బహుముఖ లింగాకారుడు పరమేశ్వరుడు
బహుముఖ లింగాకారుడు పరమేశ్వరుడు
పరమేశ్వరుడు ఆదిదేవుడు. కరుణాంతరంగుడు. పిలిస్తే పలికే దైవం. చరాచర సృష్టికి ఆదీ అంతమూ అంతా పరమేశ్వరలీల. బ్రహ్మ, విష్ణువు నిరంతర పరమేశ్వరధ్యానంలో మునిగితేలుతుంటారు. దోసెడు నీళ్లు శివయ్య నెత్తిన పోస్తే కోరినవరాలను గుమ్మరిస్తాడు. అడక్కుండానే ఇహపర సౌఖ్యాల్ని ప్రసాదిస్తాడు. ముక్తిసోపానాన్ని అనుగ్రహిస్తాడు. శివలింగానికి ఒక్కసారి భక్తితో అభిషేకం చేస్తే కోటి జన్మల పాపం పటాపంచలైపోతుంది. లింగం రూపంలో కొలువుతీరిన శివుడు అభిషేక ప్రియుడు. ఛాయనిబట్టి, ఆకృతినిబట్టి లింగాలను రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆట్యం, సారోట్యం, అనాట్యం, సర్వసమం అని నాలుగు రకాలుగా శివలింగాలుంటాయ్.
1. వెయ్యిన్నొక్క ముఖాలు కలిగిన లింగాన్ని ఆట్యలింగం అంటారు.
2. నూట ఎనిమిది ముఖాలు కలిగి ఉన్నదాన్ని సారోట్యలింగం. దీన్ని అష్టోత్తర లింగం అని కూడా పిలుస్తారు.
3. మనకు విరివిగా కనిపిస్తూ ఆరాధింపబడుతున్నవి అనాట్య లింగాలు అంటే ముఖాలు లేనివి.
4. ఒకటి నుండి ఐదు ముఖాలు కలిగినవి 'సర్వ సమ' లింగాలు.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆది దేవుడికి అభిషేకాలూ అర్చనులు జరుగుతాయ్. లింగ రూపంలో కొలువైన శివయ్య నిరంతరం అభిషేకాలు అర్చనలూ అందుకుంటూనే ఉంటాడు. నిత్యం లింగారాధన జరిగే శివాలయాలు ప్రపంచమంతటా అసంఖ్యాకంగా ఉన్నా ఏకముఖి లింగాలు, పంచముఖి లింగాల్ని ప్రతిష్ఠించిన ఆలయాలు చాలా తక్కువే కనిపిస్తాయ్. ఆగమ శాస్త్రాలు, పురాణాల్లో వర్ణించిన విషయాలు, ఆనవాళ్లని బట్టే లింగానికి ఎన్నిముఖాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుపట్టగలిగే అవకాశముంటుంది. పానవట్టానికి పై భాగంలో ఎన్ని ముఖాలుంటే అది అన్ని ముఖాలలింగమౌతుంది. ఒక ముఖం ఉన్న లింగం - ఏకముఖ లింగం. రెండు ముఖాలున్నది - ద్విముఖ లింగం.మూడు ముఖాలున్నది - త్రిముఖ లింగం.నాలుగు ముఖాలున్నది - చతుర్ముఖ లింగం. ఐదు ముఖాలున్నది - పంచముఖ లింగం. నేపాల్లో ఉన్న పశుపతి నాథలింగం పంచముఖలింగం.
ఇవికాక ఆరు ముఖాలు కల్గిన షణ్ముఖ లింగం కూడా ఉంది. కానీ దీని ఆరాధన సంప్రదాయంలో లేదు.నేపాల్ లోని పశుపతినాథ్ ఆలయంలో మూల విరాట్టుకి పానవట్టం పైభాగంలో ఉన్న ముఖాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాతాది ముఖాలతో పరమేశ్వరుడు సకల చరాచర సృష్టిని వీక్షిస్తూ సంరక్షిస్తున్నాడు. తత్పురుషం తూర్పు ముఖంగా, తెల్లని ఛాయతో అవధులు లేక ప్రసరించే శక్తి కలది. ఏకముఖ లింగంగా ఆవిర్భవించింది ఈ తత్పురుషమే. సంప్రదాయంగా ఆలయాల్లో నైఋతి మూలలో ప్రతిష్ఠింపబడే ఈ లింగాన్ని నైఋతి లింగం అని కూడా అంటారు. ఈ లింగారాధన వల్ల రాజ్యాధికారాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. శ్రీకాకుళం వద్ద శ్రీముఖలింగక్షేత్రం కాశీ క్షేత్రాన్ని తలపిస్తుంది.
దక్షిణ భారతదేశంలో ఏకముఖ లింగాలు మూలవిరాట్టుగా పూజింపబడుతున్న దేవాలయాలు అతి కొద్ది మాత్రమే. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుని ఆలయంలో "పెరియ నాయగర్" సన్నిధికి నైఋతి మూలలో అత్యంత రమణీయ ఆకృతిలో లింగాన్ని ప్రతిష్ఠించారు.
చిదంబరంలో కూడా ఏకముఖ లింగాన్ని దర్శించుకోవచ్చు. ఈ లింగానికి బంగారు ముఖముంది. పానవట్టం సహజసిద్ధంగా అమర్చబడింది. సుచీద్రం ధానుమాలయస్వామి ఆలయంలో కూడా ఏకముఖ లింగాన్ని దర్శించుకోవచ్చు. ఈ లింగాన్ని పదకొండు, నూట ఇరవై ఒక్కటి రుద్రాక్షలతో కట్టిన మాలలతో అలంకరించి, బిల్వ దళాలతో అర్చిస్తే ఎనలేని ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత చేకూరుతాయి.
ద్విముఖ లింగం
పానవట్టానికి తూర్పు పడమరలుగా ముఖాలను అమర్చబడినదే ద్విముఖ లింగం. దీనిలో తూర్పు ముఖం తత్పరుషంగాను పడమటి ముఖం సద్యోజాతంగాను పిలువబడుతున్నాయి. దీనిని "మంత్రలింగం" అని కూడా పిలుస్తారు. త్యాగనిరతిగలవారు, ప్రపంచానికి తమని అర్పించుకున్నవారు ఈ లింగాన్ని పూజిస్తారు. వీరశైవులు ఈ లింగాన్ని ప్రత్యేకంగా పూజిస్తుంటారు. ఈ లింగానికి ద్విముఖ రుద్రాక్షమాలతో అలంకరించి, ద్విదళపుష్పాలతో అర్పించినవారు పరమేశ్వరునికి ప్రీతీ పాత్రులౌతారు. ద్విముఖ శివలింగాలు ఇంతవరకు ఎక్కడా తటస్థపడలేదు.
త్రిముఖ లింగాలు
శివలింగానికి పానవట్టభాగంలో తూర్పు, ఉత్తర, దక్షిణలుగా ముఖాలున్న లింగాన్ని త్రిముఖ లింగం, ముమ్ముఖ లింగం అని అంటారు. సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముఖాలను కలిగినది కనుక దీన్ని "త్రిమూర్తి లింగం" అని కూడా పిలుస్తారు. తత్పురుష మణి పిలువబడే తూర్పుముఖం స్వచ్చమైన చిరునవ్వుతోను, వామదేవమని పిలువబడే ఉత్తరముఖం బంగారు ఛాయతోను మందహాసంతోను కనిపిస్తాయి.
ఈవిధమైన త్రిముఖ లింగం దక్షిణాదిలో తమిళనాడులోని దిండివనంలోని 'తిరువాక్కరై' క్షేత్రంలోని చంద్రమౌళీశ్వర ఆలయంలోని మూలవిరాట్టుగా పూజలందుకుంటోంది. ఇటువంటి శివలింగాలు వేరెక్కడా లేవు. ఎలిఫెంట్ గుహల్లో ముమ్మూర్తుల లింగం పెద్ద స్వరూపంగా చెక్కబడి ఉంది. సత్త్వ, రజ, తమో గుణాలకు ప్రతీక అని వర్ణించబడింది. ఎలిఫెంట్ గుహల్లో ఉన్న ప్రతి శిల్పాన్నీ విదేశీయులు ధ్వంసం చేశారు. చరిత్రకారుల విశ్లేషణ ప్రకారం ఆనాటి శిల్పాలు గుహల్లో చతుర్ముఖ, పంచముఖ లింగాలు కూడా చెక్కినట్టు ఆధారాలు ఉన్నాయని, తురుష్కుల దాడిలో ఇవి ధ్వంసమై ఉండొచ్చనివిశ్లేషకుల అభిప్రాయం.
తమిళనాడు ఈరోడ్ ప్రాంతంలోని 'మహిమాలేశ్వర' ఆలయంలో అమర్చబడిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో త్రయంబక లింగం ముమ్మూర్తులుగా ఉండడం చూడవచ్చు. త్రిముఖ లింగాన్ని మూడు వేదాలతో అర్చించి త్రిముఖ రుద్రాక్షమాలతో అలంకరించి, త్రిదళ బిల్వాలతో అర్చించిన వారికి సకల ఐశ్వర్యాలు, శివసన్నిది లభిస్తాయి.
చతుర్ముఖ లింగం
శివలింగం పానవట్టం పైభాగంలో నాలుగు దిక్కులను చూస్తున్న నాలుగు ముఖాలున్న లింగాలను చతుర్ముఖ లింగం అంటారు. ఇటువంటి లింగ ప్రతిష్ఠాపన జరిగిన దేవాలయాలనే 'సర్వతో భద్రాలయం' అని పిలుస్తారు. తమిళనాడు లోని తిరువణ్ణామలై, తిరువానైక్కావల్ క్షేత్రాల్లో ఈ దేవాలయాలు నిర్మించబడ్డాయి. స్వామిసన్నిధికి నాలుగు దిక్కుల్లో ద్వారాలు నిర్మించడం కుదరని పక్షంలో ఒక్కవైపు ద్వారం మూడువైపుల కిటికీలు అమర్చబడ్డాయి.
కాంచీపుర క్షేత్రంలోని కచ్ఛపేశ్వర ఆలయంలో చతుర్ముఖ లింగ సన్నిధి ఉంది. ఈ స్వామి నాలుగు ముఖాల నుండి వేదోద్భవం జరిగింది కనుక దీనిని 'వేదలింగం' అని అంటారు. మన రాష్ట్రంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ సమీపంలో అత్యంత సుందరమైన చతుర్ముఖేశ్వర మూర్తిని దర్శించవచ్చు. దీనిని బ్రహ్మలింగం అని పిలుస్తారు. ఈ స్వామికి చతుర్ముఖ రుద్రాక్షమాలను అర్పించి నాలుగు దళాల బిళ్వ దళాలతో అర్పించిన వారికి అపూర్వమైన జ్ఞానపకశక్తి లభించడమే కాకుండా వీరు ప్రతిభ అష్టదిక్కులకి వ్యాపిస్తుంది.
పంచముఖ లింగం
శివలింగ పానవట్టం పైన నాలుగు దిక్కులా నాలుగు ముఖాలతో పాటు పడమట నున్న తత్పరుషముఖంపైన ఐదవ ముఖం అమర్చబడిందే పంచముఖ లింగం. ఇటువంటి లింగాలు చాలా అపూర్వంగానే కనిపిస్తూంటాయి. తమిళనాడులోని వేలూరులోని 'మార్గసహాయేశ్వర' ఆలయ ప్రాకారంలో ఇటువంటి లింగం ప్రతిష్ఠించబడింది.
మహాకైలాసంలో ఉన్న పంచముఖ శివలింగంలోని ఐదు జుటజుటాల నుండి నిరంతరం గంగ ప్రవహిస్తూ ఉంటుందని శివ రహస్యంలో వర్ణించబడింది. దీనినే 'పంచగంగ' అని అంటారు. అయితే ఊర్ధ్వముఖం నిరాకార పరంజ్యోతికి సంకేతంగా ముఖరహితంగానే ఉంటుందని శాస్త్రోక్తి. అందుకే నాలుగు ముఖాలతోను, పైభాగం శూన్యంగా కేవలం లింగ ఊర్ధ్వభాగంతో ఉంటే అది పంచముఖలింగం గానే గణించాలని సంప్రదాయం. పంచముఖ లింగానికి పంచముఖ రుద్రాక్షలు వేసి, పంచగవ్యాలతో అభిషేకించి, పంచోపచారాలు నిర్వహించి, పంచదళ బిళ్వాలతో అర్చించి, పంచామృతాలు నివేదించి పూజించిన వారికి ప్రపంచం వశమై తలచినదేదైనా నెరవేరుతుంది. పంచ ముఖాల నుండి పంచాగమములు వెలువడడం వల్ల దీని 'పంచాంగమ' లింగం అని కూడా అంటారు.
పైన వర్ణించిన పంచముఖ లింగాలే కాక ఆరవదయిన 'షణ్ముఖలింగం' కూడా ఉంది. ఈ లింగంలో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులు చూస్తుండగా పై ముఖం ఆకాశంలోనికి, ఆరవది నిరంతరం పాతాళానికి చూస్తూ ఉంటాయి. పై ముఖాన్ని 'ఊర్ధ్వముఖమని' క్రింది దాన్ని 'అధోముఖ' అని అంటారు. అదోముఖం జ్ఞానులకు మాత్రమే గోచరిస్తుంది. పరమేశ్వరుడు ఈ షణ్ముఖాలతోపాటు తన త్రినేత్రంలోని అగ్నిని చేర్చి 'సుబ్రహ్మణ్యస్వామిని' సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. క్షీర సాగర మథనం నుండి ఆవిర్భవించిన 'హాలాహలాన్ని' స్వీకరించింది ఈ శ్రీముఖమే. కాబట్టి శ్రీకంఠాన్నే ఆరవ ముఖంగా అర్చిస్తుంటారు. సాధారణంగా ఇటువంటి లింగం ఇంతవరకు ఎక్కడా దర్శనమివ్వలేదు.
సర్వతోముఖమైన పరంజ్యోతి తత్త్వమే శివలింగం. అన్ని దిక్కులనీ పరిశీలించే ఆద్యంత రహిత జ్యోతిర్లింగానికి ముఖాలేమిటి? కారుణ్యవీక్షణాలు, మందహాసం, వేదనాదాల ఊర్పుల నాసిక, అన్ని శబ్దాలను గ్రహించే శ్రవణాలు, శబ్దాన్నిచ్చే నోరు, ఇవన్నీ స్వామి నుండి ప్రసరించే అనుగ్రహాలుగా దర్శించడమే ఈ ముఖలింగాల ఆవిష్కరణలోని ఆంతర్యం. 'విశ్వతశ్చక్షురుత విశ్వతోపాత్' అని విశ్వేశ్వరుని వర్ణించిన వేదమాత, 'దిశాంచ పతయే నమః' అని మహాదేవుడికి నమస్కరించింది.