Read more!

బాబాను సందేహించిన సోమదేవస్వామి

 

 

 

శ్రీ సాయిసచ్చరిత్రము నలుబదితొమ్మిదవ అధ్యాయము - 2భాగం

 

బాబాను సందేహించిన సోమదేవస్వామి

 

 

సోమదేవస్వామి

బాబాను పరీక్షించుటకై యింకొకరు వచ్చారు.  కాకాసాహెబు దీక్షిత్ తమ్ముడు భాయీజీ నాగపూరులో నివసించెడివాడు. 1906వ సంవత్సరములో హిమాలయాలకు  పోయినప్పుడు సోమదేవ స్వామి అను సాధువుతో అతనికి పరిచయము కలిగెను. ఆ సాధువు గంగ్రోతికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారములో కలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసికొనిరి. 5 సంవత్సరముల తర్వాత  సోమదేవస్వామి నాగపూరు వచ్చి భాయిజీ యింట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి  వెళ్లి బాబాను చూడవలెనని అతనికి గట్టికోరిక కలిగెను. భాయీజీ వద్దనుంచి పరిచయపు ఉత్తరము తీసుకొని షిరిడీకి బయలుదేరెను. 


షిరిడీ సమీపమునకు రాగానే మసీదుపై రెండు పెద్ద జండాలు కనిపించెను. సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోను వేర్వేరు జీవనపద్ధతులతోను, వేర్వేరు బాహ్యాలంకారములతోను ఉందురు. కాని యీ పైపై గుర్తులను బట్టి యే యోగి గొప్పదనమును కనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతా వేరే పంథాగా దోచెను. రెండు పతాకము లెగురుట చూడగనే తనలో తాను "ఈ యోగికి జండాల పై మక్కువ ఏమిటి? అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తికొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది" అనుకొనెను. ఇట్లు అలోచించుచూ,  షిరిడీకి పోవుట మానుకుంటన్నట్లు తనతోనున్న యితర యాత్రికులకు చెప్పెను. వారతనితో " అట్లయిన ఇంత దూరము ఎందుకు వచ్చారు? జండాలను చూడగానే మీ మనస్సుకు చికాకు కలిగితే, షిరిడీలో రథము, పల్లకీ, గుఱ్ఱము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు కలుగునో?" అని అనిరి. దానికి సోమదేవస్వామి గాభరాపడి " గుఱ్ఱములతోను, పల్లకీతోను, జట్కాలతోను గల సాధువులను నేనెక్కడా  చూడలేదు. అలాంటి  సాధువులను చూచుటకంటె తిరిగిపోవుటయే మేలు" అనెను.   తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యెను. తక్కిన తోటి ప్రయాణీకులు అతనిని తన వక్రాలోచనలు  మాని షిరిడీ లోనికి వెళ్లమని చెప్పిరి.  బాబా  జెండాలను కాని తక్కిన ఆడంబరాలను, కీర్తిని లక్ష్యపెట్టరని చెప్పిరి. అవన్నియు నలంకరించినవారు బాబా భక్తులేగాని అయనకేమి యవసరముగాని సంబంధముగాని లేదనిరి. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని ఏర్పాటు చేశారని చెప్పిరి. తుదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూసేట్లు చేశారు.


 

సోమదేవస్వామి మసీదు దిగువనుంచి బాబాను దర్శించగనే అతని మనస్సు కరిగెను. అతని కండ్లు నీటిలో నిండెను; గొంతుక యార్చుకొని పోయెను. అతని కుంటి యాలోచన లన్నియు అడుగంటి పోయెను. "ఎచ్చట మనస్సు శాంతించి ఆనందము పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము" అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనముకొరకు దగ్గరకు పోగా "మా వేషము మాదగ్గరనే యుండనీ, నీ యింటికి నీవు పొమ్ము. తిరిగి మసీదుకు రావద్దు. ఎవరయితే మసీదుపై జండా ఎగుర వేయుచున్నారో అలాంటి వారి దర్శనము చేయనేల? ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమయిన ఉండవద్దు" అనెను. ఆ స్వామి అత్యంత ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలిసికొనెను.  తాను తెలివితక్కువవాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించెను. బాబా కొందరిని కౌగిలించుకొని, కొందరిని ఆశీర్వదించుచు, కొందరిని ఓదార్చుతూ, కొందరివైపు దాక్షిణ్యముతో చూస్తూ, కొందరివైపు చూసి నవ్వుతూ, కొందరికి ఊదీ ప్రసాదము ఇస్తూ అందరిని అనందింపజేసి, సంతృప్తి పరుచుతున్నారు. 

 తన నొక్కడినే బాబా ఇంత కఠినముగ ఎందుకు జూచుచున్నారో అతనికి అర్థము కాలేదు. తీవ్రముగా ఆలోచించి బాబా చేయునదంతయు తన యంతరంగమున నున్న దానితో సరిగా నుండెనని గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకొని వృద్ధిపొందుటకు యత్నించవలెనని గ్రహించెను. బాబా కోపము మారురూపముతో నున్న ఆశీర్వదమే యనుకొనెను. కొన్నాళ్ళు పిమ్మట బాబాయందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యెను.


నానాసాహెబు చాందోర్కరు


 

ఈ యధ్యాయములో హేమడ్‍పంతు నానాసాహెబు చాందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబు మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చొని వుండగా బీజాపూరునుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను జూచుటకు వచ్చెను. అతనితో ఘోషా స్త్రీ లుండుటచే నానాసాహెబు అచ్చటనుంచి లేచి వెళ్లబోయెను. కానీ బాబ అతనిని ఆపివేసెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసికొనిరి. అందులో ఒక స్త్రీ ముసుగు దీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసికొనెను. నానాసాహెబు ఆమె ముఖసౌదర్యమును జూచి మరల మరల చూడాలనుకొనెను. 

నానా  చాంచల్యం చూసిన బాబా ఆ స్త్రీలు అక్కడ నుంటి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లనెను. "నానా! అనవసరముగా చికాకు ఎందుకు? ఇంద్రియములను వాటి పని వాటిని చేయనిమ్ము.   అందులో మనము జోక్యము కలుగ చేసుకోకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించియున్నాడు, కావున అందరిని చూచి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరిచి వుండగా వెనుక ద్వారము గుండా పోనేల? మన హృదయము స్వచ్ఛముగా నున్నంతవరకు ఏ దోషములేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేల? నేత్రములు వానిపని అవి నేరవేర్చు కోవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేల?" 


అక్కడే వున్నశ్యామా బాబా చెప్పిన దానిని గ్రహించలేక పోయెను. ఇంటికి పోవు దారిలో శ్యామా ఆ విషయమై నానా నడిగెను. ఆ చక్కని స్త్రీ వైపు జూచి తాను పొందిన చంచలత్వమును గూర్చి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి యెట్లు సలహానిచ్చెనో వివరించెను. బాబా చెప్పిన దాని భావము నానా యిట్లు చెప్ప సాగెను. " మనస్సు సహజముగా చంచలమైనది. దానిని ఉద్రేకించునట్లు చేయరాదు. ఇంద్రియములు చలింపవచ్చును. శరీరమును స్వాధీనమునందుంచుకొనవలెను. దాని ఓరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయములవైపు పరుగెత్తును. కానీ మనము వానివెంట పోరాదు. మనము ఆ విషయములను కోరగూడదు. క్రమముగాను, నెమ్మదిగాను సాధన చేయుటవలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడగూడదు. కానీ వాటిని మనము పూర్తిగా స్వాధీనమందుంచు కొనలేము. సమయనుకూలముగా వాటిని అణిచి సరిగా వుంచుకొనవలెను. 

అందమైన వాటిని జూచుట కోసమే కన్నులు యివ్వబడినవి. విషయ సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకుగాని, లజ్జకుగాని అవకాశము లేదు. దురాలోచనలు మనస్సునందుంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను, సహజముగాను స్వాధీనము చేసికొనవచ్చును. విషయము లనుభవించుటలో కూడ నీవు భగవంతుని జ్ఞప్తియందుంచుకొనెదవు. బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీమందుంచుకొని మనస్సును విషయములవైపు పరుగిడనిచ్చినచో, వానిపై అభిమానముండనిచ్చినచో చావుపుట్టుకల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమయినవి. వివేకము (అనగా నిత్యానిత్యములకు భేదము గ్రహించుట) సారథిగా, మనస్సు స్వాధీనమందుంచుకొనవలెను. ఇంద్రియముల ఇష్టం వచ్చినట్లు సంచరింపచేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదమును చేరగలము. అదియే మన గమ్యస్థానము. అదియే మన నిజమైన యావాసము. అచట నుండి తిరిగి వచ్చుటలేదు.

నలుబదితొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము