హరహర మహాదేవ శంభో శంకర!!
హరహర మహాదేవ శంభో శంకర!!
హిందూ సంప్రదాయంలో ఉన్న మానసిక ప్రశాంతత ఎంతో గొప్పది. నిజానికి సమాజం, వైజ్ఞానిక వేత్తలు, నాస్తికులు అందరూ దేవుడు, దైవం, భక్తి అనేదాన్ని కొట్టి పడేస్తారు కానీ దేవుడు, భక్తిలో అంతరార్థం పూర్తిగా తెలిస్తే ఎవ్వరూ వీటిని ఎగతాళి చేయరు.
త్రిమూర్తులు ఈ సృష్టిని నడిపిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యాన్ని నిర్వహిస్తుంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మయాజాలమే ఈ ప్రపంచం. అందులో లయకారుడు శివుడి గూర్చి ఎంత చెప్పుకున్నా, ఎంత తెలుసుకున్నా తనివితీరదు. హిందూ పంచాంగంలో మాఘమాసం, కార్తీకమాసం శివుడికి ఎంతో ప్రత్యేకమైనవి. యావత్ భారతంలో ఉన్న ఎన్నో శివాలయాలలో శివుడి నామస్మరణ మార్మోగిపోతూ ఓంకార వాణిలో తరించిపోతూ హిమగిరులలో ఉన్న కైలాసం భూలోకమంతా వ్యాపించిపోయిన భావన కలిగించి ఆ పరమశివుడి అడుగులు ఇక్కడే ఉన్నంత ఆనందాన్ని కలిగిస్తుంది.
అలాంటి సందర్భమే ఇప్పుడూ వచ్చింది. కార్తీకమాసం దీపాల కన్నుల పండుగ చేయడానికి కదలివచ్చింది. ఆధ్యాత్మికతకు మూలకారణమైన ఆ పరమేశ్వరుడి ధ్యాన స్వరూపాన్ని మనసు నిండా నింపుకుంటూ పంచాక్షరీ మంత్రమైన "ఓం నమః శివాయ" ను ఉచ్చరిస్తూ మానసిక ప్రశాంతతలో ఒదిగిపోవడానికి, ఆ భోళాశంకరుడి కరుణకు పాత్రులయ్యే సందర్భం ఇదే మరి!!
హరిహారులు అంటే ఆ విష్ణువు మరియు పరమేశ్వరుడు అని అందరికి తెలిసినదే. ఈ కార్తీక మాసం ఈ హరిహారులకు ఎంతో ఇష్టమైన మాసం. ఈ మాసంలో భక్తి, ఆ భక్తి నిండిన హృదయంతో చేసే పూజ, ఆ పూజ ద్వారా దక్కే పుణ్యఫలం, ఆ పుణ్యం తాలూకూ ప్రభావం మనిషి చెడు కర్మ పాపాన్ని కడిగివేస్తుందని పురాణ కథనాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి ఇంటి ముంగిలిలో వెలిగే దీపాలు, ప్రతి శివాలయంలో కళకళలాడే ముగ్గుల ఆకారాల్లో మెరిసే దీపాల వరుసలు ఆధ్యాత్మిక మరియు ఆశావహ జీవితాలను గోచరిస్తాయి.
శివుడి ఆకారం, ఆయన తత్వం, ఆయన తీరు అంతా ప్రతి మనిషికి సందేశాన్ని ఇచ్చే గొప్ప మార్గం అని చెప్పవచ్చు.
ఆయన అలంకారాలు చేసుకొడు, అవన్నీ వ్యర్థమైనవే అని, ఎంత అలంకరణ చేసుకున్న అది కొన్ని గంటల్లోనో, కొన్ని రోజుల్లోనో పోయేదే, అలా పోగానే మళ్ళీ అలంకరణ, మళ్ళీ శరీరం మీద తాపత్రయం, అలా అలంకరణ చేసుకుని ఇతరులను చూసి బేరీజు వేసుకుని మళ్ళీ ఏవో హెచ్చు తగ్గుల చిట్టా తయారు చేసుకుని ఇదే మనిషి ప్రస్తుతం చేస్తున్నది. వాటి వల్ల ప్రయోజనం ఏమిటి అనిపించదూ ఇదంతా అవగాహనకు వస్తే. శివుడు స్మశానంలో ఉంటాడు. మనిషి పుట్టినప్పటి నుండి చచ్చేవరకె అందరి తోడూ, అందరి ప్రేమలు, అందరి తహతహలు చివరకు మనిషి మట్టిలో కలవడమో లేదా కాలి బూడిద అవ్వడమో ఇదే జరిగేది. అప్పుడు ఆ స్మశానంలోనే ఉండాల్సింది అని చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తుంది.
శివుడు బూడిద పూసుకుంటాడు. మనిషి చివరకు బూడిదే అవుతాడు. ఈ శరీరం చివరకు బూడిదే, దాని మీద వ్యామోహం వద్దు అని అన్నట్టు. పాములు మెడలో వేసుకుంటాడు. ఆ పాములు మనిషిని వెంటాడే అరిషడ్వర్గాలు. వాటిని అదుపులో పెట్టుకోవాలని చెప్పడమే అన్నట్టు. ఇక శివుడికి మూడవ కన్ను ఉంటుంది అది తెరిస్తే అంతా ప్రళయమే అంటారు. మనిషికి కూడా మూడవ కన్ను ఉంటుంది అదే జ్ఞాన నేత్రం. మనిషికి అంతర్గతంగా బయటకు కనిపించనిది, కేవలం ఆత్మ ద్వారా అవగాహన ద్వారా మాత్రమే తెరవగలిగినది అది. దాన్ని తెలుసుకున్నవాడు, దాన్ని అనుభూతి చెందేవాడు ఇక ఈ భౌతికదేహానికి అతీతంగా అంతర్గత ప్రపంచంలో, పరమానందంతో జీవిస్తాడు.
ఇదే శివ తత్వం, ఇదే శంకరుడి వెనుక చిద్విలాసాభరితమైన సందేశం. ఇప్పుడు శంకరుడి కరుణకు పాత్రులవ్వండి హారహార మహాదేవ అని భక్తిపూర్వకంగా స్మరించండి.
◆ వెంకటేష్ పువ్వాడ