రాహుకేతు ప్రభావాలు  తగ్గాలంటే.. శని అమావాస్య రోజు ఇలా చేయండి..!

 

రాహుకేతు ప్రభావాలు  తగ్గాలంటే.. శని అమావాస్య రోజు ఇలా చేయండి..!

 


మార్చి 29 శనివారం శనైశ్చర అమావాస్య అవుతుంది.  ఈ రోజు శనివారం కావడం,  అమావాస్య కావడం,  గ్రహణం కూడా ఉండటం వల్ల ఈ రోజు చాలా ప్రత్యేకత సంతరించుకుంది.  100 ఏళ్ల తరువాత ఇలాంటి రోజు  వస్తోందని పండితులు, జ్యోతిష్క శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  29వ తేదీ శనివారం  మధ్యాహ్నం 02:20 నుండి సాయంత్రం 06:16 వరకు గ్రహణం ఉంటుందట. అయితే  ఇది భారతదేశంలో కనిపించదని అంటున్నారు. ఈ రోజున గ్రహణానికి ముందు కొన్ని పరిహారాలు చేసుకుంటే  రాహువు,  కేతువు ప్రభావాన్ని తగ్గిస్తాయట.


సాధారణంగా గ్రహణం సమయంలో కొన్ని ఆలయాలు తెరచే ఉంటాయి.  ఈ ఆలయాలలో రాహుకేతు పూజలు,  శివ ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల జాతకంలో రాహుకేతు దోషం ఉంటే తొలగిపోతుందని, జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయి ముఖ్యంగా వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయని చెబుతారు.

రాహు,  కేతువులకు పరిహారాలు..

శని అమావాస్య రోజున శని దేవుడిని సరైన పద్ధతిలో పూజించి, నూనె, నల్ల నువ్వులు,   పువ్వులు సమర్పించాలి. అలాగే ఆవ నూనె దీపం వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా రాహువు, కేతువుల దోషం  నుండి ఉపశమనం పొందవచ్చు. దీనితో పాటు, రావి చెట్టు లేదా శమి వృక్షం  ముందు ఆవాల నూనె దీపాన్ని కూడా వెలిగించవచ్చు.

దానం..

రాహువు,  కేతువుల దుష్ప్రభావాల నుండి బయటపడటానికి శని అమావాస్య రోజున నల్ల నువ్వులు, నల్ల బట్టలు, నల్ల దుప్పటి,  మినపప్పు దానం చేయవచ్చు. దీనితో పాటు, ఈ రోజున సప్తధాన్యాన్ని దానం చేయడం ద్వారా మంచి  ప్రయోజనాలను పొందవచ్చు. సప్తధాన్యంలో ఏడు రకాల ధాన్యాలు ఉంటాయి.

శని అమావాస్య రోజు ఇలా  చేయాలి..

శని అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన తర్వాత శివలింగానికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల రాహువు చెడు ప్రభావం అలా చేసిన వారిపై పడదు. దీనితో పాటు కుక్కలకు రొట్టెలు  తినిపించాలి. ఇది కేతువు యొక్క ప్రతికూల ప్రభావాలను వదిలించుకోవడానికి  సహాయపడుతుంది.

మంత్ర జపం..

శని అమావాస్య రోజు శని దేవుడికి,  రాహువు బీజ మంత్రం,  కేతువు బీజ మంత్రం మొదలైనవి జపం చేయాలి.  ఇలా జపం చేయడం వల్ల ఆయా గ్రహాల వల్ల కలిగే దోషాలు అంతం  అవుతాయి.  కుదిరిన వారు ప్రముఖ ఆలయాలలో పూజలు కూడా చేయించుకోవచ్చు.


                                      *రూపశ్రీ