Read more!

వావిలి లక్ష్మి వారపు నోము (Vavili Lakshmi Varapu Nomu)

 

వావిలి లక్ష్మి వారపు నోము

(Vavili Lakshmi Varapu Nomu)

 

కథ ఒక బ్రాహ్మణుడికి నలుగురు కొడుకులూ, నలుగురు కుమార్తెలూ వుండేవారు.ఆఖరి కొడుకుకు తప్ప అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. కడసారపు కూతురిది కడుపేద సంసారం కావడం వలన, ఏ పండుగ పబ్బానికీ కూడా పుట్టింటి వారామెను పిలిచేవారు కాదు.

ఆమె తమ్ముడి పెళ్ళి వచ్చింది. వారు అందర్నీ పిలిచారుగాని, పేదదైన అక్కగారిని మాత్రం పిలవలేదు. ఆమె పిల్లలు మాత్రం ఆప్యాయంగా తాతగారింటికి వెళ్లి, మేనమామ పెళ్లి పనులలో పాల్గోబోగా, వాళ్ళా పిల్లల్ని కూడా కసిరి కొట్టేశారు.

ఇదంతా చూసిన ఆ ఇంటి పెద్ద కోడలు, తన కడసారి ఆడపడుచు కష్టానికి చింతించి, పెళ్లివంటల కోసం వుంచిన బియ్యంలోంచి అడ్డేడు తవ్వెడు కడిగిన బియ్యాన్ని తీసి ఒక కొత్త చేటలో పోసింది.

అడ్డేడు తవ్వెడు కడగని బియ్యాన్ని తెచ్చి ఆ చేటలో పోసింది. అనంతరం ఒక వావిలి కొమ్మనూ, క్రొత్త రవికెల గుడ్డనూ,దక్షిణ తాంబూలాలనూ అందులో వుంచి, అన్నీ వున్నక్రొత్త చేట మీద ఒక పాత చేటను మూట వుంచి, తమ యింటి ప్రక్కనే శిథిల గృహంలో వుంటున్నా కడగొట్టు ఆడపడుచుకి రెండిళ్ళ నడుమా వున్న గోడమీదుగా వాయనాన్ని అందించింది. ఆ వాయనం అందుకున్న ఫలితంగా ఆ పేద ఆడబడుచు దరిద్రం తొలిగి క్రమక్రమంగా ఆమె తన తోడబుట్టిన వాళ్ళందరికన్నా ధవవంతురాలయ్యింది.

అంతలోనే ఆమె పెద్దన్నగారి కూతురి కళ్యాణం ఏర్పడింది. ఇప్పుడామె సంపన్నురాలు అయిన కారణంగా, పుట్టింటివారు ఆమెనా ఉత్సవానికి పదేపదే పిలిచారు. పెళ్ళినాటి ఉదయం అన్నా వదినలు స్వయంగా ఆమె యింటికి వెళ్లి పెళ్లి పందిట్లోకి తీసుకుని వచ్చారు.

పందిట్లో బంధువులంతా ఎంతో ప్రేమగా ఆమెను పలకరించారు. భోజనాల వేళయ్యేసరికల్లా, ఆమెకు వెండి పువ్వుల పీట వేసి, బంగారు రంగు అరిటాకు వేసి, అందులో వెండి కంచమూ వెండి పాత్రలూ ఉంచి, పంచభక్ష్య పరమాన్నాలను పిండివంటలను వడ్డించి భోంచెయ్యమన్నారు.

అప్పుడామె తన వంటి మీదున్న మంగళభరణాలు (నత్తు, దుద్దులు, శతమానం, నల్లపూసలు, గాజులు) తప్ప తక్కిన విలువైన నగలన్నీతీసి , వెండి పీట మీదుంచి ''నగా నట్రాల్లారా భోంచెయండి.ఆభరణాల్లారా ఆరగించండి" అని చెప్పి, తాను ఎంగిలి పడకుండానే తన యింటికి వెళ్లిపోబోగా, విందుకు వచ్చిన వాళ్ళంతా అడ్డుకుని "అదేమిటే అమ్మడూ! అభుక్తంగానే వెళ్లిపోతున్నావు?” అని ప్రశ్నించారు.

అందుకా చిన్నది చిరునవ్వు నవ్వుతూ "అమ్మలారా! నా పుట్టింటివాళ్ళు నా సంపదల్ని చూసి పిలిచిరారు. నేను పెట్టుకున్న నగల్ని పిలిచారే గాని నన్ను మాత్రం పిలవలేదు. భోగభాగ్యాల్ని చూసి పిలిచారు గనుక, భోజనం కూడా అవే చేస్తాయి” అని చెప్పింది.

ఆ మాటలతో పుట్టింటివారంతా తమ తప్పు తెలుసుకుని, క్షమించమని కోరారు.వచ్చిన చుట్టుపక్కాలంతా ఆమె చుట్టూ చేరి "ఇంతకీ నీకిన్ని సంపదలు ఎలా కలిగాయి? ఇందుకేం నోము నోచావు?”అని అడిగారు.

ఆమె "నేనే నోమూ నోచనే లేదు.మా పెద్దొదిన గారు నాకు పెరటి గోడమీంచి వావిలి గౌరీ నోము వాయనమిచ్చింది.ఆ వాయనం అందుకున్న పుణ్యానికి యీ సిరి సంపదలన్నీ కలిగాయి" అని జవాబుచ్చింది .

అప్పుడది విన్న స్త్రీలందరూ వావిలిగౌరీ నోము వాయనం అందుకున్నందుకే యింత భాగ్యమబ్బితే, ఆ నోము నోచినవారికి ఇంకెంత భాగ్యమబ్బుతుందో" అని ఆశ్చర్యపోయి, అప్పట్నుంచీ తాము కూడా ఆ నోము నోచుకోనారంభించారు.

విధానం

సంవత్సరం పాటు ప్రతి లక్ష్మివారమూ వావిలి చెట్టునీ గాని, కొమ్మను గాని గౌరీదేవిగా భావించి పూజించి, పై కథ చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి. ఏడాది గడిచాక ఉద్యాపనం చేయాలి.

ఉద్యాపనం

కొత్త చేటలో అడ్డేడు తవ్వెడు కడిగిన బియ్యాన్నీ, అడ్డేడు తవ్వెడు కడగని బియ్యాన్నీ పోసి, ఆ బియ్యం మీద వావిలి కొమ్మనూ ఒక కొత్త రవికెల గుడ్డనూ, దక్షిణ తాంబూలాలనూ వుంచి, పాత చేటతో మూత పెట్టి ఎవరైనా ఒక ముత్తయిదువకు గోడమీంచి వాయన దానమివ్వాలి.