వచ్చమైన మనస్సుతో తన కష్టాలు తెలిపి ప్రత్యుత్తరముల ద్వారా తెలుసుకుని ఇలా సంతృప్తి చెంది ఆనదించినవాడై బాబా ఊదీ ప్రసాదంతో, ఆశీర్వచనాలతో షిరిడీ విడిచిపెట్టాడు.

పాముకాటు నుండి శ్యామాను కాపాడుట :

 

 

 

 

ఈ కథను ప్రారంభించక పూర్వం హేమాడ్ పంతు, జీవుని పంజరంలో ఉన్న రామచిలుకతో సరిపోల్చవచ్చు అని అన్నారు. రెండూ బంధింపబడే ఉన్నాయి. ఒకటి శరీరములోనూ, రెండవది పంజరములో. రెండూ తమ ప్రస్తుతస్థితియే బాగున్నదని అనుకుంటూ ఉన్నాయి. సహాయకుడు వచ్చి వాటిని బంధములనుండి తప్పించగానే వాటికి నిజం తెలుస్తుంది. భగవత్కటాక్షంతో గురువు వచ్చి వారి కళ్ళను తెరిపించి బంధవిముక్తులను చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితివైపు వెళ్తుంది. అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పదని గ్రహిస్తారు.
గత అధ్యాయంలో మిరీకర్ కు రానున్న అపాయము కనిపెట్టి దానినుండి అతనిని తప్పించిన కథ విన్నారు. అంతకంటే ఘనమైన కథను ఇక్కడ ఇంటారు. ఒకనాడు శ్యామాను విషసర్పం కరిచింది. అతని చిటికెన వ్రేలను పాము కరవడంతో శరీరంలోకి విషం వ్యాపించడం మొదలుపెట్టింది. బాధ ఎక్కువగా ఉండింది. శ్యామా తానూ మరణిస్తానని అనుకున్నాడు. స్నేహితులు అతన్ని విరోబా గుడికి తీసుకొని వెళ్లాలని నిశ్చయించుకున్నారు. పాముకాట్లు అక్కడ బాగు చేయబడుతుండేవి. కాని శ్యామా తన విరోబా అయిన బాబా దగ్గరికి పరుగెత్తాడు. బాబా అతన్ని చూడగానే కోపంతో అతన్ని తిట్టడం ప్రారంభించారు. "ఓరి పిరికి పురోహితుడా! పైకి ఎక్కవద్దు! ఎక్కావో ఏమౌతుందే చూడు'' అని బెదిరిస్తూ, తరువాత ఇలా గర్జించారు : "పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము'' బాబా అలా కోపోద్దీపితుడు అవడం చూసి శ్యామా అత్యంత విస్మయం చెందాడు. నిరాశ చెందాడు. అతను మసీదును తన ఇల్లుగా, బాబా తనని అలా తరిమివేస్తే తానెక్కడికి పోగలడు? అతడు ప్రాణంమీద ఆశ వదులుకుని ఊరుకున్నాడు.

 

 

 

 

కొంతసేపటికి బాబా శాంతించి, శ్యామా దగ్గరకు వెళ్ళి కూర్చుని, ఇలా అన్నారు "భయపడ వద్దు. ఏమాత్రం చింతించకు. ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షిస్తాడు. ఇంటికి వెళ్ళి వూరికే కూర్చో. బయటికి వెళ్ళవద్దు. నాలో విశ్వాసం ఉంచు. భయపడకు, ఆందోళన పడవద్దు''ఇలా అని శ్యామాను ఇంటికి పపించారు. వెంటనే బాబా తాత్యా పాటీలును, కాకాసాహెబు దీక్షితుని అతని వద్దకు పంపి, తనకు ఇష్టమైనవి తినవచ్చు అని, గృహంలోనే తిరగవచ్చు అని, కాని పడుకోకూడదని, ఈ సలహాల ప్రకారం నడుచుకోమని చెప్పారు. కొద్ది గంటలలో శ్యామా బాగుపడ్డాడు. ఈ పట్టున జ్ఞాపకమందు వుంచుకోవలసింది ఏమిటంటే, బాబా పలికిన 5 అక్షరాల మంత్రం. (పో, వెడలిపొమ్ము, క్రిందకు దిగు) శ్యామాను ఉద్దేశించి అన్నది గాక విషాన్ని ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషం పైకి ఎక్కరాదనీ, అది శరీరమంతటా వ్యాపించరాదనీ బాబా ఆజ్ఞాపించారు. మంత్రాలలో ఆరితేరిన తక్కివనారి వలె, వారే మంత్రం ఉపయోగింప అవసరం లేకుండా పోయింది. మంత్రబియ్యం కాని, తీర్థంకాని ఉపయోగించ వలసిన అవసరం లేకుండా పోయింది. శ్యామా జీవితాన్ని రక్షించటంలో వారి పలుకులే అత్యంత శక్తివంతమైనవి.
ఎవరైనా ఈ కథగానీ, యింక ఇతర కథలుగానీ, విన్నా బాబా పాదాలయందు స్థిరమైన నమ్మకం కలుగును. మాయ అనే మహా సముద్రాన్ని దాటడానికి బాబా పాదాలను హృదయంలో ధ్యానించవలెను.

కలరా రోగము :

 

 

 

 

ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరంగా చెలరేగుతూ ఉంది. గ్రామవాసులు చాలా భయపడ్డారు. వారు యితరులతో రాకపోకలు మానుకున్నారు. గ్రామంలో పంచాయితీవారు సభ చేసి రెండు అత్యవసరమైన నియమాలు చేసి,కలరా నిర్మూలించ ప్రయత్నించారు. అవి ఏమిటంటే 1. కట్టెల బళ్ళను గ్రామంలోపలికి రానీయకూడదు. 2. మేకను గ్రామంలో కోయరాదు. ఎవరయినా వీటిని ధిక్కరిస్తే వారికి జరిమానా వేయాలని తీర్మానించారు.
బాబాకి ఇదంతా వత్వట్టి చాదస్తమని తెలుసు. కాబట్టి బాబా ఆ చట్టాలను లక్ష్యపెట్టలేదు. ఆ సమయంలో కట్టెలబండి ఒకటి ఊరిలోపలికి ప్రవేశిస్తూ ఉంది. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలుసు. అయినప్పటికీ కట్టెలబండిని తరిమి వేయడానికి ప్రయత్నిస్తూ వున్నారు. బాబా ఆ సంగతి తెలుసుకుని, అక్కడికి వచ్చి కట్టెలబండిని మసీదుకు తీసుకొని వెళ్ళమని ఉత్తరువు ఇచ్చారు. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పానికి ఎవ్వరూ సాహసించలేదు. ధుని కోసం కట్టెలు కావలసి ఉండింది. కనుక బాబా కట్టెలు కొన్నారు. నిత్యాగ్నిహోత్రిలా బాబా తన జీవితమంతా ధునిని వెలిగించే ఉంచారు. అందుకోసం వారికి కట్టెల అవసరం కనుక వాటిని నిల్వ చేసేవారు. బాబా గృహం, అనగా మసీదు, ఎప్పుడూ తెలిచి ఉండేది. ఎవరయినా వెళ్ళవచ్చును. దానికి తాళంగాని చెవి లేదు. కొందరు తమ ఉపయోగం కోసం కొన్ని కట్టెలను తీసుకుని వెళ్ళేవారు. అందుకు బాబా ఎప్పుడూ గొణుక్కో లేదు. ఈ ప్రపంచమంతా దేవుడే ఆవరించి ఉండటంతో వారికి ఎవరితోనూ శత్రుత్వం ఉండేది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శంగా ఉండటం కోసం ఇలా చేస్తూ ఉండేవారు.

గురుభక్తిని పరీక్షించుట :

 

 

 

 

రెండవ కలరా నిబంధనాన్ని బాబా ఎలా దిక్కరించారో చూద్దాము. నిబంధనాలలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఒక మేకను మసీదుకు తీసుకుని వచ్చ్చారు. ఆ ముసలి మేక దుల్భలంగా, చావడానికి సిద్ధంగా వుంది. ఆ సమయంలో మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబా అక్కడే వున్నారు. సాయిబాబా దాన్ని ఒక కట్టివ్రేటుతో నరికి బలి వేయమని బడేబాబాకు చెప్పారు. ఈ బడేబాబా అంటే సాయిబాబాకు ఎక్కువ గౌరవం. ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా అన కుడివైపున కూర్చోబెట్టుకునేవారు. చిలుము బడేబాబా పీల్చిన తరువాత సాయిబాబా పీల్చి యితరులకు ఇచ్చేవారు. మధ్యాహ్నం భోజన సమయంలో సాయిబాబా సాదరంగా బడేబాబాను పిలిచి, ఎడమప్రక్కన కూర్చుండబెట్టుకున్న తరువాత భోజనం ప్రారంభించేవారు. దక్షిణ రూపంగా వసూలయిన పైకం నుంచి ఆయనకు ఒక్కరోజుకి 50 రూపాయలు సాయిబాబా యిస్తూ ఉండేవారు. బడేబాబా వెళ్ళినప్పుడు 100అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు. అలాంటిది బాబాకు వారికి గమ సంబంధం. సాయిబాబా వారిని మేకను న్రకమని చెప్పగా అనవసరంగా దాన్ని ఎందుకు చంపాలని బడేబాబా నిరాకరించారు. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆపని చేయమన్నారు. అతడు రాధాకృష్ణమాయీ దగ్గరకు వెళ్ళి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాడు. ఎందుకు కత్తిని తెప్పించారో తెలుసుకున్న తరువాత రాధాకృష్ణమాయి దాన్ని తిరిగి తెప్పించుకున్నారు. ఇంకొక కత్తి తీసుకురావడానికి శ్యామా వెళ్ళారు; కానీ వాడా నుండి త్వరగా రాలేదు. తరువాత కాకాసాహెబు దీక్షిత్ వంతు వచ్చింది. వారు మేలిమి బంగారమే కాని, దాన్ని పరీక్షించాలి. ఒక కత్తి తెచ్చి నరకమని బాబా ఆజ్ఞాపించారు. అతడు సాఠేవాడాకి వెళ్ళి కత్తిని తెచ్చారు. బాబా ఉత్తర్వు కాగానే దాన్ని నరకడానికి సిద్ధంగా ఉన్నారు. అతడు స్వచ్చమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపటం అనేది తెలుసుకోలేకపోయారు. హింసించే పనులను చేయటంలో ఇష్టం లేనివాడయినప్పటికీ, మేకను నరకడానికి సంసిద్దుడయ్యాడు. బడేబాబా అనే మహామ్మదీయుడే యిష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎలా సిద్ధపడుతున్నాడు అని అందరూ ఆశ్చర్యపడుతున్నారు. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకున్నారు. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూస్తూ వున్నాడు. బాబా "ఏమిటి ఆలోచించుచున్నావు?నరుకు!'' అన్నారు.

 

 

 

అతని చేతిలో నున్న కత్తి మేకపై పడడానికి సిద్ధంగా ఉండగా బాబా ఆగు అని అన్నారు. "ఎంతటి కఠినాత్ముడవు? బ్రాహ్మణుడవై మేకను చంపుతావా?'' అన్నారు. బాబా ఆజ్ఞానుసారం దీక్షిత్ కత్తిని క్రిందపెట్టి బాబాతో ఇలా అన్నారు. "నీ అమృతంవంటి పలుకే మాకు చట్టం. మాకు ఇంకొక చట్టం ఏమిటో తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకుంటాము. మీ రూపాన్ని ధ్యానిస్తూ రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటిస్తాము. అది ఉచితమా? కాదా? అనేది మాకు తెలియదు. దాన్ని మేము విచారించము. అది సరి అయినదా కాదా? అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించటమే మా విధి, మా ధర్మం''
బాబా తామే మేకను చంపి బలి వేస్తానని చెప్పారు. మేకను 'తకియా' అనే చోట చంపటానికి నిశ్చయించుకున్నారు. ఇది ఫకీరులు కూర్చునే స్థలం. అక్కడికి దాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో అది ప్రాణాలు విడిచింది.
శిష్యులు ఎన్ని రకాలో చెపుతూ ఈ అధ్యాయం హేమాడ్ పంతు ముగిస్తున్నారు. శిష్యులు మూడు రకాలు 1. ఉత్తములు 2. మధ్యములు 3. సాధారణులు.
గురువులకు ఏమి కావాలో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దాన్ని నెరవేర్చేవారు ఉత్తమ శిష్యులు. గురువు ఆజ్ఞానుసారం ఆలస్యం చేయక అక్షరాలా నెరవేర్చువారు మధ్యములు. మూడవ రకంవారు అడుగడుగునా తప్పులు చేస్తూ గురువు ఆజ్ఞను వాయిదా వేసేవారు.
శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండాలి. తోడుగా బుద్ది కుశలత, ఓరిమి ఉన్నట్లయితే అలాంటివారికి ఆధ్యాత్మికపరమావధి దూరం కాదు. ఉచ్చ్వాసనిశ్వాసాలను బంధించటం కాని, హఠయోగం కాని ఇతర కఠినమైన సాధనాలన్నీ అనవసరం. పైన చెప్పిన గుణాలు అలవరచుకుంటే, వారు ఉత్తరోత్తరోపదేశాలకు అర్హులు అవుతారు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందడానికి ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తారు.
వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యం, చమత్కారాలను గురించి చెప్పుకుందాం.

 

ఇరువది మూడవ అధ్యాయము సంపూర్ణము