ఏకశరణధర్మం గురించి విన్నారా!

 

ఏకశరణధర్మం గురించి విన్నారా!

 

 

హిందూమతం అనగానే వందలాది క్రతువులు, వేలాది దేవతలు, వర్ణాశ్రమ ధర్మాలు... అన్నీ ఒక్కసారిగా గుర్తుకువస్తాయి. ఇవన్నీ హిందూమతంలో భాగమేనని కొందరు వాటిని అనుసరిస్తూ ఉంటారు. మరికొందరేమో భగవంతుని చేరుకునేందుకు ఇవన్నీ ఎందుకంటూ పట్టించుకోకుండా సాగిపోతుంటారు. మనసులో భక్తి, భగవంతుని పట్ల ఆర్తి ఉంటే చాలు.... అంటూ తమదైన శైలిలో భగవంతుని పూజిస్తుంటారు. అలాంటివారి కోసం ఉద్భవించిన ఒక శాఖే ‘ఏకశరణ ధర్మ’. అసోంలో ఇప్పటికీ కనిపించే ఈ ధర్మం గురించి కొన్ని విశేషాలు..

 

హిందూమతాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడానికీ, జైనం వంటి మతాల ప్రాభవానికి తట్టుకుని నిలబడటానికీ... 15వ శతాబ్దం నాటికి భారతదేశంలో భక్తి ఉద్యమం ఊపందుకుంది. మతమంటే క్రతువులు మాత్రమే కాదనీ, దేవుడు అంటే దేవాలయాలలో మాత్రమే ఉండడనీ చెబుతూ వేర్వేరు గురువులు ప్రజలలో భగవంతుని పట్ల భక్తిని తిరిగి పాదుకొల్పారు. భగవంతునీ, భక్తునీ అనుసంధానం చేసేందుకు వారు శ్రవణం, స్మరణం, కీర్తనం... వంటి నవవిధ భక్తులను ప్రచారంలోకి తీసుకువచ్చారు. అదే సమయంలో అసోంలో ‘శంకరదేవ్‌’ అనే గొప్ప భక్తుడు అక్కడి భక్తి ఉద్యమానికి ఓ కొత్త ఊపునీ, రూపునీ తీసుకువచ్చాడు. అదే ఏకశరణ ధర్మ!

 

 

ఏకశరణ ధర్మంలో భగవన్నామస్మరణకే అధిక ప్రాధాన్యత. ఏ కులంవారైనా గానీ, ఎంతటివారైనా గానీ.... నిరంతరం ఆ కృష్ణుని స్మరించుకుంటే చాలు. ఇందుకోసం వేరే ఏ క్రతువూ అవసరం లేదు. వర్ణాశ్రమ ధర్మాలను పాటించవలసిన అవసరం అసలే లేదు. ఏకశరణ ధర్మంలో కులాల ప్రసక్తి లేనేలేదు. పైగా ఏకశరణధర్మలో భగవంతుడు కూడా ఒక్కరే- కృష్ణుడే ఆ భగవంతుడు! శంకరదేవుల ప్రకారం కృష్ణుడు ఒక అవతారం కాదు. ఒక పరిపూర్ణమైన దైవం. బహుశా వేర్వేరు దేవతలకు ఆస్కారం ఇవ్వకుండా ఆయన ఈ ఆలోచనని చేసి ఉంటారు. అందుకే ఏకశరణధర్మలో కృష్ణుని పక్కన కనీసం రాధ కూడా ఉండదు. కేవలం హరి ఒక్కరికే అధికమైన, అంతిమమైన ప్రాధాన్యత. అందుకనే ఈ ధర్మాన్ని ‘ఏకశరణ హరినామ ధర్మం’ అని కూడా పిలవడం కద్దు.

 

శంకర్‌దేవ్‌ ప్రకారం భగవంతుడు నిర్గుణుడే! కానీ ఆయన సగుణమైన రూపమే నారాయణుడు. ఆయనే కృష్ణుడు. సృష్టించేవాడు, ఆ సృష్టిని నడిపించేవాడు రెండూ ఆయనే. జీవుడిని ఆవహించి ఉన్న మాయ వలన ఈ పరమసత్యాన్ని తెలుసుకోలేకపోతుంటాడు. కానీ ఎప్పుడైతే ఆ మాయని అతను ఛేదించగలుగుతాడో, అప్పుడు తానే ఆ పరబ్రహ్మ(కృష్ణుడు) అని తెలుసుకోగలుగుతాడు. నిత్యం భగవన్నామస్మరణ చేయడం వల్లనే, భక్తుడు సులభతరంగా మాయని ఛేదించగలుగుతాడు. ఏకశరణధర్మం నాలుగు పాదాల మీద ఆధారపడి ఉంది. అవి- గురువు, దైవం, నామం, భక్తుడు.

 

నిరంతర యుద్ధాల వల్లా, వేర్వేరు మతాల తాకిడి వల్లా, కట్టుదిట్టమైన ఆచారాల వల్లా... ఆసోంలో హిందూమతానికి నిదానంగా దూరమవుతున్న సామాన్య ప్రజలందరూ కూడా శంకర్‌దేవ్‌ ఏకశరణధర్మాన్ని ప్రతిపాదించిన తరువాత కృష్ణునికి దగ్గరకావడం మొదలుపెట్టారు. శంకర్‌దేవ్‌, ఆ తరువాత ఆయన ముఖ్యశిష్యుడు మాధవ్‌దేవ్ ఉన్నంతకాలమూ ఈ శాఖ అసోంలో చాలా ప్రబలంగా ఉండింది. కానీ ఆ తరువాత శాఖ కాస్తా శాఖోపశాఖలై.... ఎవరికి వారు తమకు తోచిన రీతిలో ఏకశరణధర్మాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అసోంలో అక్కడక్కడా ఏదో ఓ శాఖ నీడన ఏకశరణధర్మాన్ని ఆచరించేవారు కనిపిస్తూనే ఉంటారు.

- నిర్జర.