శివశ్చ హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయంగ్ శివః
శివశ్చ హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయంగ్ శివః
సాధారణంగా మనం ఆరాధించే ఆదిత్య, అంబికా, గణపతి, విష్ణు, శివాది వేర్వేరు దేవతలనే భావన చాలామందికుంటుంది. ప్రధానంగా శివ, విష్ణువుల మధ్య తీవ్ర విభేద బుద్ధిని చాలామంది ప్రదర్శిస్తారు. ఎన్ని శాస్త్రాలు చదివినా ఇలాంటి విషయాల్లో జ్ఞానం శూన్యంగానే తోస్తోంది. అలాంటివాళ్లకు శివకేశవుల మధ్య భేదం లేదని చెప్పడమే ఇప్పుడు మనం చేయబోతున్న పని.
శివ, విష్ణువుల మధ్య భేదం అజ్ఞానమనీ, పరమేశ్వర తత్త్వమే వివిధ ధర్మములతో వివిధ దేవుళ్ళుగా పూజించాబడుతున్నారని, వీరిలో ఎవరిని పూజించినా ఆ పూజ పరమేశ్వరునికే చెందుననీ జగద్గురువులు శంకరాచార్యులు చెప్పి"పంచాయతన పూజ"ను అనుగ్రహించి లోకానికి ఎంతో మేలు చేశారు
"సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి"
"శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే,
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః.
యధాశివమయో విష్ణు రేవ్వం విష్ణుమయశ్శివః,
యధాంతరం న పశ్యామి తధామే స్వస్తిరాయుషి."
"శివుడు విష్ణురూపము. విష్ణువు శివరూపము. శివుని హృదయం విష్ణువు. విష్ణు హృదయం శివుడు. శివుడు విష్ణుమయము. విష్ణువు శివమయము. వీరిమధ్య భేదము చూడని నా ఆయుస్సునకు భద్రముండుగాక. భేదమును చూచానో నా ఆయుస్సునకు ముప్పే" అని అర్థము.
శివ సహస్రనామములలో శివునికి
1. హరిశ్చ హరిణాక్షశ్చ ,
2 . సుతీక్షః కృష్ణ ఏవ చ,
3. విష్వక్సేనో హరిర్యజ్ఞః,
4. వైష్ణవః ప్రజవీతాళి,
5. ధాతా శక్రశ్చ విష్ణుశ్చ
అనే నామములను, విష్ణు సహస్ర నామములలో విష్ణువుకు
1. స్వయంభూ శ్శంభురాదిత్యః,
2. రుద్రో బహుశిరోబభ్రుః,
3. భూతపతిః,
4. సర్వశ్శర్వః శివః స్థాణుః
అనే నామములను చూస్తే శివ విష్ణువుల అభేదము కనబడుతుంది.
రుద్రమంటే రుద్రాధ్యాయము. దీనికి శతరుద్రీయమని, రుద్రోపనిషత్ అనే పేర్లు ఉన్నాయి. ఇందులో నమక, చమక మంత్రాలు యజుర్వేద ములోనివి. రుద్రాభిషేకంలో చెప్పే మంత్రరాజములు, వీనికి సాయణ, భట్ట భాస్కర, అభినవశంకర, విష్ణు సూరి భాష్యాలున్నాయి. రుద్రంలోని ఈ మంత్ర భాష్య పరిశీలన చేయగా ఈ మంత్రము ఆదిత్య, శివ, విష్ణుపరమైనదిగా తెలుస్తుంది.