Read more!

శ్రావణ ద్వాదశీ (వామన) నోము (Shravana Dwadasi (Vamana) Nomu)

 

శ్రావణ ద్వాదశీ (వామన) నోము

(Shravana Dwadasi (Vamana) Nomu)

 

కథ

ఒక రాజుకు 'అమృత వల్లి ' అనే కూతురుండేది. అందచందాలలో గుణగణాలలో ఆమెకామే సాటి కావడం వలన, అలనాటి రాకుమారులే కాకుండా, వివాహితులైన ఎందరో రాజులు కూడా ఆమెనే పెండ్లాడాలని భీష్మించుకుని కూర్చున్నారు. అందువల్ల యితర రాజకూమార్తెలు అందరికీ ఆమె పట్ల అసూయ కలిగింది.అందరూ ఆమెనే ప్రేమిస్తే, తమను వరించే పురుషులుండరనే భయంతోటీ, ఈర్ష్య తోటీ 'తంబళ 'అనే పెద్ద మంత్రికురాలిని సంప్రదించి ఉన్నపళంగా అమృత వల్లి అందాన్ని మాయం చేయమని నియమించారు.

తంబళ, అమృత వల్లికి చెరుపు పెట్టింది.అది మొదలు ఆమె అందచందాలు తరిగిపో సాగాయి. దాంతో రాజులకు ఆమె పట్ల మోజు తగ్గిపోనారంభించింది. ఆమెను పెండ్లాడేందుకు ఒక్కళ్ళూ ముందుకు రావడం మానేశారు. అమృత వల్లీ, ఆమె తండ్రీ కూడా బెంగపెట్టుకున్నారు.

ఇలా వుండగా తీర్థయాత్రలకు వెళ్ళిన రాజపురోహితుడు మరలివచ్చి,విషయం తెలుసుకుని "మాహారాజా! నేను కాశీలో వుండగా యువరాణీగారి దీనావస్థ గురించి తెలిసింది.తక్షణమే అక్కడి పండితులతో చర్చించాను. చెరువూ చిల్లంగీ ప్రయోగాలూ శాపాలు, కోపాలు వంటివన్నీ కూడా వామన నోము చేయడం ద్వారా తొలగిపోతాయి. యువరాణి చేత వామన నోము నోము పట్టించండి'' అని ఉపాయం చెప్పాడు. వెనువెంటనే రాజు ఆ నోముకు ఏర్పాట్లు చేశాడు. నోము నోచిన పదినాళ్ళకల్లా అమృతవల్లి స్వస్థురాలై యధా సౌందర్యాన్నీ, ఆరోగ్యాన్ని పొందింది.

విధానం

ప్రతి ఏటా భాద్రపద మాసం నెలపొడుగునా పై కథ చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి. భాద్రపద శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం ఉండాలి. శుద్ధ ద్వాదశి శ్రవణా నక్షత్ర ఘడియలలో, గాలీ వెలుతురూ బాగుండి, మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రదేశంలో ఈ పూజ చేయాలి.

గడ్డకట్టి, కదలకుండా వుండే పెరుగు పాత్ర మీద వామనుడి స్వర్ణ ప్రతిమ ఉంచి, ఒక చేత్తో పెరుగన్నం గిన్నె, మరొక చేత్తో అమృత కలశం ధరించి వున్నట్లుగా భావిస్తూ యధాశక్తి పూజించి దద్దోజనం నివేదించాలి. ప్రసాదాన్ని 12 మంది పేదవారికి కడుపునిండా పెట్టి, ఆఖర్న తాము తినాలి. ఇలా 12 సంవత్సరాలు చేయాలి.

ఉద్యాపనం

12వ సంవత్సరం నోము నోచుకుని, పన్నెండు పెరుగు పాత్రలూ, 12వామన విగ్రహాలు, 12 దద్దోజన పాత్రలూ దానమియ్యాలి.

బాల్యం నుంచీ ఈ నోము నోచుకుంటే, యౌవనంలో వచ్చే ఆరోగ్య ప్రతి బంధకాలు ఉండవు. యౌవనంలో గాలీధూళీ సోకవు. చెరువులూ, చిల్లంగులూ వంటివి పనిచేయవు.ఆపద మీద పడ్డాక నోము పట్టినా కూడా రెండు సంవత్సరాల్లో అంతా శుభమవుతుంది. భక్తిగా ఆచరిస్తే గొప్ప ఫలితం ఉంటుంది.