గంధం ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా
గంధం ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?
చందన చర్చ భోగ ప్రదమూ, శుభప్రదమూ, ఆరోగ్య ప్రదమూ, ఆహ్లాదకరమూ, అధ్యాత్మికమూ కూడా. ఈ చందన చర్చ భారతీయులకే చెందిన ఒక వైభవం. ఎవరినైనా గౌరవించటానికి చందన చర్చ చేయటం మన సంప్రదాయంలో అంతర్భాగం. పెళ్లిళ్లలో పేరంటాలలో అతిథులను గౌరవించటానికి చందనమలదుతారు వచ్చిన వారందరికి – ఆడ మగ అనే భేదం లేకుండా. స్త్రీలకి మెడ భాగానికి, పురుషులకి అర చేతుల వెనుక భాగానికి మంచి గంధం పూయటం ఈ నాటికీ నిలిచి ఉన్న ఆచారం. అసలు శుభ లేఖ మీద ఉండేదే “మదర్పిత చందన తాంబూలాలను స్వీకరించి” అని. అంటే, నేను చేసే అతిథి మర్యాదలు స్వీకరించమని అర్థం. ఎవరినైనా సత్కరించాలన్నా, సన్మానించాలన్నా గంధం పూస్తారు. ఒకప్పుడు ఇంటికి వచ్చిన అతిథులకు చందనం ఇవ్వకుండ పంపేవారు కాదు.
షోడశోపచార పూజలో చందనం సమర్పించటం ఒక ఉపచారం. లఘువుగా పంచోపచారాలు చేసినా అందులో గంధం ఉంటుంది. అన్ని సుగంధ ద్రవ్యాలు సమర్పించ లేక పోయినా, మంచి గంధం ఒక్కటి సమర్పిస్తే చాలునన్న మాట. శివుడి అభిషేక ద్రవ్యాలలో గంధం కూడా ఒకటి. సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి వారు ఎప్పుడూ చందనపు పూతతో దర్శన మిస్తూ ఉంటారు. అక్షయ తదియ నాడు చందనోత్సవం జరుపుతారు. లలితా దేవి నామాలలో “చందన ద్రవ దిగ్ధాంగీ” అని ఒకటి ఉంది. మొత్తం శరీరమంతా చందన ద్రవంతో ముంచెత్తినది అని అర్థం. అంటే అమ్మవారికి చందనం అంటే అంత ఇష్టం అన్నమాట. అలంకార ప్రియుడైన విష్ణు మూర్తికి చందనం తయారు చేయటానికి పెద్ద వ్యవస్థే ఉంది. చందనం అంటే గంధపు చెక్కని అరగదీస్తే వచ్చే కలికం. ఇది మన వంటి కలికాలంలో ఉన్న మనుషులకి మాత్రమే. విష్ణుమూర్తికి చందనం తయారు చేయటానికి ఒక పెద్ద వ్యవస్థే ఉందిట! గంధపు చెక్క అరగదీయగా వచ్చిన గంధం మూలం.
దానిలో కాలానుగుణంగా మరెన్నో పరిమళ ద్రవ్యాలు చేరుతుంటాయి. అసలు అరగదీసేప్పుడే మామూలు నీరు కాక పన్నీరు పోస్తారు. అందులో వేసవి కాలం అయితే పచ్చకర్పూరం మొదలైన వాటిని అధికంగా చేర్చుతారు. చలి కాలం అయితే కస్తూరి ఎక్కువగా చేర్చటం ఉంటుంది. పునుగు, జవ్వాది, వట్టి వేళ్ళు, బావంచాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు గంధంలో చేర్చ బడుతూ ఉంటాయి. సదర్భాన్ని పట్టి వీటి పాళ్ళు మారుతూ ఉంటాయి. విష్ణువు ఉపయోగించే చందనం చాలా ప్రత్యేక మైనది, విలక్షణమైనది. తుంబురుని గానాన్ని, వీణా వాదనని మెచ్చిన విష్ణువు అతడిని సత్కరించి ఇచ్చిన హారము, మెరుగు బంగరు వస్త్రము, కన్న నారదునిలో మాత్సర్యాన్ని రగిల్చింది అతడికి విష్ణు మూర్తి తను ఉపయోగించే చందనం పూయటమే! దానికున్న విశిష్టత మాత్రమే కాదు చందనం పూయటం వెనుక ఉన్న గౌరవం నారదునికీ అసూయ కలగటానికి కారణ మయ్యింది.
శ్రీ కృష్ణుడు కంసుని ఆహ్వానంపై మథురా నగరంలో ప్రవేశించే సమయంలో అడగగానే లేపనాలిచ్చిన త్రివక్రను వంకర తీర్చి అనుగ్రహించాడు. అప్పుడు కుబ్జ తన గురించి చెప్పుకుంటూ “ వినిర్మల లేపన విద్య దాన” అంటుంది. అంటే లేపనాలు తయారు చెయ్యటం ఒక ప్రత్యేకమైన విద్య. ఏదో మొక్కు బడిగా గంధపు చెక్కని అరగదీయటం కాదు.
చందనానికి ఇంతటి ప్రాముఖ్యం ఎందుకు?
చందనం అమూల్యమైన మూలిక. ఆహ్లాదకరమైన వాసన కలిగిఉంటుంది. దుర్గంధాన్ని పోగొడుతుంది. రక్త దోషాన్ని, పైత్యాన్ని తగ్గిస్తుంది. ఇది విషాన్ని హరిస్తుంది. క్రిమిహరం కూడా! చల్లగా ఉంటుంది. చల్లదనాన్ని కలిగిస్తుంది. అని చాలా మందికి తెలుసు. అంతే కాదు చందనం అంతస్తాపాన్ని కూడా హరిస్తుంది. ఆ కారణంగానే చందనాన్ని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారు. చందనాది వటి, చందనాసవం మొదలైన ఔషధాలు తయారు చేస్తారు. చాందినీ అత్తరు, సబ్బులు మొదలైన సౌందర్య సాధనాలకి మూలం చందనం.
గంధాన్ని కొంచెం కొబ్బరినీళ్లలో కాని,మంచి నీళ్ళలో కాని కలుపుకుని తాగితే వెర్రి దాహం తగ్గుతుంది. చందన తైలం శరీరానికి చలవ చేస్తుంది. రోజుకి ఒక చుక్క చాలు. సాధారణంగా చక్ర కేళి అరటి పండులో ఒక చుక్క వేసుకుని తింటూ ఉంటారు. జ్వరం చాలా ఎక్కువగా ఉంటే అధిక ఉష్ణోగ్రతని తగ్గించటానికి కణతలకు మంచి గంధం రాస్తారు. వేసవి కాలంలో ఒళ్ళు పేలకుండా ఉండటానికి గంధం పూత ఎంతగానో తోడ్పడుతుంది. ఎన్నో చర్మ వ్యాధులకు, కీళ్ల వాపులకు, జుట్టు రాలటానికి, ఇంక మరెన్నో వ్యాధులకు ఉపశమనం కలిగిస్తుంది గంధపు అనులేపనం. భ్రమను పోగొట్టి, స్మృతిని కలిగిస్తుంది. చెమటను, దుర్గంధాన్ని పోగొట్టి మనస్సుకి ఉల్లాసాన్ని కలిగిస్తుంది కనుక శుభ కార్యల్లోనూ, పేరంటాల్లోనూ, పది మంది గుంపుగా చేరిన చోట గంధం పూసుకుంటు ఉంటారు.
చందనాన్ని చాలా మంది ఆచార పరాయణులు , నుదుటికి, ఛాతీ మీద, జబ్బలకు రాసుకుంటారు.నుదుటిమీద రాసుకుంటే తలలో వేడి చేరకుండా తల నొప్పి రాకుండా రక్షణ నిస్తుంది. గుండెలపై రాసుకోవటం వల్ల హృదయానికి మేలు చేసి,గుండే జబ్బులు రాకుండా చూస్తుంది.
ఆడ వారు సాధారణంగా గంధాన్ని మెడకి, కొన్ని ప్రాంతాలలో దవడలకి రాసుకుంటారు. సాధారణంగా చెమట పట్టి చికాకు కలిగించే ప్రాంతాలు ఇవే. కంఠం ముడి ఉండే ప్రదేశంలో విశుద్ధి చక్రం ఉంటుంది. రెండు వేళ్ళతో ఆ ప్రాంతంలో గంధం పూయటం వల్ల విశుద్ధి చక్రానికి కాపుదల ఉంటుంది.
ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతని సంప్రదాయంలో మిళితం చేసిన సంస్కృతి మనది.
- Dr Anantha Lakshmi