శివ పార్వతుల నివాసం - మానస సరోవరం
శివ పార్వతుల నివాసం - మానస సరోవరం
సాక్షాత్తు పరమశివుని నివాసం కైలాసం. బ్రహ్మదేవుడు మనస్సంకల్పంతో సృష్టించిన మహాద్భుత సరస్సు మానససరోవరం. భూమండలానికి నాభిస్థానంలో ఉన్నట్లు భావించే కైలాసపర్వతం హిందువులకే కాక, బౌద్ధులకు, జైనులకు, టిబెట్ లో ప్రాచీనమైన 'బొంపో' మతానుయాయులకు కూడా ఇది అతిపవిత్రం, ఆరాధ్యం. మామూలు కళ్ళకు ఇది మట్టిగా కనిపిస్తుంది. కానీ యోగదృష్టితో చూసినవారికి దివ్యశక్తే ఇక్కడ పృథివీ రూపం ధరించిందని తెలుస్తుంది. పరమశివుడు పురుషుడు, పరమేశ్వరి ప్రకృతి అతడు శివుడు, ఆమె శక్తి. ఆ శివశక్తుల భవ్యలీలాక్షేత్రం కైలాసమానససరోవరం. రజకాంతులతో వెలిగిపోయే కైలాస శిఖరం సచ్చిదానందానికి నెలవు. లలితాదేవి కాలి అందెల రవళులలో ఓంకారం, నటరాజు తాండవంలో ఆత్మసారం ధ్వనిస్తుంది.
కల్పవృక్షం ఇక్కడే ఉంటుందని కుబేరుడి నివాసం కూడా ఇక్కడే అని విష్ణుపాదోద్భవ గంగ కైలాసశిఖిరికి చేరి దానిని ప్రదక్షించి అక్కడి నుంచి నాలుగు నదులుగా మారి ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్, కర్మలి నదుల పుట్టుక ఇక్కడే. మానససరోవరంలో మునిగి కైలాసపరిక్రమ చేసినవారికి జన్మరాహిత్యమే అంటారు. శివునిలో లీనమై తామే శివస్వరూపులైపోతారని చెబుతారు. కల్పవృక్షం ఇక్కడే, గంగ భూమిని చేరింది ఇక్కడే ఇటువంటి కైలాస మానస సరోవరం దర్శనం అనేక జన్మల పుణ్యం.
ఒక్కోసారి భయాందోళనలతో ఒడలు జలదరింప చేసే అనుభవాలూ, భక్తిపారవశ్యంతో తనువు పులకరింప జేసే దివ్య అనుభూతుల సమ్మేళనం కైలాస మానస సరోవరయాత్ర ఒక వింత అద్భుతం. ఆధ్యాత్మికతలను అందించే ఒక అద్భుత యాత్ర.
కైలాసశిఖరే రమ్యా పార్వత్యా సహితః ప్రభో
అగస్త్యదేవ దేవేశ మద్భక్త్యా చంద్రశేఖరః
కళ్ళు మూసుకుని శ్లోకాన్ని అంటూ ఉండగా, కైలాస పరవతాన్ని కళ్ళల్లో ఊహించుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చూసేసరికి అదిగో 'కైలాస్' అనడం, మేము కారు దిగిపోవడం ఒక్కసారిగా జరిగాయి. ఎదురుగా అల్లంత దూరాన మౌంట్ కైలాస్ శిఖరం తెల్లగా వెండిపర్వతంలా మెరిసిపోతూ కనిపించింది. 'ఎన్ని జన్మల పుణ్యమో కదా ! పరమేశ్వరా! ఎప్పటి నుంచో వస్తున్న పాపాలు....నీ దర్శన భాగ్యంతో హరించుకుపోతాయి. ఈ అల్పజీవి మీద నీకు ఇంత కరుణ ఎందుకు స్వామి!"
దేవతల అర్ధరాత్రి స్నానాలు
మానససరోవరంలో ప్రతిరోజు అర్దరాత్రి దేవతలు వచ్చి స్నానం చేసి కైలాసంలోని ఈశ్వరున్ని దర్శిస్తారు అని కళ్లకు నక్షత్రరూపంలో మాత్రమే కనిపిస్తారని అంటారు. ఈ సరోవరంలో హంసలు ఉంటాయని అదెంతమాత్రం నిజమో, కాని హంసల్లాంటి పక్షులు ఉన్నాయి. మానససరోవరానికి ఇంకోవైపు రాక్షసతాల్ అనే ఒక సరోవరం ఉంది. ఇక్కడ రాక్షసులు స్నానం చేస్తారని మరెవ్వరూ స్నానం చెయ్యరు అని దీని మధ్యలో చిన్న రాతిగుట్ట మీద రావణాసురుడు శివుని కోసం తపస్సు చేశాడని, కైలాసపర్వతం ఎత్తబోయాడని అంటారు.