స్వతంత్ర పోరాటం చేసిన సద్గురువు!
స్వతంత్ర పోరాటం చేసిన సద్గురువు!
ఆధ్యాత్మికత అంటే లోకం నుంచి పారిపోవడం కాదు, లోకంలో తన పాత్రను నిర్వహిస్తూనే మోక్షాన్ని సాధించడం అని భారతీయులకు తెలుసు. అందుకే మన దేశ చరిత్రలోని ప్రతి మలుపులోనూ సాధుసన్యాసుల పాత్ర కనిపిస్తుంది. ప్రతి దశలోనూ భగవన్నామ స్మరణ వినిపిస్తుంది. భక్తి మనల్ని బలహీనురిగా చేయలేదు సరికదా, ఎప్పటికప్పుడు జీవితాన్ని ఎదుర్కొనే బలాన్ని అందించింది. ఒక వర్గానికి ఆధ్యాత్మిక గురువుగా ఉంటూనే భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ఒక మలుపు తిప్పిన ‘సద్గురు రామ్ సింగ్‌జీ’నే ఇందుకు గొప్ప ఉదహరణ!
రామ్ సింగ్ 1816లో పంజాబులోని లుధియానా జిల్లాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే మతగ్రంథాలంటే విపరీతమైన ఆసక్తి ఉన్న రామ్ సింగ్ సిక్కు మతానికి చెందిన ఆధ్యాత్మిక జ్ఞానాన్నంతా సాధించారు. రామ్ సింగ్‌కి యుక్తవయసు వచ్చేసరికి పంజాబు మహారాజు రంజిత్ సింగుకీ ఆంగ్లేయులకీ తీవ్రమైన యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో తాను కూడా పాల్గొన్నారు రామ్ సింగ్. అక్కడే ఆయనకు ‘బాబా బాలక్ సింగ్’ అనే గురువుగారు కనిపించారు. బాలక్ సింగ్ ప్రేరణతో రామ్ సింగ్ పూర్తిగా ఆధ్యాత్మికత వైపు మళ్లిపోయారు. బాలక్ సింగ్ బోధల ఆధారంగా సిక్కు మతంలో ‘నామ్‌ధారీ’ అనే కొత్త సంప్రదాయాన్ని స్థాపించారు రామ్ సింగ్.
నామ్‌ధారీ సంప్రదాయాన్ని క్రమంగా ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు. తమ సంప్రదాయంలోకి వస్తున్న శిష్యులలో అన్ని రకాల సాంఘిక దురాచారాలనూ రూపుమాపేందుకు రాం సింగ్ ప్రయత్నించేవారు. ఆడపిల్లలని తక్కువగా చూడటం, వారిని పెళ్లి చేసుకునేందుకు కట్నాన్ని ఆశించడం, పెళ్లిళ్లను ఘనంగా చేసే నెపంతో దివాళా తీయడం వంటి ప్రవర్తనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఇలాంటి దురలవాట్లకు విరుగుడుగా ఆయన ‘ఆనంద్ కారజ్’ పేరుతో సామూహిక వివాహాలను నిర్వహించేవారు. ‘కులాంతర వివాహం’ అన్న మాట పలకడమే పాపమైన రోజులలో ఆయన 1863లోనే సామూహిక కులాంతర వివాహాలను సైతం జరిపించారు.
1860ల నాటికి మన దేశం మీద బ్రిటిష్ ఆధిపత్యం చాలా తీవ్రంగా ఉంది. ప్రజలు కూడా ‘మన ఖర్మ ఇంతే!’ అనుకుని రాజీ పడిపోతున్న పరిస్థితులు అవి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా ఆవిర్భవించనేలేదు. అలాంటి సమయంలోనే రాం సింగ్‌జీ బ్రిటిష్‌వారి మీద యుద్ధాన్ని ప్రకటించారు. ఆంగ్లేయుల నౌకరీలనీ, విద్యనీ, వస్తువులనీ, చట్టాన్నీ బహిష్కరించాలన్న పిలుపుని ఇచ్చారు. రాం సింగ్ సూచించిన ఈ బహిష్కరణ విధానాన్నే గాంధీ 50 ఏళ్ల తరువాత అమలుపరచి విజయం సాధించారు. ఏదో కొన్ని మాటలు చెప్పడం, మరికొన్ని కార్యక్రమాలను చేపట్టడంతో ఊరుకోలేదు రాం సింగ్! అవసరమైతే దేశానికి రక్షణగా నిలిచేందుకు ఒక సైనిక దళాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ దళానికి నేపాల్, రష్యా, ఆఫ్గనిస్థాన్ వంటి దేశాలతో సత్సంబంధాలు ఉండేవి.
నామ్‌ధారీల సంఖ్య, వారిలోని స్వాతంత్ర్య కాంక్ష నానాటికీ పెరిగిపోతుండ టంతో ఆంగ్లేయులకి ముచ్చెమటలు పోశాయి. నామ్‌ధారీలని వేధించడం, కనిపించిన చోటల్లా దాడి చేయడం మొదలుపెట్టారు పాలకులు. అలాంటి ఒక సందర్భంలో ‘మలేర్‌కోట్ల’ అనే ప్రదేశంలో నామ్‌ధారీలకీ, బ్రిటిష్ సైనికులకీ మధ్య ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఆ గొడవకి కారణమైన కొందరు నామ్‌ధారీలు స్వచ్ఛందంగా లొంగిపోవడంతో, వారిని ఫిరింగులకి కట్టేసి చంపమని ఆదేశించారు అధికారులు. ‘మమ్మల్ని కట్టేయాల్సిన పనిలేదు, వరుస ప్రకారం మేమే వచ్చి ఫిరంగికి ఎదురుగా నిల్చుంటాం’ అన్నారు నామ్‌ధారీలు. ‘అయితే సరే! మీ అంతట మీరు నిల్చోవాలంటే భయంగా ఉంటుంది కాబట్టి వెనక్కి తిరిగి నిల్చోండి’ అన్నాడు ఆంగ్లేయ అధికారి. ‘ఫిరంగికైనా వెన్ను చూపే సమస్యే లేదు! ఫిరంగికి ఎదురుగా మా ఛాతీని నిలిపి ఉంచుతాం’ అన్నారు నామ్‌ధారీలు. అలా 7 ఫిరంగులకు 7గురు చొప్పున 49 మంది నామ్‌ధారీలు తమ ప్రాణాలను విడిచారు. మర్నాడు మరో 16 మంది నామ్‌ధారీలను కూడా ఇదే విధంగా చంపేశారు.
‘మలేర్‌కోట్ల’ సంఘటన తరువాత ఆంగ్లేయులు నామ్‌ధారీల మీద ఉక్కుపాదాన్ని మోపారు. దొరికినవారిని దొరికనట్లు ఖైదు చేయండం, వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం చేశారు. అయినా నామ్‌ధారీలు వెనుకడుగు వేయలేదు. రామ్ సింగ్‌ని కూడా ఖైదుచేసి బర్మాకు తరలించారు. అక్కడే ఆయన చనిపోయారని చెబుతారు. కానీ రామ్ సింగ్ చనిపోయారంటే మాత్రం ఆయన శిష్యలు నమ్మరు. రామ్ సింగ్ ఇంకా జీవించే ఉన్నారనీ, ఆయన ఆశీస్సులు తమను కాపాడుతూనే ఉంటాయనీ అంటారు. రామ్ సింగ్ కనిపించకుండా పోయినా కూడా నామ్‌ధారీలు ఆయన ఆశయాన్ని విడువలేదు. కాంగ్రెస్‌తో కలిసి స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. నేతాజీ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ని స్థాపిస్తే అందులోనూ వారు భాగస్వాములయ్యారు. అందుకే నేతాజీ, నెహ్రూ వంటి నేతలకు నామ్‌ధారీలన్నా, రామ్ సింగ్ అన్నా చెప్పలేనంత గౌరవం ఉండేది. ‘రాం సింగ్’ చనిపోయారో లేదో కానీ, ఆయనలోని ఆశయాలు మాత్రం ఎప్పటికీ ఈ దేశంలో నిలిచే ఉంటాయేమో!
- నిర్జర.