రాగి నీటితో రోగాలు దూరం!

 

రాగి నీటితో రోగాలు దూరం!

 

 

రాగి లోహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. ప్రకృతిలో స్వచ్ఛంగా దొరికే రాగిని వేల సంవత్సరాల నుంచి మన జీవితంలో వాడుతూనే ఉన్నాం. నాగరికత పెరిగిన దగ్గర్నుంచీ రాగి వాడకం కూడా పెరిగిందే కానీ తగ్గనేలేదు. విద్యుత్తుని ప్రసారం చేసేందుకు రాగికి ఉన్న ప్రత్యేకతను గమనించిన శాస్త్రవేత్తలు రాగితోనే మన జీవితాలలో వెలుగులు నింపారు. రాగి పాత్రలో కనుక నీటిని నిల్వ చేస్తే ఆ నీటిలో ఉన్న ఆక్సిజన్‌తో రాగి ప్రతిచర్య జరుపుతుందన్న విషయం తెలిసిందే! అయితే ఈ ప్రతిచర్య వల్ల నీటి గుణం సైతం మారిపోతుందన్నది మన పెద్దల నమ్మకం. దానికి అనుగుణంగానే రాగి పాత్రలో ఉంచిన నీటి రంగు, రుచి, వాసనలో తేడాని రావడం గమనించవచ్చు. పైగా రాగి మన శరీరానికి కావల్సిన ముఖ్య ధాతువు. అలా రాగి పాత్రలో నిలువ చేసిన నీటి ద్వారా మన శరీరానికి అవసరమ్యే ఖనిజం అందడమే కాకుండా, రాగి వల్ల ప్రభావితమైన నీటి వల్ల అనేక రకాల మేలు కలుగుతుందంటోంది ఆయుర్వేదం!


- రాత్రిపూట రాగి పాత్రలో నీటిని ఉంచి పరగడుపున తాగమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఖాళీ కడుపుతో ఇలా తామ్రజలాన్ని సేవించడం వల్ల అందులోని ఔషధి గుణాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. తామ్ర జలానికి త్రిదోషాలనూ (పిత్తం, వాతం, కఫం) పరిహరించే గుణం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. ఈ త్రిదోషాలూ కనుక సమతుల్యంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లే!


- రాగి పాత్రలో కనుక నీటిని నిల్వ చేస్తే అందులోని హానికారక క్రిములు చనిపోతాయని అంటారు. మనకి వచ్చే వ్యాధులలో అధికశాతం నీటి ద్వారానే దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి... రాగి నీరు జాండీస్‌, డయేరియా వంటి వ్యాధుల బారినపడకుండా కాపాడే అవకాశం భేషుగ్గా ఉంది.


 - జీర్ణ శక్తికి తోడ్పడటంలోనూ, శరీరంలో ఉన్న మలినాలను తొలగించడంలోనూ రాగి నీరు అత్యంత ప్రభావవంతమని ఆయుర్వేదం చెబుతోంది. ఎసిడిటీ, అల్సర్‌ వంటి జీర్ణ సంబంధ వ్యాధులలో కూడా ఇది ఉపశమనాన్ని అందిస్తుందట.


- బరువు తగ్గాలనుకునేవారికి రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగమంటూ పెద్దలు సలహా ఇస్తుంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణ శక్తి ఎలాగూ చురుగ్గా ఉంటుందని తెలుసుకున్నాము. పైగా కొవ్వు కణాలను సైతం విడగొట్టే శక్తి రాగి నీటికి ఉందట.


- రాగినీటి వల్ల మెలనిన్‌ ఉత్పత్తి మెరుగుపడుతుందని తెలిసింది. దీని వల్ల మన చర్మం, కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. జుత్తు తెల్లబడే సమస్య ఉండదు. జుత్తు తెల్లబడడం మాట అటుంచి, రాగి నీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వృద్ధాప్యం మన దరి చేరదంటున్నారు.


- రాగి నీటిని తాగడం వల్ల శరీరంలో ఇనుముని శోషించుకునే గుణంలో కూడా మార్పు వస్తుందట. దీని వల్ల రక్త హీనత నుంచి తేలికగా బయటపడవచ్చు.


- రాగినీటి ద్వారా మన శరీరానికి అందే ‘ఫాస్పోలిపిడ్స్‌’ మెదుడు పనితీరుని మెరుగుపరుస్తాయి. మెదడులోని సమాచార వ్యవస్థకు, జ్ఞాపకశక్తికి ఇవి దోహదపడతాయి. మూర్ఛ వ్యాధి ఉన్నవారిలో ఆరోగ్యం మెరుగుపడేందుకు సాయపడతాయి.


- రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండెజబ్బుల విషయంలో రాగి గొప్ప ఫలితాన్నిస్తుందని అమెరికన్‌ కేన్సర్‌ సొసైటీ సైతం తేల్చి చెప్పింది. గుండెపోటు, ఊబకాయం, చక్కెర వ్యాధులను తీవ్రతరం చేసే ట్రైగ్లిజరైడ్స్‌ అనే కొవ్వు పదార్ధాలను సైతం రాగి నీరు నియంత్రిస్తుందని తేలింది.


ఇలా చెప్పుకుంటూ పోతే రాగినీటితో ప్రయోజనాలు చాలానే కనిపిస్తాయి. కీళ్లనొప్పులు మొదల్కొని థైరాయిడ్‌ వరకూ ఎన్నో ఆరోగ్య సమస్యలలో రాగి నీరు ప్రభావవంతంగా పనిచేస్తుందని సనాతన వైద్యం చెబుతోంది. అయితే రాగి పాత్రను శుభ్రంగా తోమకుంటే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. అపరిశుభ్రమైన రాగి పాత్ర మీద పేరుకునే క్రియులు వాంతులు, విరేచనాలకు దారి తీయవచ్చు. అలాగే తాగమన్నారు కదా అని అవసరానికి మించి రాగి నీటిని పట్టించినా, మన శరీరంలో మోతాదుకి మించి రాగి పేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

- నిర్జర.