సర్వం శివోహం
సర్వం శివోహం
భగవంతుడికి భక్తుడికి మధ్య వారధిగా శబ్దం పనిచేస్తుంది. ఈ సృష్టిలో శబ్దానికే మూలం ఓంకారం అంటారు. గాలి రెపరెపలు, కొమ్మల ఊయల్లో కిర్రుమనే చలనం, దిక్కుల మూలల్లో నుండి వినిపించే మోత, కదిలే జలం లో శబ్దం ఇలా ప్రకృతితో మిలితమైన ప్రతి ధ్వని లో ఓంకారం ఉంటుంది. అయితే భక్తితోనే ఆ శబ్ద సౌందర్యాన్ని ఆస్వాదించగలం. అది విన గలిగినవారు కోపాన్ని, ద్వేషాన్ని దగ్గరకు రానివ్వరు. అయితే చిత్తశుద్ధి,ఆత్మశుద్ది లేకుండా విశ్వము అంతరంలో ఉన్న ఓంకారాన్ని వినలేవు. అందుకే పరమేశ్వరుడి యొక్క నామం పట్టుకోవాలి. సర్వ కాల సమయాలలో ధర్మాన్ని పఠించి అనుసరించి క్రమశిక్షణ కలిగిన జీవితం గడపాలి. నీవు స్మరించే ఆ సర్వేశ్వరుడి నామమే ఓంకారమై నీ మనో ఫలకంపై జ్ఞాన అక్షరాలను దిదిస్తుంది. మనసుకి శాంతం కలిగి ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా అధైర్య పడకుండా ముందుకు నడిపిస్తుంది.
ఆ భగవంతున్ని పలికే ప్రతి నామంలో ఒక విద్యుత్ ప్రవాహం ఉంటుంది. అదే ఎల్ల వేళలా మనల్ని రక్షిస్తుంది. మంత్రంతో స్మరించు, గానంతో స్మరించు, గంటతో అర్ధించు ,భజనతో కీర్తించు చాలు. నిత్యం నిన్నే చుట్టేసుకుంటాడు ఆ మహేశ్వరుడు.
శివ సహస్రనామంలో వేయి నామాలున్నాయి. శివ శబ్దానికి 48 పర్యాయపదలున్నాయి.
శంభు రీశ: పశుపతి: శివ: శూలీ: మహేశ్వర: భూతేశ: ఖండ పరశు: గిరీశో గిరిశోమృడ: ఈశ్వర: శర్వ ఈశాన: శంకర: చంద్రశేఖర: మృత్యుంజయ: కృత్తివాసా; పినాకీ ప్రమధాదిప: ఉగ్ర: కపర్దీ శ్రీకంఘ: శితి కంఠ: కపాలభృత్
వామదేవో మహాదేవ: విరూపాక్ష: త్రిలోచన:
కృతానురేతా: సర్వజ్ఞో ధూర్జటి: నీలలోహిత
స్మరహరో, భర్గ: త్ర్యబకం త్రిపురాంతక:
గంగాధరోంధకరిపు: క్రతుధ్వంసీవృషధ్వజ:
వ్యోమకేశ: భవోభీమ: స్థాణు: రుద్ర ఉమాపతి:
శివుడు ఎప్పుడు మంగళకారుడుగా ఉంటాడో, అప్పుడు ‘శంకరుడు’ అనబడుతున్నాడు. ప్రాణులకు రక్షణ కలిగించేటపుడు రక్షకుడు అనబడుతున్నాడు. ఎప్పుడు పర్వతేశుడో అప్పుడు గిరీశాఅని, కైలాసంలో ఉన్నప్పుడు గిరీశ: అని పిలుస్తారు. సంహారం కావిస్తున్నప్పుడు రుద్రుడని పిలువబడుతున్నాడు. ఇలా శివ నామానికి పర్యాయపదాలు ఉన్నాయి. ఆ స్వామిని ఏ పేరుతో పిలిచినా తన భక్తులను కాపాడుతుంటాడు.
◆ వెంకటేష్ పువ్వాడ