శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనది ఎందుకనీ..!!
శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనది ఎందుకనీ..!!
శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి పుత్రాదా ఏకాదశి ,దామోదర ద్వాదశి ,వరాహ జయన్తి ఇలా అనేక పండుగలు వస్తాయి.
శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.
శ్రావణ సోమవారం:
ఈ మాసం లో వచ్చే సోమవారాలలో శివ భక్తులు దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతి దేవి కి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడం గా నమ్ముతారు
శ్రావణ మంగళవారం:
శ్రీ కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసం లో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ.
శ్రావణ శుక్రవారం:
ఈ మాసంలో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవిని షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అయిదవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని శాస్త్రం చెప్తోంది.
శ్రావణ శనివారాలు:
ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది.
శ్రావణ పౌర్ణమి:
శ్రావణ పౌర్ణమి , జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి ని ఈ రోజు జరుపుకొంటారు.
రక్షా బంధనం:
శ్రావణ పూర్ణిమ నాడు అన్నదమ్ముల ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను కట్టాలి.
ఇలా శ్రావణ మాసం లోని ప్రతి రొజూ శుభప్రదమయినదే...
శ్రావణ మాసం అంటే శ్రీ మహావిష్ణువు కు అత్యంత ప్రీతికరమైన మాసం....