ఇంతకీ సప్తర్షులు ఎవరు!
ఇంతకీ సప్తర్షులు ఎవరు!
చిమ్మచీకటి రోజున ఆకాశంలోకి చూసినప్పుడు ఒక ప్రశ్నార్థకంలా కనిపించే నక్షత్ర సమూహమే... సప్తర్షి మండలం. సప్తర్ష మండలం మనకి కొత్త కాదు. తల పైకెత్తి పరిశీలించినప్పుడల్లా కనిపించేదే. అందులో ఉండేవి కేవలం నక్షత్రాలు మాత్రమే కాదనీ... మహారుషులే అలా తారారూపంలో సంచరిస్తున్నారనీ మన నమ్మకం. మరైతే ఆ సప్తర్షులు ఎవరు.. వారి పేర్లు ఏమిటి అని తెలుసుకోవడం కూడా ఆసక్తికరమే కదా!
సప్తర్షుల పేర్లు ఏమిటి అని ఖచ్చితంగా చెప్పడం అంత తేలికైని విషయం కాదు. ఎందుకంటే వేర్వేరు పురాణ గ్రంథాలలో వేర్వేరు సప్తర్షులు కనిపిస్తారు. బృహదారణ్యకంలో, వేదాలలో, మహాభారతంలో... ఇలా ఒకో ప్రమాణం ప్రకారం వారి పేర్లు మారుతూ కనిపిస్తాయి. అంతేకాదు వేర్వేరు మన్వంతరాలలో కూడా వీరి పేర్లు వేర్వేరుగా కనిపిస్తాయి. దీనిని బట్టి సప్తర్షి అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదనీ, అది ఒక హోదా అని భావించవచ్చునేమో. కాలానుగుణంగా ఈ హోదాను వేర్వేరు రుషులు దక్కించుకుంటూ ఉండవచ్చు. కేవలం హైందవ మతంలోనే కాదు... హైందవం ఆధారంగా వచ్చిన సిక్కు, జైన మతాలలో కూడా ఈ సప్త రుషులు ప్రస్తావన కనిపిస్తుంది. మహాభారతం మనకు ఇటీవలి ప్రమాణం కాబట్టి ఇందులో ఉన్న పేర్లను ప్రస్తుతానికి ఉన్న సప్తర్షులుగా భావించవచ్చు. వీరు... మరీచి, అత్రి, అంగీరసు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు.
సప్తర్షి జాబితాలో ఉన్నవారంతా అసాధారణమైనవారే! తమ పేరుతో ఒక గోత్రాన్ని స్థాపించినవారే! విద్యాదాతలుగా, జ్ఞానప్రదాతలుగా, హోమద్రవ్యాలను స్వీకరించేవారుగా వీరికి గొప్ప పేరు. అయితే వీరందరూ కూడా గృహస్థులే కావడం విశేషం! ఒకో రుషి కుటుంబాన్ని కనుక గమనిస్తే అందులో పురాణ పాత్రలు చాలానే కనిపిస్తాయి. రామాయణంలో ముఖ్య పాత్ర అయిన రావణాసురుడు సాక్షాత్తూ పులస్త్యుని మనవడు. మహాపతివ్రతగా పేరొందిన అనసూయ అత్రిమహాముని భార్య.
ఒకవైపు నడి సముద్రం, చుట్టూ చిమ్మచీకటి... ఇలాంటి సందర్భంలో మన పెద్దలకు సప్తర్షి మండలం ఒక దారిని చూపించే సాధనంగా ఉండేది. సముద్రం నుంచి ఎడారి వరకూ బాటసారులకు గమ్యం వైపు నడిపించేది. ఆఖరికి ప్రళయకాలంలో సత్యవ్రతుడనే రాజు సకల జీవరాశులను పడవలోకి చేర్చినప్పుడు, అతనికి దారి చూపింది కూడా సప్తర్షి మండలమే అని చెబుతారు. బహుశా అందుకనే ఆ నక్షత్రమండలానికి సప్తర్షి హోదాను కట్టబెట్టి ఉండవచ్చు. కేవలం భారతీయులకే కాదు! పాశ్చాత్యులు కూడా ఈ సప్తర్షి మండలాన్ని ‘బిగ్ డిప్పర్’ పేరుతో పిలుచుకుంటారు. ఉత్తరఖగోళార్ధంలో సంవత్సరం పొడవునా కనిపించే ఈ బిగ్ డిప్పర్, నౌనాయానం ద్వారా మన నాగరికత ముందుకు సాగడానికి తోడ్పడింది.
సప్తర్షి మండలం అనగానే మనకు గుర్తుకువచ్చే మరో విషయం... అరుంధతీ నక్షత్రం! తన భర్త వశిష్ఠుని అడుగుజాడల్లో నడిచే అరుంధతి నక్షత్రం ఆయనతో పాటుగానే సప్తర్షి మండలంలో భాగమైందని విశ్వాసం. అందకనే పెళ్లయిన నూతన వధువుకు, అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటారు. అలా భర్తను నిత్యం అనుసరించే అరుంధతి, ఆమెను అంత ఎత్తున నిలబెట్టిన వశిష్ఠులు సప్తర్షి గణంలో ఒక భాగమైపోయారు.
- నిర్జర.