Read more!

శరత్పూర్ణిమ నోము (అను) చంద్ర కళల నోము (Sharathpoornima Nomu)

 

శరత్పూర్ణిమ నోము (అను) చంద్ర కళల నోము

(Sharathpoornima Nomu)

 

కథ

ఒడ్డూ పొడుగూ వున్నప్పటికీ, గిడ్డంగుల నిండా ధన ధాన్యరాశులున్నప్పటికీ, తమ బిడ్డకు అంగసౌష్టవం మాత్రం అమరినట్లు లేకపోవడం వల్ల ఒకానొక సంపన్న దంపతులు నిత్యమూ బాధపడుతూ వుండేవారు.

అలా వుండగా ఒకనాడు వారింటికి అతిథిగా వచ్చిన ఒక సిద్ధుడు "దంపతులారా! పూర్వ శాస్త్రాలలో రహాస్యంగా వున్న ఒక నోమును చెబుతాను. అమ్మాయిచేత దానిని ఆచరింపచేయండి'' అని చెప్పి శరత్పూర్ణిమ నోమునూ, ఉద్యాపననూ చెప్పి వెళ్లాడు. ఆ దంపతులు ఆనందించి, శరదృతువు రాగానే తమ కుమార్తె చేత ఆ నోము పట్టించి, విధివిధానంగా జరిపించి ఉద్యాపన చేయించగా ఆ కన్య అమరినట్లుండే అంగ సౌందర్యంతో, సౌష్ఠవంతో ఆనాటి సుందరీమణులు అందరిలోనూ సాటిలేనిదిగా ఖ్యాతికెక్కి పట్టవు రాజును పెళ్ళాడి పదికాలాల పాటు సౌఖ్యంగా జీవించింది.

విధానం

శరద్రుదువు మొదలయిన ( అశ్వయుజ శుద్ధ పాడ్యమి) నాడు నోము పట్టి, ఆరుబయట చంద్రకాంతిలో వెండితో చేసిన అమ్మవారి ప్రతిమను అర్చించి, ఆనాటి చంద్రకళవంటి వెండి ప్రతిమనూ, బియ్యాన్నీ, తెల్లని వస్త్రాన్నీ, ఒక ముత్యాన్నీ, దక్షిణ తాంబూలాలతో ఒక ఆకర్షణీయమైన బ్రహ్మాణ ముత్తయిదువుకు వాయనమివ్వాలి. అలా పౌర్ణమినాటికి 16 ముత్యాలనివ్వాలి. ఏ తిథిలో వుండే చంద్రకళ ప్రతిమను ఆ తిథినాడు ఇవ్వాలి.

బహుళ పక్షంలో ఏమీ చేయనక్కర లేదు. తిరిగి కార్తీక శుద్ధ పాడ్యమినుంచి పౌర్ణమి వరకూ చేయాలి. ఈ విధంగా మూడు సంవత్సరాలు చేసి ఉద్యాపన చేసుకోవాలి.

ఉద్యాపనం

మూడవ సంవత్సరం కార్తీక పౌర్ణమినాడు నోము యధావిధిగా చేసి, అనంతరం 16 మంది ముత్తయిదువులకు పదహారు కళల చంద్ర ప్రతిమలను ఇచ్చి, వచ్చిన వారందరికీ అమ్మవారి ప్రసాదాన్నే భోజనంగా పెట్టి ఒక బ్రహ్మాణ బ్రహ్మచారిని యధాశక్తి సంతృప్తిగా సత్కరించాలి.

ఈ వ్రతాన్ని భక్తిగా ఆచరిస్తే మంచి ఫలం ఉంటుంది.